శివ నామస్మరణతో మార్మోగుతోన్న శ్రీశైల మల్లన్న క్షేత్రం!
ప్రకృతిసిద్ధమైన నల్లమల అటవీప్రాంతంలో.. పరవళ్లుతొక్కే కృష్ణానది ఒడ్డున.. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట వెలసిన భూలోకకైలాస క్షేత్రమే శ్రీశైలం. ఇక్కడ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగం రూపంలో కొలువైతే, పార్వతీదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబికా దేవిగా దర్శనమిస్తోంది. మహాశివరాత్రి పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలనూ, శివ పార్వతుల కల్యాణాన్నీ చూసేందుకు లక్షల మంది భక్తులు ఇప్పటికే శ్రీశైలం చేరుకుంటున్నారు. ఫిబ్రవరి 11 నుంచి మొదలైన వేడుకలు 21వరకూ కన్నులపండుగగా జరగనున్నాయి.
శ్రీశైలం చుట్టూ ఉన్న అడవి ఆ తల్లి పార్వతీదేవి అవతారమని భక్తుల విశ్వాసం. వెంకటాపురం- నాగలూటి- భీముని కొలను పాదయాత్ర మార్గం... శ్రీశైలాన్ని చేరుకునే ప్రాచీన దారుల్లో ఒకటి. రాయలసీమ నలుమూలల నుంచీ వచ్చేవాళ్లు కర్నూలు జిల్లా వెంకటాపురానికి వాహనాల్లో చేరుకుంటారు. అక్కడి నుంచే పాదయాత్ర మొదలవుతుంది. అలా ఓ మూడు కిలోమీటర్లు పంటపొలాల దారిలో నడిచి ముర్తుజావలి దర్గావద్దకు చేరుకుంటారు భక్తులు. హిందూ ముస్లిముల ఐక్యతకి సంకేతంలా భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే... దట్టమైన అరణ్యంలోకి అడుగుపెడుతున్నామనడానికి సంకేతంగా కీచురాళ్ల రొద మొదలవుతుంది.

చల్లగాలి సేదతీరుస్తూ..
అడవి మార్గంలో పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఎనిమిదికిలోమీటర్లు నడిస్తే నాగలూటి వీరభద్రస్వామి ఆలయం వస్తుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఆలయం ఇది! ఇక్కడిదాకా వచ్చిన భక్తులకు శ్రీశైలం ఆలయ సిబ్బంది రూ.200 శీఘ్రదర్శన టికెట్టు అందిస్తారు. ఈ యాత్రలో తొలి కొండ మెట్లమార్గం ఇక్కడే మొదలవుతుంది. సుమారు వెయ్యి మెట్లుంటాయి ఇక్కడ. ఆయాసంతో ఉక్కిరిబిక్కిరైతేనేం.. ఎప్పటికప్పుడు చల్లగాలి సేదతీరుస్తూ ఉంటుందీ మెట్ల మార్గం. ఇక్కడి నుంచి ఓ పదికిలోమీటర్లు నడిస్తే.. కొండకింద 'పెద్దచెరువు' అన్న గిరిజన గ్రామం వస్తుంది.
కర్నూలులో మనం ఎనిమిదిగంటలకి బయల్దేరితే.. ఇక్కడికి సాయంత్రం ఆరుగంటలకి చేరుకుంటాం. ఆ తర్వాత అడవిమార్గంలో ప్రయాణించడం ప్రమాదకరం కాబట్టి ఇక్కడే మజిలీ చేస్తారు భక్తులు. వాళ్ల కోసం శ్రీశైలం ఆలయ ట్రస్టు ఉచిత భోజనం సహా అన్ని వసతులూ కల్పిస్తుంది. ఇక్కడ చీకటి ముదిరేకొద్దీ అడవిలో కీచురాళ్ల రొదకి జంతువుల అరుపులూ తోడై గమ్మత్తైన అనుభూతినిస్తాయి.

లేత ఎండ అద్దే బంగారు మెరుగులు..
వేకువనే ఇక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే మెట్లమార్గం ప్రారంభమవుతుంది. ఇవి దాదాపు ఎనిమిదివందల ఏళ్లకిందట కట్టించినవని చెబుతారు. అలా నడుస్తూ అడవి పక్షుల కిలకిలల మధ్య... చీకటి తెరలని తొలగించుకుంటూ వచ్చే ఉదయభానుణ్ణి చూడటం ఓ అద్భుతమైన అనుభవంగా మిగిలిపోతుంది. అక్కడి నుంచి భీముని కొలను మూడుకిలోమీటర్లే కానీ.. అది ఓ పెద్ద లోయ అడుగున ఉంటుంది.
చుట్టూ నిండిన పచ్చదనానికి లేత ఎండ అద్దే బంగారు మెరుగులూ, మన చుట్టూ చేరి తారట్లాడే మేఘాల పలకరింపులూ.. రెండ్రోజుల శ్రమనంతా ఇట్టే మరచిపోలా చేస్తాయి. భీముని కొలనులో భీముడి విగ్రహమూ.. ఓ కొలనూ ఉంటాయి. మరో రెండుకిలోమీటర్లు మెట్లమార్గంలో పైకెక్కాక.. శ్రీశైలం కైలాసద్వారం కనిపిస్తుంది. అక్కడి నుంచి అరగంటలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని చేరుకోవచ్చు.

భూలోక కైలాసంగా గుర్తింపు..
భూలోక కైలాసంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రంలో ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. మొదటి ఉత్సవాలను సంక్రాంతి సమయంలో... రెండోసారి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి సమయంలో నిర్వహిస్తారు. మొదటి రోజు సాయంత్రం ధ్వజారోహణ, భేరీ పూజ చేసి దేవతలను ఆహ్వానించి ఉత్సవాలను ప్రారంభించి, ఆ మర్నాటి నుంచీ ఆదిదంపతులకు రోజుకో వాహనసేవను నిర్వహిస్తారు.
మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో వేద పండితులూ, అర్చకులూ కలిసి మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకం, ఆ తరువాత శివపార్వతుల కల్యాణం... చివరగా ప్రభోత్సవం, తెప్పోత్సవం నిర్వహించి ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఈ వేడుకలను చూసి తరించేందుకు ఎందరో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు.



Click it and Unblock the Notifications













