బెంగుళూరు నగరానికి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమ ప్రదేశం వివిధ ప్రకృతి దృశ్యాలతో రమణీయ ప్రదేశం. ఈ ప్రదేశంలో అర్కావతి నది కావేరి నదితో కలిసి ప్రవహిస్తుంది.
ఈ ప్రదేశం చేరాలంటే బెంగుళూరు నుండి సుమారు రెండు గంటలు పడుతుంది. అయితే, బెంగుళూరు నుండి సంగమం చేరే వరకు కూడా ఎంతో మనోహరంగా ఆనందించవచ్చు. ఆశించని మలుపులు, ఎత్తులు, పల్లాలు కల రోడ్డు మిమ్మల్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతుంది. ఇక నదులు చూసే సరికి మీ ఆనందం అవధులు దాటుతుంది. సంగం లోని నదులు, మీకు చక్కటి స్నానం చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తాయి.
సంగం ప్రదేశానికి వెళ్ళే వారు ట్రెక్కింగ్, స్విమ్మింగ్, ఫిషింగ్ వంటివి కూడా చేయవచ్చు. ఇదే ప్రదేశంలో చూడదగినది మరో మంచి ప్రదేశం అంటే... మేకే దాటు. ఇది సంగం కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కావేరి చాలా లోతుగా ప్రవహిస్తుంది. మేకే దాటు అంటే, మేక అనగా గోట్ అని ఒక పులి తరుముతూంటే ఆమేక దానిని తప్పించుకొని ఈ ప్రదేశాన్ని దాటిందని అపుడు పులి దానిని ఏమీ చేయలేకపోయిందని, కనుక దీనికి ‘మేకే దాటు’ అన్న పేరు వచ్చిందని చెపుతారు. ఆ మేకకు ఈ ప్రదేశంలోని కొన్ని అద్భుత శక్తులు సంక్రమించాయని అందుకనే దాటివేసిందని కూడా స్ధానికులు చెపుతారు.
మేకే దాటు ప్రాంతాన్ని వర్షాకాలం తర్వాత నదులు పూర్తి స్ధాయిలో ప్రవహిస్తున్నపుడు చూస్తే ఆనందంగా ఉంటుంది. ఇక్కడకు చేరాలంటే రోడ్డు మార్గం మాత్రమే. బెంగుళూరు, సమీప పట్టణం కనకపురలనుండి బస్సులు ప్రయాణిస్తాయి.