వంతెనలలో చాలా ప్రత్యేకతలుంటాయి. కొన్ని నిర్మాణ శైలులను ఆకట్టుకుంటే, మరికొన్ని అవి నిర్మించిన ప్రదేశాలను బట్టి ప్రత్యేకతలను సంతరించుకుంటాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉత్తర కర్ణాటకలోని మురుడేశ్వర్‌లో ఉన్న ఈ వంతెన ఎంతో ప్రత్యేకమైనది. దీనిపై అడుగుపెడితే చాలు. గాలిలో తేలియాడే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈ వంతెన ఈ తరహా ప్రాచుర్యం పొందడంతో సందర్శకుల తాకిడి ఎక్కువయ్యింది. కుటుంబసమేతంగా విహారయాత్రకు ప్రణాళిక వేసుకున్నవారి జాబితాలో తప్పనిసరిగా స్థానం సంపాదిస్తోన్న మురుడేశ్వర్‌లోని ఈ తేలియాడే వంతెన ప్రత్యేకతలు మీకోసం...
ఉత్తర కర్ణాటకలో తొలిసారిగా తేలియాడే వంతెనను ప్రారంభించారు. ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా పర్యాటకులను ఆకర్షించేందుకు మురుడేశ్వర్‌లో తేలియాడే వంతెనను ప్రారంభించారు. కర్ణాటకలో అతిపెద్ద తేలియాడే వంతెన ఇది. ఈ వంతెనను జిల్లా పర్యాటక శాఖ నిర్మించింది. ఈ వంతెన పొడవు 130 మీటర్లు మరియు వెడల్పు 3.50 మీటర్లు ఉంటుంది.
ఇటీవల కాలంలో ఈ ప్రదేశం ఓ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మంచి గుర్తింపు పొందింది. ఈ వంతెనపై నిలబడినప్పడు పర్యాటకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాదు, మల్పే వద్ద గతంలో నిర్మించిన తేలియాడే వంతెన కంటే ఇది పది మీటర్లు పెద్దదిగా ఉంది. దీంతో ఈ వంతెనకు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.

సముద్రంలో తేలియాడుతున్న అనుభూతి
ఈ తేలియాడే వంతెనను కుటుంబంతో సహా సందర్శించొచ్చు. ఇక, ఇక్కడ పిల్లలు సందడి మాములుగా ఉండదు. వంతెనపైకి ప్రవేశించాలంటే ముందుగా 100 రూపాయల ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడికి వచ్చే వారికి లైఫ్ జాకెట్లను కూడా అందజేస్తారు. ఆ జాకెట్ వేసుకుంటే అలలపై సముద్రంలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు కేరింతలు కొడుతూ.. ఈ టూర్‌లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ తేలియాడే వంతెనపై నిలబడి ముర్డేశ్వర్‌లోని భారీ మహాశివుని విగ్రహాన్ని చూసే అవకాశం లభిస్తుంది. ఆ క్షణాలను ఆస్వాదించేందుకు ఇటీవల కాలంలో సందర్శకులు బారులుతీరుతున్నారు.
వందమంది ఒకేసారి నడిచే సౌకర్యం
ఈ తేలియాడే వంతెన రెండు వైపులా బలమైన థ్రెడ్, రాడ్లతో బేస్కు ఎంతో స్థిరంగా నిర్మించారు. ఇక్కడి ముగింపు పాయింట్ ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో పాటు చతురస్రంగా కూడా ఉంటుంది. ఆ ఆకృతి చూసేందుకు రెండుకళ్లూ సరిపోవంటే నమ్మండి. అంతేకాదు, ఈ వంతెనపై ఎక్కువ మంది నిలబడే వెసులు బాటు కూడా ఉంది. ఈ వంతెనను PE మాడ్యులర్ డాక్స్ ద్వారా నిర్మించబడింది. ఇది ఫ్లెక్సిబుల్ మరియు యాంటీ-స్కిప్ డిజైన్ కాబట్టి, జారిపోయే భయం ఉండదు.
ఈ వంతెనపై వందమంది ఒకేసారి నడిచే సౌకర్యం ఉంటుంది. ఇక్కడికి వచ్చే సందర్శకులకు పసందైన రుచులను అందించేందుకు పలు రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదేశం మంచి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందటానికి ఇది కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. మరెందుకు ఆలస్యం.. కాలినడకన ఆకాశ మార్గంలో విహరించేందుకు ఉత్తర కర్ణాటకలోని మురుడేశ్వర్‌లో ఉన్న ఈ వంతెనను వెంటనే సందర్శించేలా మీ టూర్ ప్లాన్ చేసుకోండి.



Click it and Unblock the Notifications













