భారత్‌లో పురాతన దేవాలయాలకు కొదవే లేదు. ఒక్కో ఆలయంలో ఒక్కో విశిష్టత ఉంటుంది. అందులో కొన్ని ఆలయాలు నిర్మాణశైలితో పర్యాటకులను ఆకర్షిస్తే, మరికొన్ని వాటి చారిత్రక నేపథ్యంతో యాత్రికులను తమవైపు తిప్పుకుంటాయి. అలాంటి ఆలయాల జాబితాలో ఒకటి మధ్యప్రదేశ్ వెలసింది. ఆ దేవాలయం తలుపులు ఏడాది మొత్తంలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటాయి. ఆ ఒక్కరోజులోనే ధూప, దీప నైవేద్యాలతో ఈ ఆలయంలోని స్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలా పూజలు అందుకుంటున్న ఆ దేవుని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం పదండి.
నాగపంచమి సందర్బంగా..
రాష్ట్రంలోని ఉజ్జయినిలో మహాకాల్ మందిరంలోని మూడో అంతస్థులో నాగచంద్రేశ్వరాలయం వెలసింది. ఈ ఆలయం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటుంది. అది కూడా నాగపంచమిరోజున మాత్రమే. మనదేశంలో ఎన్నో నాగ దేవాలయాలు న్నాయి. ఆ దేవాలయాలు నిత్యం పూజా కార్యక్రమాలతో, ధూప దీప నైవేధ్యాలతో బిజిగా ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం కేవలం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే పూజలు అందుకుంటుంది. అది కూడా ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజున అంటే ఈ ఏడాది ఆగస్టు 9 న పడింది. ఈ రోజున దేశంలోని హిందువులంతా నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. నాగ పంచమి రోజున భోల శంకరునితో పాటు నాగదేవతను పూజించే సంప్రదాయం భారత్‌లో ఉంది. ఇక, ఈ ఏడాది కూడా ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నాగ పంచమి పండుగ దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ పవిత్రమైన పర్వదినం రోజున ఏడాది పొడవునా మూసి ఉండే ఈ ఆలయంలో ఈ ఒక్కరోజు మాత్రమే 24 గంటల పాటు తెరిచి ఉంటుంది.

ఒక్కరోజు మాత్రమే..
ఆగష్టు 8వ తేది నాగులచవితి, ఆగష్టు 9న గరుడ పంచమి సందర్భంగా కొన్ని ప్రదేశాల్లో కార్తీకశుద్ధ చవితి రోజు పుట్టలో పాలు పోస్తారు. అయితే, ఈ ఆలయంలో మాత్రం ఆగస్టు 8వ తేదీ రాత్రి 12 గంటలకు తలుపులు తెరుచుకుంటాయి. మరుసటి రోజు ఆగస్టు 9వ తేదీ రాత్రి 12 గంటల వరకు తలుపులు తీసే ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ ఏడాది పాటు మూసివేస్తారు. నాగచంద్రేశ్వరుని దర్శంచుకునేందుకు భక్తులకు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది.

శతాబ్దాల చరిత్ర...
ఉజ్జయినిలో వెలసిన నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర దాగి ఉంది. ఈ నాగదేవాలయాన్ని 1050లో భోజరాజు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం ఈ ఆలయానికి సింధియా వంశానికి చెందిన రాణోజీ మహరాజ్ 1732 లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాడని తెలుస్తోంది. ఈ ఆలయంలోని నాగేశ్వరుని దర్శనం ఒక్కసారి చేసుకుంటే చాలు సకల పాపాలన్నీ తొలగి పుణ్యం లభిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. అందుకే చాలామంది ప్రత్యేకంగా నాగపంచమి రోజు ఆలయానికి వస్తుంటారు. ఈ ఒక్కరోజే సుమారు లక్షల మంది భక్తులు నాగచంద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారట. ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారికి ప్రత్యేకపూజలు చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతంది.



Click it and Unblock the Notifications













