Search
  • Follow NativePlanet
Share
» »కొండ‌ల‌లో దాగి ఉన్న తుంబుర తీర్థం అందాలు!

కొండ‌ల‌లో దాగి ఉన్న తుంబుర తీర్థం అందాలు!

కొండ‌ల‌లో దాగి ఉన్న తుంబుర తీర్థం అందాలు!

శేషాచలం అటవీ ప్రాంతంలోని తిరుమల కొండల్లో దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన సుందరదృశ్యం తుంబుర తీర్థం. ఆదిమ మానవులు సంచరించినట్టు, నివాసమున్నట్టు ఆధారాలున్న ప్రాంతం ఇది. ట్రెక్క‌ర్‌లు, సాహసికులు, అన్వేషకులు ఇక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. జలనిక్షేపాలకు ఆలవాలం ఈ ప్రాంత పరిసరాలు. మా బృందం.. పరవళ్లు తొక్కే ఇక్క‌డి నీటి అందాలను ఆస్వాదిస్తూ సాగిన తుంబుర తీర్థం ప‌ర్యాట‌క విశేషాలు మీ కోసం.

తిరుమలకు ద‌గ్గ‌ర‌లో ఏదైనా సాహ‌స యాత్ర చేసేందుకు మా బృందం సిద్ధ‌మైంది. దాంతో మేమంతా తిరుమ‌ల‌కు సుమారు ఏడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న తుంబుర తీర్థం వెళ్లాల‌ని నిర్ణయించుకున్నాం. ఒక విధంగా ఇది సాహ‌స‌యాత్రే. ఇక్క‌డి జలపాతపు అందాల గురించి విన‌డ‌మే త‌ప్ప నేరుగా చూడ‌లేదు. ఆ అవ‌కాశం ఇప్పుడు వ‌చ్చింద‌ని ఉత్సాహంగా బ‌య‌లుదేరాం. అక్క‌డ‌ అత్యంత కష్టమైన సన్నని రహదారి పల్లానికి ఉంటుంది. అంతేకాదు, దగ్గరకు వెళ్లే కొలదీ పెద్ద పెద్ద బండరాళ్లను, లోతైన సనందన తీర్థాన్ని దాటుకుంటూ వెళ్లాల్సిందే. వర్షం పడిందంటే ఈ రహదారి 'యమ'డేంజర్.

జారిపడితే ఎక్కడ ఉంటామో తెలియదు. మేం బ‌య‌లుదేరిన స‌మ‌యంలో కాస్త వ‌ర్షం ప‌డ‌డంతో మా గుండె వేగం పెరిగింది. అయితే జలపాతం కిందకు వెళ్లి స్నానం చేస్తుంటే మాత్రం మ‌న అలసట అంతా ప‌టాపంచ‌ల‌వుతుంది. మనస్సు పరవళ్లు తొక్కుతూ, ఎంతసేపైనా ఆ జలపాతం వద్ద కేరింతలు కొట్టాలనిపిస్తుంది. జలపాతం నుంచి పైకి చూస్తే రెండుగా చీలిన కొండల్లోనుంచి ఆకాశం అద్భుత సన్నివేశం. మా అనుమానాలు పటాపంచాలు చేస్తూ యాత్ర జయప్రదమైంద‌నే చెప్పాలి. అంతేకాదు, కష్టానికి తగిన ప్రతిఫలం కనిపించింది.

దారి పొడవునా చెట్లు, కొండలు, సెలయేళ్లు, నీటిమడుగులు, పెద్దలోయలు తారసపడ్డాయి. అడవి పులులు, ఎలుగుబంట్లు, రేసుకుక్కలు, అడవిపందులు, కణుజులు, కొండగొర్రెలు, ఆలవలు, మింటవలు, కొండచిలువలు, కట్లపాములు, కోతులు, కోడిపుంజులు, పచ్చపావురాళ్లు, పూరుడు పిట్టలు, పిల్లులు, దేవాంగ పిల్లులు, బెట్టుడతలు, సాలెపురుగులు, సీతాకోక చిలుకలు, ఎర్రచందనం, జాలరి బిల్లు, కరక, అడవి మామిడి, బూరుగు, ఉసిరి, గు, వెదురు, దేవదారు చెట్లు, మిన్నాగు, నీలిరంగు సాలెపురుగు, మచ్చంగి, పెద్దపులి వంటి అనేక వణ్యప్రాణులకు ఆవాసంగా ఉంటుందని అక్క‌డి సిబ్బంది చెప్పారు.

ప్రాంత విశేషాలు!

ప్రాంత విశేషాలు!

మొత్తంగా శేషాచలం అడవుల్లో 108 తీర్థాలున్నట్లు చెబుతారు. వీటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది తుంబుర తీర్థంగా చెప్పబడే ఘోణతీర్ధం. తూర్పు కనుమలు, దక్కను పీఠభూమికి చెందిన శేషాచలం అటవీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో ఉంది. తిరుపతి - కడప రాష్ట్ర హైవే మీద గల మామండూరు, కుక్కలదొడ్డి గ్రామాలనుంచి ప్రయాణిస్తే తుంబుర తీర్థం చేరుకోవచ్చు.

కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్ధానికి 14 కిలోమీటర్లు అట‌వీ ప్రాంతంలో ప్రయాణం చేయాలి. కుక్కలదొడ్డికి పశ్చిమంగా పందిగుంట, బండి ఇరుసులు, చాకిరేవు బాస, పగడమాను కరువుకోనమొత్తం, చెంచమ్మలపేట, సన్యాసోడివిగ‌విల మీదుగా తుంబుర కోన చేరుకొనే మార్గం. అలాగే, తిరుమల కొండ చేరుకుని పాపనాశనం డ్యాం నుంచి సనకసనందన తీర్ధం, సలీంద్ర బండ, పింగదీసిన మడుగు మీదుగా ఏడుకిలోమీటర్లు ఓ లోయలోకి దిగుతూ ప్రయాణం చేసి తుంబుర తీర్థం చేరుకోవచ్చు.

చారిత్రక ఆనవాళ్లు!

చారిత్రక ఆనవాళ్లు!

కోట్లాది సంవత్సరాల క్రితం భూమి పరిణామ క్రమంలో భాగంగా ఓ పెద్ద కొండ అమాంతం రెండుగా
విచ్చుకుని తోవ విడిచినట్టు ఓ మార్గం ఉంటుంది. ఆ దారిగుండా సుమారు ముప్పావు కిలోమీటరు ముందుకెళితే సుందర తీర్ధ జలపాతం దర్శనమిస్తుంది. కొబ్బరికాయ రెండు చెక్కలైనట్టుగా నారికేళ జలం చిప్పిల్లినట్లు కొండలమధ్య దృశ్యం కనపడుతుంది. అక్క‌డ‌కు చేరుకోవటం ఒక ఎత్తయితే, కోన నుంచి తీర్ధస్థలికి వెళ్లటం మరో ఎత్తు. ఎన్నో అమూల్యమైన మూలికల సారాన్ని ఇముడ్చుకుని ప్రవహిస్తుంది ఈ జలపాతం. జీవజాలం, మనిషి పుట్టుకే ఆశ్చర్యమనుకుంటే.. ఆ ఆవిర్భావానికి కారణమైన మూల ప్రకృతి మరింతటి నిబిడాశ్చర్యకరం. అలాంటి కుతూహలం రేకెత్తించే ప్రాకృతిక చమత్కృత శిలాశిల్పాలయం తుంబుర తీర్థం. సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నాటి చిత్రాలు తుంబుర కోన సన్యాసోడి గవికి నడుమ, బూచోళ్ల పేటకు దిగువగల సేలయేటి పాయకు అవతలిగట్టున ఓ రాతి బండలకు బొమ్మలు కనిపిస్తాయి.

ఆదిమానవులు చిత్రాల రూపంలో చరిత్రను శిల్పించారు. రాతిరేఖలు తెలుపు, ఎరుపురంగుల్లో ఉంటాయి. ఏనుగుపై సవారీ, పిట్టలు, చారలపులి, ఆటపాటల సన్నివేశాలు చిత్రించారు. ఇప్పటికీ చెక్కుచెదరని ఈ కుడ్య చిత్రాలు తయారీకి మూలికారసాలు, ఖనిజద్రవ్యాలు కలగలపి వర్ణాలుగా వాడారు. రాతిగోడనే కాన్వాసుగా మలచుకుని తమ భావాలకు రూపం పోశారు. ఈ ఆరుబయలు ఆర్ట్ గ్యాలరీ నిజానికి నాటి మనుషుల మతారాధానా నిలయంగా భావించొచ్చు. ఇలాంటివి శేషాచలం అడవుల్లో మరెన్నో ఉన్నాయి.

జీవ వైవిధ్య వాటిక..

జీవ వైవిధ్య వాటిక..

మడపమాను తీగలు ఈ ప్రాంతంలో చుట్టలు, చుట్టుకుని అడవిలో విస్తరించి కనిపిస్తుంటాయి. చుట్ట చుట్టుకుని పడుకున్న అనకొండలు లాగా భ్రమిస్తాము. కొన్ని కిలో మీటర్ల దూరం వరకు విస్తరించి ఉన్న మడపతీగెలు చాలా దృఢంగా ఉండి స్ప్రింగుల్లాంటి స్థితి స్థాపకత్వం కలిగి ఉంటాయి. వీటి కాయల్లోని పప్పును కీళ్లనొప్పులు నివారిణిగా మందుల్లో వాడుతారు. ఈ లోయలో ఉదయపు నీరు బంగారు రంగు, క్రమంగా నారింజ, పసుపుపచ్చ, ఊదా, ముదురు గోధుమ రంగులతో వర్ణశోభను సంతరించుకుంటూ ఎంతగానో ఆకర్షించింది.

సూర్యకాంతి నిట్టనిలువుగా పడేటప్పుడు ఒకలా, ఏటవాలుగా పడేటప్పుడు మరోలా కాంతి తరంగ దైర్ఘ్యాన్ని అనుసరించి వర్ణసయ్యాట సాగుతుంది. సముద్రమట్టానికి 1200 నుంచి మూడు వేల అడుగుల ఎత్తుదాకా ఈ కొండల శ్రేణి ఉంది. ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు మార్పులకు చేర్పులకు లోనవుతూ ఉంటుంది. ఇటీవలే శేషాచలం ప్రాంతాన్ని 'జీవ వైవిధ్య వాటిక'గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ అరుదైన ఎర్రచందనం విస్తారంగా దొరుకుతుంది.

'ఉక్కుకొయ్య'గా పేరొందిన ఎర్రచందనానికి ప్రపంచంలో అత్యంత విలువైన కొయ్యగా పేరుంది. వందేళ్లకిందట అంతరించి పోయిందనుకున్న బంగారు బల్లి ఈ ప్రాంతంలో తిరిగి కన్పించింది. అమెరికాలోని ఉటా దగ్గర గల గ్రాండ్ కెన్సాన్, అరిజోనా రాష్ట్రంలోని ఎంటిలోప్ కెన్సాన్‌కు వారసురాలుగా తుంబుర కెన్సాన్‌ను గుర్తించారు. ఇక్క‌డి అరుదైన ఈ సుందర దృశ్యాలు చూడాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. బృందాలుగా మాత్రమే వెళ్లటానికి అవకాశముంది. ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న ట్రెక్కింగ్ ఔత్సాహికులను వెంట తీసుకెళ్లాలి. లోయలోకి వెళ్లేటప్పుడు తిరుమలు పాపనాశనం నుంచి, బయటకు వచ్చేటప్పుడు కుక్కలదొడ్డి మార్గంలో నడక సాగిస్తే కష్టం తగ్గుతుంది. మరెందుకు ఆలస్యం.... మీ సాహ‌స యాత్ర‌ను మొదలుపెట్టండి!

More News

    Read more about: thumbura theertham
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+