దేశంలో ప్రసిద్ధిచెందిన షూటింగ్ స్పాట్‌లకు లెక్కేలేదు. కానీ, చాలామంది దర్శకులు, నిర్మాతలు సినిమాలు తీయాలంటే విదేశాలకు వెళ్తుంటారు. కానీ, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా ప్రసిద్ధిచెందిన షూటింగ్ స్పాట్‌లున్నాయి. ఒకప్పటి దర్శక నిర్మాతలు ఇండస్ట్రీలో హిట్ సాధించాలంటే ఈ ప్రాంతాల్లోనే బొమ్మ తీసేవారు. అంతటి పేరుగాంచిన షూటింగ్ స్పాట్‌లు ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇక్కడ తీసిన ప్రతి ఒక్క సినిమా హిట్‌ను సొంతం చేసుకుంది. ఆ ప్రదేశాలేంటో చూసేద్దాం పదండి.
1962 సంవత్సరం నుంచి..
ఏపీలోని అందమైన ప్రదేశం తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడి అందాలు మాటల్లో వర్ణించడం చాలా కష్టం. జిల్లాలోని కోడూరుపాడు, గుడాల గ్రామాలు ఒకప్పడు షూటింగ్ స్పాట్స్‌కు ప్రసిద్ధిచెందినవి. కోనసీమ-గోదావరి ప్రాంతంలోని పచ్చని చెట్లను ఒకప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మనం చూడొచ్చు. అల్లవరం మండలంలోని ఈ రెండు గ్రామాల్లో 1962 సంవత్సరం నుంచి చాలా తెలుగు సినిమాలు షూటింగ్‌లు జరిగాయి. ఈ రెండు గ్రామాల్లో చేసిన సినిమాలు బాక్సాఫీస్‌లను షేక్ చేశాయి. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు ఈ ప్రాంతాల్లో సినిమా చేస్తే హిట్ అవుతాయని బలమైన సెంటిమెంట్‌ను కలిగి ఉన్నారు.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా...
అప్పట్లో చాలామంది తెలుగు నిర్మాతలు, హీరోలు తమ సినిమా విజయం సాధించేందుకు జిల్లాలోని కోడూరుపాడు, గుడాల గ్రామాల్లో ఒక్క షాట్ అయినా తీయాలనుకునేవారు. ఒకప్పటి స్టార్ హీరోలు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, రాజశేఖర్, విజయశాంతి, జయసుధ వంటి సీనియర్ నటులెందరో ఇక్కడే సినిమాలు తీశారు. మంచి మంచి హిట్‌లను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నటుడు శర్వానంద్, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, శ్రీహరి, నాని వంటి హీరోలు పరిచయమైంది కూడా ఈ ప్రాంతాల్లోనే. భానుమతి గారు మొగుడు, శివయ్య, జీవనజ్యోతి, అష్టాచమ్మా, శ్రీనివాస కళ్యాణం,
తమానంభవతి వంటి చిత్రాల్లోని పలు సన్నివేశాలు ఈ ప్రాంతాల్లో షూటింగ్ జరిపినవే. ఈ రెండు గ్రామాల్లో కేవలం టాలీవుడ్ సినిమాలు తీయడమే కాదు.. బాలీవుడ్ సినిమాలను కూడా చిత్రీకరించారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలోని పలు సీన్స్‌ను కోడూరుపాడులో షూటింగ్ చేసినవే. అమీర్ ఖాన్ రాకతో ఈ గ్రామాలు జాతీయ స్థాయిలో పేరుదక్కించుకున్నాయి.

టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలు..
2009లో నాని, స్వాతి నటించిన అష్టాచమ్మా చిత్రం ఎంత సక్కెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ ప్రాంతంలోనే జరిగింది. పోలిశెట్టి భాస్కరరావుకు చెందిన 'మండువ లోగిలి' అనే సంప్రదాయ ఇంట్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. గూడాలోని ఎకరం స్థలంలో వందేళ్ల క్రితం నిర్మించిన అందమైన ఇంట్లో ఈ షూటింగ్‌లు జరిపేవారు. మండువ లోగిలి గృహాలు ఒక్క ఈ జిల్లాలోనే కాకుండా పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, వైఎస్ఆర్ కడపలోని కొన్ని గ్రామాలలో ఇప్పటికీ కనిపిస్తాయి. నటుడు శర్వానంద్ నటించిన శతమానం భవతి ఇటీవలి కాలంలో వచ్చి భారీ హిట్‌ను సొంతం చేసుకుంది.
ఆ సినిమా షూటింగ్ కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. అంతేకాదు, నితిన్ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం కోడూరుపాడు గ్రామంలోనే షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలు ఎంతటి సక్సెస్‌ను చవిచూశాయో అందరికీ తెలిసిందే. దిల్ రాజు, ఇంద్రగంటి మోహనకృష్ణ, వేగేశ్న సతీష్ వంటి అగ్ర నిర్మాతలు ఈ ప్రాంతాల్లో షూటింగ్‌ను ఓ సెంటిమెంట్‌గా భావిస్తున్నారు.
సినిమాలతో పాటు పలు సీరియల్స్‌ను కూడా ఇక్కడ చిత్రీకరించారు.



Click it and Unblock the Notifications












