ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ కేవలం దేవాలయాలు, జలపాతాలు, బీచ్‌లకు మాత్రమే ప్రసిద్ధిచెందింది కాకుండా, ఇక్కడ అనేక రకాల ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వైజాగ్‌లో మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ పార్క్ విశేషాలేంటో చూసేద్దాం..
విశాఖ సాగర్ తీరంలో ఇంటర్నేషనల్ థీమ్ తో భారీ ఎత్తున మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీచ్ రోడ్డులోని సబ్ మెరైన్ ఎదురుగా పోలీస్ మెస్ వెనుక ఉన్న ఎ.యు. గ్రౌండ్స్‌లో ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్‌ను పెట్టారు. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రదర్శన ఇక్కడికి వచ్చే సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభంలో ఓ పెద్ద ఫిష్ ఆకారం ఉంటుంది. ఎంట్రెన్స్‌లోనే గుర్రాలు, ఒంటెలు ఉంటాయి. వాటి సవారీ కూడా చేయొచ్చు. ఇక, ఈ ఎగ్జిబిషన్‌లోకి వెళ్లాంటే ముందుగా టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

టిక్కెట్ ధర ఒక్కొక్కరికి రూ. 150 గా ఉంది. లోపలికి వెళ్లగానే పచ్చని మొక్కలు పర్యాటకులను స్వాగతం పలికేలా ఉంటాయి. కానీ, వాటిని కూడా అమ్మడానికి పెట్టారని తెలుస్తోంది. ఇంతకుముందు ఇదే గ్రౌండ్‌లో ఫిష్ టన్నెల్‌ను నిర్వహించారు. లోపలా మొత్తం అలాగే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్‌లో సముద్ర అంతర్భాగంలో 10 వేల అడుగుల లోతున ఉండే రకరకాల చేపలు కళ్లముందే కదలాడుతున్నాయి. ఇక్కడ టన్నెల్స్, ఆక్వేరియంలో 150 జాతులకు చెందిన 60 వేల విదేశీ, స్వదేశీ చేపలను ప్రత్యక్షంగా చూడొచ్చు. విభిన్న రకాల, విభిన్న జాతుల చేపలు, రంగురంగుల చేపలు అక్వేరియంలో అలా అలా కదులుతూ ఉంటాయి. చేపలతో పాటు తాబేళ్లు కూడా ఉన్నాయి.
150 రకాల విదేశీ పక్షులు, పెంపుడు జంతువులు...
ఈ ఏడాది ప్రత్యేకంగా ఎగ్జాటిక్ బర్డ్, పెట్ షోను కూడా పెట్టారు. వివిధ రకాల చేపలతో పాటు వివిధ రకాల పక్షులు, చిలకలు, లవ్ బర్డ్స్, బాతులు, కుందేళ్లు, ఎలుకలు, కోళ్లు వంటివన్నీ ఈ ఎగ్జిబిషన్‌లో ఉంచారు. ఆస్ట్రిచ్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడికొచ్చే సందర్శకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. ఇక్కడ మొత్తం 150 రకాల విదేశీ పక్షులు, పెంపుడు జంతువులు, ఫ్రెండ్లీ స్నేక్స్ సరికొత్త ఆనందాన్ని చేరువచేస్తున్నాయి. అనేక రకాల పాములు కూడా ఉన్నాయి. దీంతో పాటు వరల్డ్ క్లాస్ ఎమ్యూజ్ మెంట్ రైడ్స్, 100 వరకు హ్యాండ్ లూమ్, హ్యాండి క్రాఫ్ట్ స్టాల్స్,ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి.
చిన్నపిల్లలు ఆడుకునేందుకు గేమ్స్, జేయింట్ విల్ అన్ని ఉన్నాయి. కాబట్టి కుటుంబంతో కలసి సరాదాగా విహరించేందుకు ఈ మెరైన్ ఎగ్జిబిషన్ ఎంతో ఉత్తమమనే చెప్పుకోవాలి. ఈ ఎగ్జిబిషన్ మూడు మాసాల వరకూ ఉంటుందని సమాచారం. ఇక, దీనిని సందర్శించాలంటే మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9.30 వరకు తెరిచి ఉంటుంది. విశాఖపట్నంలోని మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ అధిక సంఖ్యలో నగరవాసులు వెళుతున్నారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో బస్సు సౌకర్యం కలదు. ఏయూ ఇన్ గెట్ ఎదురుగా బీచ్ కి వెళ్లే దారిలో ఏయూ గ్రౌండ్లో ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. మరెందుకాలస్యం పిల్లలతో సరదాగా ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించేయండి మరి...



Click it and Unblock the Notifications












