ఈ సమ్మర్‌లో సమ్మగిరి జలపాతాన్ని చూసొద్దామా?
వేసవి సెలవుల్లో విహారాలకు వెళ్లాలని చాలామంది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు. మరికొందరు ఈ వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రదేశాలు వెతుక్కుంటుంటారు. కొందరైతే, బీచ్‌లుగానీ, జలపాతాలుగానీ, హిల్‌స్టేషన్లను గానీ వాళ్ల జాబితాలో చేరుస్తుంటారు. చల్లని ప్రదేశాలు మాత్రమే కాకుండా, పచ్చని ప్రకృతి నడుమ ప్రశాంతతను కోరుకునేవారికి, అలాగే ఎత్తయిన ప్రదేశం నుంచి జాలువారే నీటి బొట్టులో తడిసి ముద్దవ్వాలనుకునేవారికి ఈ ప్రదేశం ఎంతో అనువైనది. మరెందు కాలస్యం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ఈ అద్భుతమైన జలపాతాన్నిచూసేందుకు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.

సమ్మగిరి జలపాతం
చుట్టూ ఎత్తయిన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం ఇప్పుడు పర్యాటకులతో కళకళలాడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని, నర్సీపట్నం తాలుకాలోని ఎర్రవర్రం గ్రామంలో ఉన్నఒక అందమైన జలపాతం. ఈ జలపాతం లంబసింగికి సమీపంలో ఉంది. దీనిపేరే సమ్మగిరి జలపాతం. కోండకోనల నుండి కిందకు దూకే జలపాతాపు అందాలను ప్రత్యక్షంగా చూస్తు ఇక్కడ చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు.
పచ్చని ప్రకృతి నడుమ ఎత్తయిన జలపాతంలో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టొచ్చు. కనుచూపుమేరంతా పచ్చదనం మధ్యలో చూడచక్కగా కనిపించే ఈ జలపాతం ఇక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది. హోయలొలుకుతున్న ఈ జలపాతపు అందాలను వీక్షించేందుకు చుట్టపక్కల వారే కాకుండా రాష్ట్రంలో నలుమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ జలపాతపు అందాలను మీ కెమెరాల్లో బందించొచ్చు. లంబసింగి వెళ్లే మార్గంలో ఎర్రవరం జలపాతం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందని బోర్డు మనకు కనిపిస్తుంది. లంబసింగి పర్యటనకు వెళ్లే యాత్రికులు తప్పకుండా ఈ జలపాతాన్ని సందర్శించొచ్చు. ఈ జలపాతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్నిచూడాల్సిందే.

జలపాతపు అందాలు..
కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా లంబసింగికి సమీపంలో దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ముందుకు వెళితే అక్కడ జాలువారే జలపాతపు అందాలను చూడొచ్చు. జలాపాతానికి సమీపంలో కొంత ఎత్తువరకు ఆక్రమించిన బండరాళ్లపై పర్యాటకులు నిలబడి జలపాతం కింద తడవడానికి వీలవుతుంది. కానీ, ఈ ప్రాంతంలో జాగ్రత పాటించడం మంచిది. ఏడాది పొడవునా ఉండే జలపాతం ఇది. ట్రెక్కింగ్ ప్రియులకు ఎంతో అనువైన ప్రదేశం ఇది. ఈ వేసవిలో కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు. ఈ జలపాతపు ప్రయాణం మీకు ఎంతో థ్రిల్‌ను అందిస్తుంది.
ఎందుకంటే ఈ ప్రయాణం దట్టమైన అటవీప్రాంతంలో ఉంటుంది. ఈ జలపాతాన్ని చేరుకోవడానికి నర్సీపట్నం నుండి ఎర్రవరం గ్రామం వరకు క్యాబ్ కానీ ఆటోను కానీ తీసుకుని వెళ్లొచ్చు. అక్కడినుంచి అటవీప్రాంతంలో ఐదుకిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం ట్రెక్కింగ్, క్యాంపింగ్‌కు అనువైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు.ఈ జలపాతం పది అడుగుల ఎత్తు మరియు 15 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉంది.

ఎలా చేరుకోవాలి.
ఇది విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లంబసింగి నుండి 20 కిలోమీటర్ల దూరంలో మరియు నర్సీపట్నం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతం నర్సీపట్నం -చింతపల్లి రోడ్డులో ఉంది. విశాఖపట్నం నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం కలదు. ముందుగా విశాఖపట్నం నుండి నర్సీపట్నం చేరుకోవాలి. ఆ తర్వాత చింతపల్లి బస్‌ద్వారా ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications












