వర్షాకాలంలో వైజాగ్‌లోని వీటి రుచులను ఆస్వాదించాల్సిందే..!
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చే టూరిస్టులు సొంత ప్రదేశంలో ఉన్న అనుభూతిని పొందుతారు. ఇక్కడి అందమైన ప్రదేశాలలో వైజాగ్ ఒకటి. ఈ ప్రాంతం అందమైన బీచ్‌లు, ఉద్యానవనాలు మాత్రమే కాదు. ఇక్కడి తినుబండారాలు కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రముఖ హోటల్స్ లో లభించే సముద్రపు ఆహారం ఒకవైపు, మరోవైపు ఏ వీధికి వెళ్లినా ఎప్పుడూ లభించే ఆహార పదార్ధాలు పర్యాటకులను నోరూరిస్తుంటాయి. ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్లాలనుకున్నట్లయితే తప్పకుండా వీటిని ఓ పట్టుపట్టేయండి..

మొక్కజొన్న
వర్షాకాలంలో వేడివేడిగా మొక్కజొన్నను ఎంజాయ్ చేయడం ఎవరికి మాత్రం ఇష్టముండదో చెప్పండి.. రెయినీ సీజన్‌లో అన్ని వయసుల వారు అమితంగా ఇష్టపడే పాపులర్ స్ట్రీట్‌ఫుడ్ మొక్కజొన్న అనే అందరూ చెప్పేస్తారు. కార్న్‌ను ఉడకబెట్టి లేదా మంటపై వేడి చేసి తినడం ఈ సీజన్‌లో అన్ని చోట్లా చూస్తుంటాం. ఇవి ఎంతో టేస్టీగా ఉండటమే కాదు ఇందులో అత్యవసర పోషకాలు మెండుగా ఉంటాయి. మొక్కజొన్నను ప్రిపేర్ చేయడం కూడా ఎంతో ఈజీ.
వైజాగ్‌లో చాలా వరకూ ప్రముఖ ఆహార పదార్ధాలన్నీ బీచ్ లకు సమీపంలో దొరుకుతాయి. నగరంలోని తెన్నేటి పార్క్, ఆర్.కె.బీచ్ సాగరతీరం పొడవునా స్వీట్ కార్న్ స్టాల్స్ ను చూడొచ్చు. ఇక్కడ స్వీట్ కార్న్ రుచి చూస్తూ సముద్ర తీర అందాలను ఆస్వాదించడం చాలా స్పెషల్ గా ఉంటుంది. స్వీట్ కార్న్ తో పాటు బొగ్గులపై వేడి చేసే మొక్కజొన్న లను కూడా టేస్ట్ చేయొచ్చు. ఈ టేస్టీ డిష్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ, మెగ్నీషియం వంటి అత్యవసర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కొవ్వు ఉండటంతో పాటు కడుపు నిండిన భావన కలిగించే కార్న్ అన్నింటికంటే మెరుగైన స్నాక్‌గా ఈ సీజన్‌లో ఎంపిక చేసుకోవచ్చు.

పునుగులు
వైజాగ్‌లో వర్షాకాలంలో లభించే మరోక స్ట్రీట్‌ఫుడ్ పునుగులు అని చెప్పుకోవచ్చు. రోడ్డు పక్కన లభించే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్స్ లో కారం పునుగులు ఒకటి. బియ్యం, మినపపప్పుతో తయారు చేసే ఈ మిశ్రమాన్ని వేడి వేడి నూనెలో వేయించి చిన్న చిన్న పునుగులను తయారు చేస్తారు. వీటిపై కాస్త కారం పొడిని వేసి కొబ్బరి లేదా ఉల్లి చట్నీతో ఇక్కడికి వచ్చే ఫుడ్‌లవర్స్‌కు అందిస్తారు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. సాయంత్రం కాగానే వీటి కోసం ఎదురు చూసే వారు ఇక్కడ ఎందరో ఉన్నారు. వర్షాకాలంలో వైజాగ్‌లోని సముద్రతీరపు అందాలను చూస్తు వేడివేడి పునుగులను ఆస్వాదించొచ్చు.

మూరీ మిక్చర్
విశాఖపట్నంలో ఈ సీజన్‌లో బీచ్‌లను సందర్శించాలనుకునేవారు తప్పకుండా మూరీ మిక్చర్ రుచి చూడకుండా వెళ్లలేరు. ఎందుకంటే, ఈ స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ అంత ఫేమస్. ఈ పదార్ధాన్ని మూరీలు, పల్లీలు, ఉల్లి, పచ్చిమిర్చి, టమోటా వంటి పదార్ధాలను కలిపి తయారు చేస్తారు. దీనిపై చివర్లో కాస్త నిమ్మరసాన్ని కలిపితే ఆ టేస్ట్ అదిరిపోతుంది అంటే నమ్మండి. పిల్లల నుంచి పెద్దల వరకూ బీచ్‌ను చూస్తు దీనిని తింటూ ఉంటారు. మూరీ మిక్చర్ తక్కువ ధరకే లభిస్తుంది. వైజాగ్‌లో సాయంత్రం పూట ఎక్కువమంది సందర్శకులను ఆకర్షించే బెస్ట్ స్నాక్స్‌లలో ఇది ఒకటి.



Click it and Unblock the Notifications












