మడ అడవులు పేరు వింటే చాలు ఓ వైవిధ్యభరితమై ప్రకృతి సౌందర్యం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. వినసొంపైన సముద్రపు అలల సవ్వడులకు కూతవేటు దూరంలో కనువిందుచేసే ఈ ప్రకృతి సౌందర్యాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే. వేలాది ఎకరాల విస్తీర్ణంతో పశ్చిమబంగాలోని సుందర్‌బన్ ప్రాంతం అతిపెద్ద మడ అడవులుగా పేరుగాంచాయి. ఆ తర్వాత స్థానంలో కాకినాడకు సమీపంలోని కోరింగ అభయారణ్యం ఉంది. ఇక్కడి అధికారులు పర్యావరణ పరిరక్షణకు మడ అడవులు చేసే మేలు తెలుసుకునేలా చేయడంతోపాటు పర్యాటకులను మడ అడవుల్లోకి తీసుకెళ్లి మరిచిపోలేని జ్ఞాపకాలను చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కోరింగ అభయారణ్యం ఉంది. ఇది పూర్తిగా మడ అడవి. నిజానికి, సముద్రం, నది కలిసే చోట ఉన్న చిత్తడినేలల్లో పాతుకు పోయే చెట్ల సముదాయాన్నే మడ అడవులుగా పిలుస్తారు. గుబురుగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోతలూ, ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించే సహజ కోటలుగా పర్యావరణవేత్తలు అభివర్ణిస్తారు.
కాకినాడకు దగ్గరలో విస్తరించి ఉన్న దాదాపు ముప్ఫై కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లతో పర్యటకులను ఆకర్షించేలా రూపొందించారు. ఎన్నో అరుదైన జీవజాతులకు ఆవాసంగా నిలుస్తోన్న ఈ నీటి పాయల్లో బోటు విహారం సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనడంలో సందేహమే లేదు. జీవవైవిధ్యాన్నీ, ప్రకృతి రమణీయతనీ ఆస్వాదిస్తూ మడ అడవుల్లో కాలుమోపడం కూడా ఆహ్లాదాన్ని అందిస్తుంది. కోరింగ అభయారణ్యంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ అలాంటి ప్రత్యేక అనుభూతే కలుగుతుందంటే నమ్మండి!

అరుదైన జీవరాసుల ఆవాసం..
కోరింగ అభయారణ్యం సముద్రాన్ని ఆనుకుని ఉండడంతో ఈ వనంలో నీటి పాయలు ఉన్నాయి. ఈ పాయల్లో బోటు ప్రయాణం అంటే.. పచ్చదనంతో నిండిన గోడలను చీల్చుకుంటూ ముందుకు సాగుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ ప్రయాణంలో దాదాపు 35 రకాల మడ వృక్షాల(మ్యాంగ్రూవ్ ప్లాంట్స్)ను చూసే అవకాశం ఉంది. అంతేకాదు, అరుదైన 120 రకాల జాతుల పక్షుల వినసొంపైన కిలకిల రావాలను చెవులారా ఆస్వాదించవచ్చు. అరుదైన జాతుల జాబితాలో ఉన్న నీటి పిల్లలకు ఈ మడ అడవులు ప్రధాన ఆవాసాలుగా గుర్తించబడ్డాయి.
వాటితోపాటు నీటి కుక్కలూ, ఆలివ్‌రిడ్లే తాబేళ్లూ బోటు ప్రయాణంలో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. మడ అడవుల్లో కాలినడకన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే, ఇక్కడ కాలు మోపడం కష్టం. ఎందుకంటే ఈ ప్రాంతమంతా బురదతో నిండి ఉంటుంది. దీనిని గ్రహించిన అధికారలు చెక్క రహదారిని ఏర్పాటు చేశారు. ఈ దారిలో చెక్క వంతెనపై నడుచుకుంటూ మడ అడవుల అందాలను కనులారా ఆస్వాదించాల్సిందే.

బ్రిటీష్ కాలం నాటి లైట్‌హౌస్..
ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రపు కెరటాల సుందర దృశ్యాలతోపాటు పచ్చదనం కమ్మేసిన మడ అడవుల అందాలను చూసేందుకు మరో అవకాశం ఉంది. అదే కోరింగ అభయారణ్యంలో ఉన్న ఎత్తయిన వ్యూ పాయింట్. ఆ దృశ్యాలను ఎంతసేపు చూసినా సమయమే తెలియదంటే చెప్పండి. అంతేకాదు, ఇక్కడ విడిది చేయాలనుకునేవారికి సమీపంలోని చొల్లంగి పర్యటక ప్రాంత ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో బస చేయవచ్చు.
అక్కడి నుంచి బోటుపైన గంటన్నర ప్రయాణిస్తే బ్రిటిష్ కాలంలో కట్టిన లైట్‌హౌస్ దగ్గరకు చేరుకోవచ్చు. కోరింగ ప్రాంతంలోని పర్యటక కేంద్రంలోని మినీ థియేటర్‌లో మడ అడవుల ప్రత్యేకతలూ, ఇతర ఆసక్తికర విశేషాలకు సంబంధించిన డాక్యుమెంటరీలని పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు.



Click it and Unblock the Notifications












