Search
  • Follow NativePlanet
Share
» »కొండ కోన‌ల న‌డుమ భైర‌వ‌కోన అందాలు..

కొండ కోన‌ల న‌డుమ భైర‌వ‌కోన అందాలు..

కొండ కోన‌ల న‌డుమ భైర‌వ‌కోన అందాలు..

అక్క‌డి కొండల మధ్య నుంచి సవ్వడి చేస్తూ దూకుతున్న ఎత్తయిన జలపాతాన్నిచూడగానే కేరింతలు కొట్టాల్సిందే. నింగిని తాకుతున్నాయా అనిపించే వృక్షాలు ప్రకృతి దృశ్యానికి అద్దం ప‌డ‌తాయి. పక్షుల కిలకిలారావాల సందడి మధ్య పిల్లల కేరింతలు గాలిలో క‌లుస్తాయి. అక్కడి ఆహ్లాదభరిత వాతావరణం అందరినీ ఉత్సాహపరుస్తుంది. అదే.. అనేక శిల్పారామాలను సొంతం చేసుకున్న మహత్తర ప్రాంతం భైరవకోన. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక క్షేత్రం ఇదేనని చాలామంది విశ్వ‌సిస్తారు. అలాంటి భైర‌వ‌కోన ప్ర‌యాణ‌పు అనుభ‌వాలు మీకోసం..

ఒంగోలు నుంచి భైరవకోన సుమారు 150 కిలోమీటర్లు ఉంటుంది. మా కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి వేకువనే బయలుదేరాం. నిద్రలో తూలుతున్న పిల్లల్నీ కారు ఎక్కించేశాం. కందుకూరు మీదుగా రెండు గంటల ప్రయాణం తర్వాత ఒంగోలుకు 110 కిలోమీటర్ల దూరంలోని పామూరు చేరుకున్నాం. అప్పటికి టిఫిన్ చేసేందుకు ఇంకా సమయం ఉండటంతో ఓ హోటల్లో పార్శిల్ చేయించుకుని, మా ప్రయాణం కొనసాగించాం.

ఆహ్లాదకరం 'అనుమనగిరి'

ఆహ్లాదకరం 'అనుమనగిరి'

అలా పామూరుకు ఏడు కిలోమీటర్ల దూరంలోని అనుమనగిరి చేరుకున్నాం. దాన్నే అనుమనకొండ అని కూడా అంటారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. పెద్ద పెద్ద వృక్షాల కింద కుటుంబసమేతంగా కొద్దిసేపు సేదదీరాం. అక్కడే అల్పాహారం పూర్తిచేశాం. అది శివరామబ్రహ్మ మఠం! పోతులూరి వీరబ్రహ్మం మనుమడు శివరామబ్రహ్మ! అతను అక్కడే తపస్సు చేసి దుర్గాదేవిని కొలిచాడని విశ్వ‌సిస్తారు. ఆ మఠం గర్భగుడి నుంచి నేరుగా భైరవకోనకు సొరంగం మార్గం ఉంది. దాన్ని చూసిన పిల్లలు అబ్బురపడ్డారు.

సందర్శనా స్థలంగా ‘కోవిలంపాడు'

సందర్శనా స్థలంగా ‘కోవిలంపాడు'

అనుమనగిరికి ఏడు కిలోమీటర్ల దూరంలోని కోవిలంపాడు ఆ ప్రాంతంలో ఓ పెద్ద సందర్శనా స్థలంగా భాసిల్లుతోంది. దాన్నే మిట్టపాలెం అని అంటారు. అక్కడ నారాయణస్వామి గుడి ఉంది. ఉపాధి కోసం వలసవెళ్ళి బెంగళూరు, ముంబయి, పూణె, విజయవాడ, మైసూరు లాంటిచోట్ల వ్యాపారాలు చేసుకునే వారంతా ఏడాదికి ఒక్కసారైనా ఇక్కడకు వచ్చివెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. అందరితో కలియతిరుగుతూ అక్కడి ప్రశాంతతను ఆస్వాదించాం. అప్పటికే పిల్లలంతా భైరవకోనకు ఇంకా ఎంత దూరం వెళ్లాలంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో అక్కడినుంచి వెంటనే బయలుదేరాం.

ప్రకృతి సోయగం 'భైరవకోన'

ప్రకృతి సోయగం 'భైరవకోన'

కోవిలంపాడు నుంచి 26 కిలోమీటర్ల దూరంలోని భైరవకోన చేరేలోపు కనిపించిన గ్రామీణ దృశ్యాలను పిల్లలు ఆసక్తిగా చూడసాగారు. మా వెహికల్‌కు అడగుడుగునా మేకలు, గొర్రెలు, బర్రెలు, ఆవుల మందలు దారిని ఇచ్చేందుకు కాస్త మొండికేశాయనే చెప్పాలి. అలా వాటిని తప్పించుకుంటూ సాగింది మా ప్రయాణం. మండల కేంద్రమైన చంద్రశేఖరపురం దాటుకుని అంబవరం పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చేరాం. ఆ గ్రామానికి చేరువగా ఉన్న ఎత్తయిన కొండలు ఆహ్లాదంగా ఆహ్వానించాయి. ఉదయపు ఎండ పడుతుండగా ఆ కొండలు బంగారు వన్నెతో మెరుస్తూ అబ్బురపరిచాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో తూర్పు కనుమల మధ్య ఉండే ఆ కోనకు వెళుతుంటే ప్రకృతి పరవశం ఒంటిని తాకింది. | కోన సమీపానికి చేరగానే పిల్లల సందడికి అంతే లేకుండా పోయింది.

భైర‌వ‌కోన ఎనిమిది దేవాలయాల క్షేత్రం. ఎనిమిది దేవాలయాలనూ ఒకే రాతిపై చెక్కడం ఇక్క‌డి విశేషం. ఎనిమిది రూపాలతో శివుడిని ఈ క్షేత్రాలలో చూడవచ్చు. బర్గేశ్వర ఆలయంలో త్రిముఖ దుర్గాంబ విగ్రహాన్ని రాతితో మలిచారు. ఈ ఆలయంలో కాళభైరవుని విగ్రహాన్ని అద్భుతంగా చెక్కారు. కోనలో ఏకశిల ఆలయాలు, వాటిలో మలిచిన విగ్రహాలు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా అవి నిలిచాయి. ఏకశిలలో నిర్మించిన మొదటి ఆలయాన్ని చతురస్రాకారంలో ఉండే గర్భాలయంగా మలిచారు. మిగిలిన నాలుగు గృహాలయాల ముందు రెండు స్తంభాలతో కూడిన ముఖ మండపం ఉంటుంది. గర్భగుడులలో ప్రవేశద్వారాలకు ద్వారపాలకులు, వారికిరువైపులా బ్రహ్మా, విష్ణువు విగ్రహాలను నిర్మించారు. ఆలయాలన్నింటి ముందు నంది విగ్రహాలు చెక్కారు. క్రీస్తుశకం ఏడు, ఎనిమిది శతాబ్దాలకు చెందిన శిల్పకళా శైలితో ఆలయాలను నిర్మించారని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. దుర్గాదేవి ఆలయానికి మూడు అడుగుల దిగువన ఏడాది పొడవునా ప్రవహించే సెలయేరు ఉంది. ఈ ' క్షేత్రాన్ని కాలభైరవుడు పరిపాలించాడని ప్రజల నమ్మకం. అందువల్లనే ఈ ప్రాంతానికి 'భైరవకోన' అని పేరు వచ్చిందంటారు.

కొండల మధ్య సుందర కోన!

కొండల మధ్య సుందర కోన!

చంద్రశేఖరపురం మండలం శ్రీ అంబవరం కొత్తపల్లికి ఐదు కిలోమీటర్ల దూరం వరకూ కొండ విస్తరించి ఉంది. ఈ క్షేత్రానికి ఉత్తరంగా రాజులకోట నిర్మితమై ఉంది. కొండ చుట్టూ 10 కిలోమీటర్ల వరకూ కోటగోడ నిర్మితమైంది. కోనకు వచ్చే పర్యాటకులకు బంగారు రంగులో ఉండే 'మేకపోతు సెల' పర్వత ప్రాంతం స్వాగతం పలుకుతుంది. మేకపోతుకు వస్తువులను కట్టి ఇక్కడకు చేరవేసే వారని పూర్వీకులు చెప్పేవారు. దీనికి ఎదురుగా ఉండే 'నారపేట సెల' నుండి కోనలోకి అడుగుపెట్టాలి. హాలీవుడ్ చిత్రం 'మెకన్నాస్ గోల్డ్'లోని దృశ్యాలను ఇక్కడి వాతావరణం గుర్తు చేస్తుంది. సూర్యోదయం వేళ ఇక్కడ బంగారు గనులున్నట్లు కొండ నుంచి వచ్చే మెరుపులు భ్రమింపజేస్తాయి.

శిఖరంపై మరెన్నో వింతలు

శిఖరంపై మరెన్నో వింతలు

శిఖరం పై కోటిన్నొక్క శివలింగాలు ఉన్నాయని చరిత్రకారులు విశ్లేషించారు. శిఖరంపై కొంత దూరంలో లింగాలపెంట ప్రాంతం ఉంది. సుమారు 500 సంవత్సరాల నాటి మర్రిమానులు అక్కడ విస్తరించి ఉన్నాయి. 101 దొనలు, నీటి కొలనులు కొండ పై ఉన్నాయని చెబుతుంటారు. కొండపై కోటగోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడకు రంధ్రాలు పడ్డాయి. కోటపై జండాలు ఉంచే ప్రదేశాన్ని 'జండాబోడు' అంటారు. రాజుల ప్రాకారంలో సొరంగ మార్గం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకునేవారట. శత్రువుల కంటపడకుండా ఉండే ఈ దారి'అనుమగిరి'కి చేరుతుందట. దీన్నే చరిత్రకారులు కానరాని కంత'గా వ్యవహరించారు. కొండకు దక్షిణంవైపున ఉండే శిఖరం పై పంచలింగాల ఘట్టం ఉంది. ఆయా ప్రాంతాలకు వెళ్లగలిగే సాహసం ఎవరూ చేయడం లేదని కోన కథను వివరించిన స్థానికులు తెలిపారు.

పౌర్ణమి అందాలు

పౌర్ణమి అందాలు

ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని కాంతి, అక్కడి ఆలయానికి మూడడుగుల దిగువున ప్ర‌వ‌హించే సెలయేటిలోని నీటిపై పడి, ఆ పూర్ణచంద్రుని ప్రతిబింబం దుర్గాదేవి ప్రతిమపై పడుతుంది. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటుందని చెబుతుంటారు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు ఆ రోజున భక్తులు విరివిగా క్షేత్రానికి తరలి వస్తుంటారు. ఇక్కడి ఔషధ మొక్కలను కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తారని చెబుతుంటారు.

ఈ కోన వివరాలన్నీ తెలుసుకుని, ఆనందంగా జలపాతం వద్ద జలకాలాడాం. కొందరు జలపాతం మధ్యలోని కొండ గుహ వద్దకు ఎగబాకారు. సందడి చేశారు. తర్వాత ఏకశిలా ఆలయాలను సందర్శించాం. రాళ్లమధ్య నుంచి ఉబికి వస్తున్న జలాన్ని ఆసక్తిగా చూస్తూ పిల్లలు కేరింతలు కొట్టారు. సెలయేరుల్లో చిందులేశారు. కొండలెక్కి, గుట్టలెక్కి కేకలేశారు. అలసిసొలసిన తర్వాత అక్కడ జరిగే నిత్యాన్నదానంలో రుచికరమైన భోజనం అందుకుని తిరుగు ప్ర‌యాణమ‌య్యాం.

More News

Read more about: bhairav kona
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+