భూమిలోపలి అద్భుతమే.. ఈ బెలుం గుహలు
సాధారణంగా గుహలు అనగానే ఏ కొండల్లోనో, ఏ కోనల్లోనో ఉంటాయి. కానీ ఈ గుహలు మాత్రం మైదాన ప్రాంతంలో భూమిలోపల ఏర్పడటం విశేషం. భూ ఉపరితలానికి దాదాపు ముప్పయి మీటర్ల లోతున్న ఉన్న ఈ గుహలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉండటం విశేషం. కర్నూలు జిల్లాలో వెలసిన ఈ గుహలు మన పురాతన సంస్కృతికి నిలయాలుగా ఉన్నాయి. ఈ జిల్లాలోని కొలిమిగుంట్ల మండలంలోని ఈ గుహలు సుమారు పదిలక్షల క్రితం సహజసిద్ధంగా ఏర్పడినవి. భారతదేశంలోనే ఇవి అతిపొడవైన గుహలుగా పేరుగాంచాయి. ఈ గుహలు విశాఖపట్నంలోని బొర్రాగుహలకంటే పొడవైనవిగా గుర్తించారు.

బెలుంగుహల చరిత్ర
మొదటిసారిగా 1884 లో రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల గురించి ప్రస్తావించారు. ఆయన తర్వాత దాదాపు ఒక శతాబ్దం పాటూ మరుగునపడిపోయిన వీటిని జర్మన్ దేశస్తుడైన గేబర్ సారథ్యంలో మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చారు. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు వీటి ప్రత్యేకత.
1985లో ఈ బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. ఆ తర్వాత 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలు పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల్ దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి అనుకూలంగా దారిని నిర్మించారు. 2002 ఫిబ్రవరిలో బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తూ వస్తోంది. బెలుం గుహల సమీపంలో కొలిమిగుండ్ల లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉంది. ఈ దేవాలయం పాలరాతితో కట్టబడి, చుట్టూ లెక్కలేనన్ని మెట్లతో ఉన్నది. బెలుంగుహల సందర్శనకు వెళ్లినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించడం మాత్రం మరువకండి.

బెలుం గుహలు ప్రవేశ ద్వారం వద్ద నిర్మించిన పెద్ద బుద్ధ విగ్రహం అక్కడికి వచ్చే చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీని ఎత్తు 60 అడుగుల వరకు ఉంటుంది. బౌద్ధమతానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు ఇక్కడ దొరికాయి. ఈ గుహలకు తుది ఎక్కడో ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా మూడున్నర కిలోమీటర్ల మార్గాన్ని తవ్వకాలలో కనిపెట్టారు. అందులో ఒకటిన్నర కిలోమీటరు వరకు ప్రజాసందర్శనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బయటనుండి 3 బావులవలె ప్రవేశద్వారాలుంటాయి. మధ్యదారి నుండి ప్రవేశించాలి.
ఎలా చేరుకోవాలి..
రైలు మార్గం ద్వారా అయితే, తాడిపత్రి రైల్వే స్టేషన్ లో గాని లేదా బేతంచెర్ల రైల్వే స్టేషన్ లో గాని దిగి , అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. ఒకవేళ రోడ్డుమార్గం ద్వారా ప్రయాణిస్తున్నారనుకోండి. అవుకు రిజర్వాజర్ కనిపిస్తుంది. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా బెలూం గుహలు చేరుకోవచ్చు. అంటే కర్నూలు, బేతంచెర్ల, బనగానపల్లె నంద్యాల మీదుగా లేదా అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా లేదా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మీదుగా రోడ్డుమార్గం ద్వారా బెలుంగుహలను చేరుకోవచ్చు.

కర్నూలు నుంచి బెలుంగుహలు 100కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంద్యాల నుంచి 70 కిలోమీటర్లు. తాడిపత్రి నుంచి 35 కిలోమీటర్లు. జమ్మలమడుగు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ కు 320 కిలోమీటర్లు, బెంగుళూరు కి కూడా 320 కిలోమీటర్ల దూరంలో బెలుం గుహలు ఉంటాయి.
ఈ జాగ్రత్తలు పాటించండి..
భూమికి సుమారు 120 మీటర్ల లోతులో ఈ గుహలు ఉన్నాయి కాబట్టి. విపరీతంగా ఉక్కపోస్తోంది. లోపలికి వెళ్లినప్పటి నుండి బయటికి వచ్చేంత వరకు విపరీతమైన చెమటల పడతాయి. కాబట్టి పలచనైన దుస్తులు ధరించి వెళితే మంచిది. మీతోపాటు లోపలికి మంచినీటిని తీసుకుని వెళ్లాలి.



Click it and Unblock the Notifications












