రాతి నిర్మాణాలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు.. అలనాటి ఆధ్యాత్మిక చింతనకు ప్రతిరూపాలుగా నేటికి ఆ రాతి నిర్మాణాలు స్వాగతం పలుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా అందుకు ప్రధాన వేదికగా నిలుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రదేశం పెన్నానది ఒడ్డు నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాల్కొండ, నల్లమల కొండల సరిహద్దులో ఈ ప్రాంతం వెలసింది. అతిపురాతనమైన ఆలయాలకు నెలవు. పచ్చని ప్రకృతి నడుమ విహారించాలనుకునే ప్రయాణికులు తప్పకుండా ఈ ప్రాంతానికి రావాల్సిందే. ఇంకా ఇక్కడ మసీదులు, చర్చిలు, చారిత్రక అవశేషాలు వంటివి మరెన్నో దాగి ఉన్నాయి. మరెందుకాలస్యం ఇక్కడి అద్భుతమైన రాతి నిర్మాణాలను ఓసారి చూసేద్దామా..

కోదండరామ దేవాలయం
కడపలోని పురాతనమైన దేవాలయాల్లో ఒంటిమిట్ట కోదండ రామ దేవాలయం ముందు వరుసలో ఉంటుంది. ఈ ఆలయం నగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత మూడు చిత్రాలతో కూడిన ఓ శిలా విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ఇక్కడికి వచ్చే భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. ఇక్కడి గోడలపై ఉన్న కళారూపాలు.. ఇవి రెండు ప్రసిద్ధ ఇతిహాసాలతో ప్రదర్శించబడి ఉంటాయి. ఈ పురాతన ఆలయాన్ని ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ ఎంతో గొప్పగా వర్ణించాడు. దేశంలోని గొప్ప పగోడాలలో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. అలాగే, పండుగలు, ఉత్సవాల సమయంలో ఈ ఆలయానికి భక్తులు బారులు తీరుతారు.

సంగమేశ్వర స్వామి దేవాలయం
ఈ ఆలయంలో జిల్లాలోని వీరాపునాయని పల్లి మండలంలో అనిమేల గ్రామంలో వెలసింది. సంగమేశ్వర ఆలయం కడప పట్టణం నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులు భాస్కర క్షేత్రంగా కూడా భావిస్తారు.
ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఉన్న శివలింగంపై ఓ గుంట ఉంటుంది. ఆ రంధ్రంపై నిత్యం నీరు ధారలా ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే, ఆ నీరు ఎక్కడి నుండో వస్తుందోనని ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఈ ఆలయాన్ని క్రీస్తుపూర్వం 16వ శతాబ్దంలో నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు భక్తులు తరలివస్తారు.

వీరభద్ర దేవాలయం
కడపలోని మరో పురాతన ఆలయం వీరభద్ర దేవాలయం. ఈ ఆలయం 17వ శతాబ్దానికి చెందినది. కుముద్వాతి నది ఒడ్డున ఈ ఆలయం నిర్మించారు. ఈ దేవాలయంలో ఎంతో అందంగా ఉంటుంది. ఇక, ఈ ఆలయంలోని ప్రధాన ద్వారం కేవలం 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. దేవాలయంలో ఓ చిన్న మండపం ఉంటుంది. అది ఊయల రూపంలో ఉండి భక్తులను ఆకర్షిస్తుంది. ఇక, ఇక్కడి స్తంభాలపై వీరభద్రుడు, వీరబ్రహ్మం బొమ్మలు చెక్కబడి ఉండడం మనం చూడొచ్చు.
వీరాంజనేయ స్వామి ఆలయం
జిల్లాలోని మరో పురాతన ఆలయం వీరాంజనేయ స్వామి ఆలయం..కడప ప్రాంతాన్ని సందర్శించిన వారు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా సందర్శించాల్సిందే. ఈ ఆలయాన్ని హిరణ్యఘట్టం అని కూడా పిలుస్తారు. ఇది పాపాగ్ని నది ఒడ్డున ఉంది. ఇక్కడ కొలువై ఉన్న వీరాంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఎలాంటి మానసిక రుగ్మతలు దరిచేరవని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటటే.. ఇక్కడ కొలువై ఉన్న విగ్రహం చిటికెన వేలు లేకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications













