దేశంలోని హిందువులంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నిన్నటితో నెరవేరింది. జనవరి 22న అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక జరిగింది. జనవరి 22న సాధారణ భక్తులకు రాముని దర్శన భాగ్యం కలగలేదు. జనవరి 23 నుంచి సాధారణ భక్తులు సైతం రాముని దర్శనం పొందొచ్చని స్వయంగా దేశప్రధానే పిలుపునిచ్చారు. కాబట్టి నేటి నుంచి అయోధ్యలో భక్తుల కోలాహాలం మొదలయ్యింది. చాలామంది రామ భక్తులు అయోధ్యకు ఎలా వెళ్లాలా? అని ప్రణాళికలు వేసుకుని ఉంటారు. అయోధ్యకు వెళ్లేందుకు ఉత్తమమైన మార్గాలేంటో ఓసారి చూసేయండి. రైలుమార్గం ద్వారా గానీ, విమాన మార్గం ద్వారా కానీ, లేక రోడ్డు మార్గం ద్వారా కానీ ఎలా అయినా అయోధ్యను చేరుకోవచ్చు. ఆ వివరాలన్నీ ఓసారి చూద్దాం.
ప్రస్తుతం దేశంలో అయోధ్య ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా మారిపోయింది. ఆధ్యాత్మిక యాత్రలు భక్తులు, పర్యాటకులు తప్పకుండా అయోధ్య రాముని దర్శనం చేసుకునేందుకు వచ్చేస్తుంటారు. అయోధ్యను సందర్శించాలనుకునే భక్తులు తప్పకుండా ఈ మార్గాల గుండా ప్రయాణం చేయండి.

విమాన మార్గంలో అయోధ్య చేరడం ఎలా?
విమాన మార్గం ద్వారా అయోధ్య వెళ్లాలనుకునేవారు ముందుగా అయోధ్య విమానాశ్రయమైన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకోవాలి. ఈ ఎయిర్‌పోర్టుకు అయోధ్య ధామ్ అనేపేరును పెట్టడం జరిగింది. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య, ఫైజాబాద్ జంట నగరాలకు సేవలందిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. అయోధ్య వెళ్లాలనునేవారు ముందుగా ఈ విమానశ్రయాన్ని చేరుకోవాలి. లక్నో, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ , వారణాసి విమానాశ్రయాల నుండి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక, ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌లు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుండి నేరుగా అయోధ్య రామాలయానికి చేరుకోవచ్చు.
రైలు మార్గం ద్వారా అయోధ్య చేరుకోవడం ఎలా?
రైలుమార్గం ద్వారా అయోధ్య చేరుకోవాలనుకునేవారు ముందుగా అయోధ్య రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలనుండి అయోధ్యకు రైలు మార్గాలు ఉన్నాయి. రెండు ప్రధాన రైల్వే స్టేషన్లు, ఫైజాబాద్ , అయోధ్యలకు బాగా అనుసంధానించబడ్డాయి. వారణాసి నుంచి అయోధ్యకు 196 మైళ్ల దూరం. అలహాబాద్ నుంచి అయోధ్యకు 157 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లక్నో నుంచి అయోధ్యకు 137 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గోరఖ్‌పూర్ నుంచి అయోధ్యకు 171 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

ఇక, వీటితోపాటు ఢిల్లీ నుండి అయోధ్యకు ప్రత్యేక వందే భారత్ రైళ్లను కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భారతీయ రైల్వే సుమారు 200 ఆస్తా ప్రత్యేక రైలు సేవలను అందుబాటులో ఉంది. ఈ రైళ్లు ఆపరేషనల్ స్టాపేజ్‌లను మాత్రమే కలిగి ఉంటాయి. ఈ ట్రైన్స్ అయోధ్య రాములోరి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత 100 రోజుల పాటు వివిధ నగరాల నుండి ప్రయాణిస్తాయి. దేశంలోని 66 వేర్వేరు ప్రాంతాలను అయోధ్యకు కలుపుతూ రైలు మార్గాలు వేయడం జరుగుతుంది.
రోడ్డు మార్గం ద్వారా అయోధ్య చేరడం ఎలా?
రోడ్డు మార్గం ద్వారా అయోధ్య వెళ్లాలనుకునేవారికి ఉత్తరప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎక్కడి నుండైనా అయోధ్య చేరుకోవడం సులభమే. లక్నో నుండి అయోధ్య సుమారు 130 కిలోమీటర్లు ఉంటుంది. వారణాసి నుండి అయితే 200 కిలోమీటర్లు, ప్రయాగ్‌రాజ్ నుండి 160 కిలోమీటర్లు ఉంటుంది. గోరఖ్‌పూర్ నుండి 140 కిలోమీటర్లు, ఢిల్లీ నుండి అయోధ్యకు 636 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఢిల్లీ, గోరఖ్‌పూర్ , లక్నో నుండి సాధారణ బస్సులు నిత్యం అందుబాటలోనే ఉంటాయి. త్వరలోనే, ఇతర ప్రదేశాల నుండి కూడా బస్సులు అందుబాటులోకి రానున్నాయి.



Click it and Unblock the Notifications













