విశాఖ కేంద్రంగా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా సకల సౌకర్యాలను అందిస్తూ.. బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌గా వైజాగ్ సిటీని రూపొందిచనున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఏపీ పర్యాటకశాఖ అధికారులు ఇటీవల వెల్లడించారు. వారి మాటలను బట్టీ అనతికాలంలోనే విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పర్యాటక మణిహారంగా మారబోందని అర్థమైపోతుంది.
విశాఖ కలెక్టర్ హరేంధిరప్రసాద్ సూచనల మేరకు సిటీలోని పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టూరిజం సర్క్యూట్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు సందర్శనీయ ప్రదేశాలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. బీచ్ రోడ్డులోని విశాఖ మ్యూజియం, జలాంతర్గామి, టీయూ-142, సీ హారియర్, కైలాసగిరి, తెలుగు మ్యూజియంలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రదేశాలలో విద్యార్థులు అవసరమైన గైడ్‌లతో వివరణాత్మమైన టూర్ ప్లాన్ ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారు.

అలాగే, వారికి రాయితీ ధరల్లో ప్యాకేజీని తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న పలు రిసార్టులను అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా అప్పూఘర్ హరితా రిసార్టుతో పాటు అనంతగిరి హిల్ రిసార్టు, అరకులోని వ్యాలీ, మయూరి రిసార్టుల్లో రిపేరు పనులు జగుతుండగా, వ్యాలీలో కొత్తగా 20 గదులు అందుబాటులోకి తీసుకురానున్నారు. అన్ని సౌకర్యాలతో ఆగస్టు నాటికి అప్పూఘర్‌లోని రిసార్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
అలలపై బోటు విహారం..
విశాఖ నగరంలో తీరప్రాంత పర్యాటకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సముద్రంలో బోటు విహారానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. హార్బర్‌లో 8 సీట్ల బోటు పర్యాటకులు విహరించేందుకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది జెట్టీ నంబరు-11 వద్ద ఉండడంతో అపరిశుభ్రత కారణంగా అక్కడికి వెళ్లేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు.

అంతేకాదు, గతంలో డ్రై డాక్ నుంచి బోటింగు నిర్వహించినప్పటికీ హుద్‌హుద్ తుపాను తర్వాత అది ఆగిపోయింది. అయితే, త్వరలో 50 సీట్ల బోటు డ్రై డాక్ నుంచి నడిపేలా అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే విశాఖ సముద్రపు అలల విహారం మరింత ప్రాచుర్యంలోకి వస్తుంది.
వేడుకలకు అనువుగా రుషికొండ..
బీచ్ విహారంలో రుషికొండ బీచ్‌కు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని వారాంతాల్లో ఇక్కడ వేడుకలు నిర్వహించేందుకు పర్యాటక శాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. బీచ్‌లోని ఒక ఎంపిక చేసిన ప్రాంతాన్ని వేడుకలకు అనువుగా ఆకర్షణీయంగా డెకరేట్ చేయనున్నారు. అలా ప్రాంతంలో పర్యాటకులకు పుట్టినరోజు, పెళ్లి రోజు, బృంద పార్టీలు నిర్వహించుకునేలా దీనిని రూపొందించనున్నారు. అంతేకాదు, విభిన్న రుచులతో కూడిన ఆహారం ఇక్కడ లభించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

దీంతోపాటు రుషికొండకు కూడ 5 సీట్లుండే రెండు స్పీడు బోట్లు, ఒక కయాకింగ్‌ను తీసుకురాన్నట్లు తెలుస్తోంది. అలాగే, తొట్లకొండపై ప్రశాంతమైన సమయాన్ని గడిపేందుకు అనుకూలంగా కారవ్యాన్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. కొండపై ఉన్న వ్యూపాయింట్ల ఆధారంగా అక్కడ ఒక రోజు గడిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ట్రావెల్ అసోసియేషన్‌లతో అధికారులు సంప్రదింపులు జరిపారట. పర్యాటక శాఖ ఆలోచనలు కార్యరూపం దాల్చితే విశాఖ నగరం పర్యాటకానికే కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందనడంలో సందేహమే లేదు.



Click it and Unblock the Notifications












