శివుడి ఆజ్క్ష లేనిదే చీమైనా కుట్టదు అంటారు...అందుకే చాలామంది భక్తులు వారి కోరికలు తీర్చుకునేందుకు భోలేనాథుని దర్శిస్తుంటారు. ఇప్పడు కార్తీకమాసం. ఈ కార్తీకమాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతీకరమైనది. ఈ కార్తీకమాసంలో ఈశ్వరుడిని ఎంతో భక్తితో పూజిస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే చాలామంది ఈ సమయంలో వేకువజామునే లేచి శివరాధాన చేస్తుంటారు. చాలామంది ఈ సమయంలో ప్రసిద్ధిచెందిన శివాలయాలను దర్శించుకుంటుంటారు. వీటికోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రసిద్ధిచెందిన భోలేనాథుని ఆలయాలు ఉన్నాయి. ఈ కార్తీకమాసం సందర్భంగా ఈ ఆలయాలను దర్శించుకుంటే పుణ్యం లభిస్తుంది.
శ్రీశైలం మల్లికార్జున స్వామి, నంద్యాల..
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. ఇది నంద్యాల నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 179 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ దేవాలయాన్ని విజయ నగర రాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడిని రెండో శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని విజయ నగర రాజులే కాదు, కాకతీయ రాజులు కూడా ఎంతో భక్తి శ్రద్దలతో పూజించేవారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామితో పాటు పాతాళ గంగ, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచధార వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి

సంగమేశ్వర ఆలయం..
సంగమేశ్వర ఆలయం కర్నూలు జిల్లాలో వెలసింది. ప్రపంచంలోని ఏడు నదులు కలిసే చోటే సంగమేశ్వరం. ఇక్కడ తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు ఒక చోట కలుస్తాయి. అందుకే ఈ ప్రదేశాన్ని సంగమేశ్వరం అని పిలుస్తారు. ఈ ఏడు నదులలో ఆరు నదులు స్ర్తీ పేరును కలిగి ఉన్నాయి. కేవలం ఒక్కటి భవనాసి మాత్రమే పురుషుడి పేరు ఉన్న నది. ఈ ఏడు నదులలో భవనాసి నది మాత్రమే తూర్పు నుంచి పశ్చిమ వైపు ప్రవహిస్తుంటుంది. మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తాయి. ఈ ఆలయం కర్నూలు నుండి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో ప్రతిష్టించిన వేప లింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉందంటే ఈ ఆలయ విశిష్టత ఎంత గొప్పదో తెలుసుకోండి. ప్రపంచంలోనే ఏడు నదులు కలిసే చోట ఉన్న ఏకైక శివాలయం ఈ సంగమేశ్వర ఆలయం.

ఉమామహేశ్వర ఆలయం, యాగంటి
కర్నూలు జిల్లాలో వెలసిన మరో ప్రముఖ శివాలయం యాగంటిలో ఉంది. ఇది కర్నూలు నగరం నుండి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధిచెందింది. దీన్ని 5వ శతాబ్దంలో తొలుత పల్లవులు నిర్మించినట్లు తెలుస్తోంది. పార్వతీ పరమేశ్వరులు ఈ ఆలయంలో అర్ధనాదీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కబడి ఉంటారు. ఇక్కడ మహాశివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడుండే నంది ప్రతి ఏటా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు ప్రతి ఏటా పోటెత్తుతుంటారు.

కోటప్పకొండ శివాలయం, గుంటూరు
కోటప్ప కొండ శివాలయం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో వెలసింది. ఈ శివాలయం నరసరావు పేటకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోటప్పకొండలో ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. ఇక్కడ కొలువై ఉన్న శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా పిలుస్తారు. కార్తీక మాసం సందర్భంగా ఈ కొండలో కొలువై ఉన్న మహాశివున్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు.



Click it and Unblock the Notifications













