మాటలకందని దేవికులం ప్రకృతి అందాలు
సహజసిద్ధ ప్రకృతి అందాలకు చిరునామాగా చెప్పబుడుతోంది కేరళ రాష్ట్రంలో దేవికులం. ఇది ఒక పర్వత విహార పట్టణం. ఇక్కడి అనేక సుందర ప్రకృతి దృశ్యాలు, కొండచరియల నుండి పారే జలపాతాలు, పచ్చటి ప్రదేశాలు, సుందర పరిసరాలు పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. దేవికులం ఇడుక్కి జిల్లాలోని మున్నార్ ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
సముద్రమట్టానికి 1800 మీటర్లు ఎత్తులో ఉన్న ఈ చిన్న హిల్ స్టేషన్ శీతాకాలపు అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే. ప్రకృతి ప్రియులు ఇక్కడ కల వృక్ష, జంతు సంపదలను తనివి తీరా పరిశోధించి ఆనందించవచ్చు. ఇక్కడి చేపల వేట పర్యాటకులకు ఆనందాన్నిచ్చే మరొక మఖ్య అంశంగా చెప్పొచ్చు. దేవికులంలో ట్రెక్కింగ్ మానసిక ఉల్లాసాన్నిచ్చే సాహస క్రీడ.
పొగమంచు కమ్మేసిన పర్వత శ్రేణులు ట్రెక్కర్‌లను ఎంతగానో ఆకర్షిస్తాయి. పచ్చదనం కమ్మేసిన ఇక్కడి తోటలు, ఎర్రటి బంక చెట్లు మధ్యగా ట్రెక్కింగ్ చేస్తూ ముందుకు సాగితే.. మరో ప్రపంచపు విహార ఆనుభూతి కలుగుతుంది. పొగమంచుతో కప్పబడిన ఇక్కడి కొండల అందాలను ఆస్వాదించేవారికి సమయమే తెలియదంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. అందుకే దేవికులం పర్యాటకుల స్వర్గధామంగా పేరుపొందింది.

స్వచ్ఛమైన నీటి సోయగాలు
ఇక్కడికి దగ్గరలోని సీతాదేవీ సరస్సు ఈ సీజన్‌లో రెట్టింపు అందంతో దర్శనమిస్తుంది. స్వచ్ఛమైన నీటి సోయగాలు చూపరుల మనసుదోచేస్తాయి. శ్రీరాముని భార్య సీతాదేవి ఇక్కడ స్నానమాడినట్లు స్థానికులు విశ్వసిస్తారు. ఇక్కడ బోటింగ్ సధుపాయం కూడా ఉంది. సరస్సు ఒడ్డున ఔత్సాహికులు ఫిషింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. కొందరు స్థానికులు అక్కడి తాజా చేపలను సందర్శకులకు ఆహారంగా అందిస్తారు.
సరస్సు పరిసర ప్రాంతాలు ప్రశాంతమైన వాతారణాన్ని చేరువ చేస్తాయి. కుటుంబసమేతంగా గడిపేందుకు ఈ ప్రదేశం ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడి చుట్టుపక్కల ప్రదేశాలు టీ మరియు సుగంధపు తోటలకు ప్రసిద్ధి చెందింది. అలాగే, టీ మసాలా తోటలతోపాటు అరుదుగా కనిపించే విదేశీ పూల మొక్కల జాతులకు దేవికులం కేంద్రంగా నిలుస్తోంది.

పల్లివాసల్ జలపాతం..
ఇక్కడికి దగ్గరలో ఉన్న మరొక పర్యాటక కేంద్రం పల్లివాసల్ జలపాతం. దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న అద్భుతమైన సమజనీటి వనరుగా.. సందర్శనీయ ప్రదేశంగా పేరుగాంచింది. నల్లరాతి బండల నుంచి జాలువారే స్వచ్ఛమైన నీటి సవ్వడులు మనసును ఊహాలోకంలో విహరింపజేస్తాయి. సందర్శకులు విడిది చేసేందుకు అనువైన విడిది కేంద్రాలు చాలానే అందుబాటులో ఉంటాయి.
నాన్ వేజ్ ప్రియులకు రుచుకరమైన ఫ్రై వంటకాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. చిన్నార్ నది తూవనం వద్ద ఎత్తునుంచి జాలువారే తూవనం జలపాతం, చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

ఎలా చేరుకోవాలి?
కొచ్చి, కొట్టాయంల నుండి రోడ్డు మార్గం ద్వారా వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రయాణంలో చుట్టుపక్కల ఉన్న అందమైన పరిసరాలను చూడవచ్చు. దేవికులంకు రైలు మార్గం లేదు. కొచ్చి కొట్టాయం రైలు స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుండి టాక్సీలలో వెళ్లవచ్చు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం దేవికులం పట్టణానికి 111 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి కూడా టాక్సీ లలో వెళ్లవచ్చు.



Click it and Unblock the Notifications












