పర్యాటక ఖిళ్లా.. నెల్లూరు జిల్లా!
చక్కటి పర్యాటక అనుభూతులను పంచే సందర్శనీయ ప్రాంతాలకు నెలవు నెల్లూరు జిల్లా. ఓ వైపు చారిత్రక కట్టడాలతో ఆకర్షిస్తూ, మరోవైపు కులమతాలకు అతీతంగా ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచిపెడుతూ ప్రసిద్ధికెక్కిన ప్రాంతాలెన్నో, మరి ఆ ప్రాచీన సాంస్కృతిక ఔన్నత్యం, ప్రకృతి సిద్ధమైన అందాలతో అలరారే నెల్లూరులోని కొన్ని పర్యాటక ప్రాంతాలను చూసేద్దాం రండి!

ఉదయగిరి కోట
నెల్లూరు నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరి కోట ఆనాటి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. 14వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన ఈ కోటలోని 138 మీటర్ల ఎత్తయిన కోట శిఖరం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. పల్లవులు, చోళరాజులు నిర్మించిన అనేక ఆలయాలు సైతం మనకు దర్శనమిస్తుంటాయి. ఉదయగిరి గ్రామం సంజీవి పర్వతాలపై ఉంది. ఈ కొండపై ఔషధమొక్కలు అనేకం లభ్యమవుతాయి. ఉదయగిరి కోటకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది.
తొలినాళ్లల్లో ఉదయగిరి రాజధానిగా లాంగూల గజపతి ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. తర్వాత విజయనగర సామ్రాజ్య పాలకుడైన శ్రీకృష్ణదేవరాయలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. చోళులు, పల్లవులు మొదలైన రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కోట ప్రాంగణంలో మొత్తం 13 భవనాలు ఉన్నాయి. అలా పూర్వపు రాజులు నిర్మించిన అనేక దేవాలయాలను పరిశీలిస్తే ప్రాచీన కళానైపుణ్యాలకు నిలయాలుగా దర్శనమిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

పెంచలకోన
నెల్లూరుకు 75 కిలోమీటర్ల దూరంలో ఈ పెంచలకోన ప్రాంతం ఉంది. పెంచలకోనలో ప్రధాన ఆకర్షణ నరసింహస్వామి ఆలయం. వేదగిరి పర్వతంపై ఈ ఆలయం నిర్మించారు. దట్టమైన పచ్చని అడవులు, ఎత్తయిన కొండల నడుమ కనువిందు చేసే ప్రకృతి అందాలు పెంచలకోన సొంతం. ఇక్కడి రమణీయమైన ఆహ్లాదకర వాతావరణం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.
పెంచల కోన అసలు పేరు పెనుశిల కోన అని, కాలక్రమేణా అది పెంచలకోనగా మారిందని స్థానికులు చెబుతుంటారు. నెల్లూరు పట్టణం నుంచి పెంచలకోన ప్రయాణం ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. రోడ్డు మార్గంలో ఇక్కడికి ప్రయాణం దారిపొడవునా మన వాహన వేగానికి అందనంతగా కొండలు కదులుతున్నట్లు భలే అనుభూతులను కలిగిస్తుంది.
కుల, మతాలకు అతీతం
నెల్లూరు శివార్లలోగల ఈ బారా షహీద్ దర్గాలో ఉన్న పెద్ద సరస్సు వద్ద ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ కన్నుల పండువగా నిర్వహిస్తుంటారు. ప్రజలు తమ కోరికలు ఫలించిన ఆనందంలో అక్కడకు వచ్చే ఇతరులకు రొట్టెలను అందజేస్తారు. దీనికోసం వారు అక్కడి చెరువులో మోకాలి లోతు నీళ్లలోక దిగి, రొట్టెలను అందిస్తారు. ఈ రొట్టెల పండుగ నెల్లూరు సంస్కృతిలో ఒక భాగమైపోయింది. ఈ సమయంలో దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది సందర్శకులతో సరస్సు కిటకిటలాడుతుంది. అలాగే, నెల్లూరుకు 25 కిలోమీటర్ల దూరంలో కస్మూరు గ్రామం ఉంది.
అక్కడ ఉన్న హజరత్ కరీముల్లా షా ఖాద్రీగారి దర్గా కులమతాలకు అతీతంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులు కూడా దర్గాను దర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రార్థిస్తే సమస్యలు, బాధలు తొలగిపోతాయని వారి విశ్వాసం. నెల్లూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్న సముద్రం అనే ఊర్లోని 'ఖాజా రహంతుల్లా మసీదు" సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ కూడా కులమతాలకు అతీతంగా ప్రజలు, పర్యాటకులు మసీదును సందర్శిస్తుంటారు.

వెంకటగిరి
నెల్లూరుకు 89 కిలోమీటర్ల దూరంలోగల వెంకటగిరి చేనేత చీరలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ తయారైన చీరలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. బంగారు పోగులను, దారాలను కలగలిపి రూపొందించే వెంకటగిరి చీరలు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంటాయి. అలాగే వెంకటగిరి సంస్థానాధీశు లు నిర్మించిన కోటను కూడా ఇక్కడ చూడవచ్చు. రేచెర్ల పాలకులు 1775లో వెంకటగిరి పట్టణంలో కోటను నిర్మించారు.
ఈ కోట వెంకటగిరి కోటగా ప్రసిద్ధికెక్కింది. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ కోట సౌందర్యం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కోటలోని ప్రశాంత వాతావరణం మనస్సును ఆహ్లాదపరుస్తుంది. నాటి రాచరికపు వ్యవస్థకు మౌనసాక్షిగా ఈ కోట నిలుస్తోంది. అయితే, వెంకటగిరి పట్టణానికి ప్రధానమైన ప్రత్యేకత ఇక్కడి నూలు చిరలే.

పులికాట్ సరస్సు
ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సహజసిద్ధ ఉప్పునీటి సరస్సు పులికాట్ సరస్సు. బంగాళాఖాతం సముద్రం నుండి ఈ సరస్సును వేరు చేస్తూ మధ్యలో శ్రీహరికోట ఉంది. నెల్లూరులో సుమారు ఆరు వందల కిలోమీటర్ల మేర ఈ సరస్సు వ్యాపించి ఉంది. ఈ సరస్సుకు చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల ప్రజలు ఎక్కువగా చేపలు పట్టడంపై ఆధారపడి జీవిస్తున్నారు. 1976లో ఇక్కడ పులికాట్ సరస్సు పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు.
అప్పటినుంచి ఇది పక్షుల ఆవాస కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సరస్సులో రకరకాల పక్షులు దర్శనమిస్తుంటాయి. ఇక్కడ ఫ్లెమింగోలు, పెలికాన్స్, స్పూన్ బిల్స్, బాతులు, కింగ్ ఫిషర్లు వంటి అనేకజాతుల పక్షులు వస్తుంటాయి. పక్షి ప్రేమికులకు పులికాట్ సరస్సు చిరునామాగా చెప్పవచ్చు. స్థానిక మత్స్యకారుల సహాయంతో సరస్సులో బోటు షికారు ఎంతో అద్భుతంగా ఉంటుంది.

మైపాడు బీచ్
మైపాడు బీచ్లోని తీరప్రాంత ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో అలరిస్తాయి. తీరాన్ని తాకేలా కనిపించే పచ్చని వృక్ష సముదాయం సందర్శకులకు హరితవనంలోకి అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తుంది. కోస్తా తీరం వెంట తేటగా, స్పష్టంగా కనిపించే నీరు చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉండి, బీచ్ సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. బీచ్ వాతావరణంలో పర్యాటకులను తమను తాము మర్చిపోతారంటే నమ్మండి! మెత్తటి ఇసుక తెన్నెలపైన హాయిగా సేదదీరుతూ సూర్యరశ్మిని ఆస్వాదిస్తే ఆ అనుభూతులను మాటల్లో చెప్పలేం.
చేపల పులుసు ఫేమస్
భోజన ప్రియులకోసం అయితే నెల్లూరులో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది చేపల పులుసు. ఇక్కడి చేపల పులుసు రుచిని మాటల్లో వర్ణించడం కష్టమనే చెప్పాలి. ఒక్క రుచే కాదండోయ్. రంగు, వాసన వేటికవే పోటీ పడుతుంటాయంటే నమ్మండి! బెంగళూరు, చెన్నెయి, హైదరాబాద్ తోపాటు ప్రముఖ పట్టణాలు, కొన్ని పాశ్చాత్య దేశాలలోని ఆంధ్ర హోటళ్ళలో నెల్లూరు చేపల పులుసు ప్రత్యేక మెనూలో ఉంటుందంటే మీకే అర్థమైపోతుంది. నెల్లూరు వెళ్లే పర్యాటకులు ఈ పులుసుని ఒకసారి రుచి చూడటం మాత్రం మరవకండి.
ఎలా వెళ్లాలి?
రోడ్డు మార్గాన్ని ఎంచుకునే వారు చెన్నై నుంచి కోల్కతాకు వెళ్లేందుకు నాలుగు లైన్లతో నిర్మించిన ఐదవ నెంబర్ జాతీయ రహదారి నెల్లూరును భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానం చేయబడి ఉంది. చెన్నై, హౌరా రైలు మార్గంలోని విజయవాడ- చెన్నై మధ్యలో నెల్లూరు ఉండటంతో దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఇక్కడకు రైళ్లు నడుస్తున్నాయి.
నెల్లూరుకు సమీపంలోని విమానాశ్రయం సుమారు 130 కిలోమీటర్ల దూరంలోని తిరుపతిలో ఉంది. ఇక్కడి నుంచి ముంబయి, ఢిల్లీ, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications













