దేశవ్యాప్తంగా అయోధ్య పేరు మాగుమోగుతోన్నవేళ.. అక్కడకు చేరుకునేందుకు భక్తులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ, తెలంగాణకు భక్తులకు రైల్వేశాఖ శుభవార్తను అందించింది. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనుంది. మరెందుకు ఆలస్యం.. తెలుగు రాష్ట్రాలనుంచి అయోధ్యను చేరుకోవాలనుకునే భక్తులు ఈ వార్తను అస్సలు మిస్సవ్వొద్దు.
భక్తులు ఎంతగానో ఎదురుచూస్తోన్న అయోధ్య ఆలయంలో రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్టకు ముహూర్తం దగ్గరపడింది. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాల రామునికి తొలిపూజ చేయనున్న విషయం తెలిసిందే. ఆ అందాల బాలరాముడి విగ్రహం ఇప్పటికే అయోధ్య రాములోరి ఆలయానికి చేరుకోగా, జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ భారతదేశమంతా ఆశగా ఎదురుచూస్తోంది. ఆ రోజు అయోధ్య రామాలయం కిక్కిరిసిపోనుంది. అయోధ్య జరిగే ఈ వేడుకను వీక్షించేందుకు దేశ విదేశాలనుంచి ప్రజలు విచ్చేయనున్నారు. అయోధ్యను చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉవ్విళ్లూరుతోన్న వేళ.. ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ నిర్ణయించింది.

ఈ స్టేషన్ల నుంచి అయోధ్యకు..
ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక, తెలంగాణ నుంచి సికింద్రాబాద్, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి అయోధ్య స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్- అయోధ్య ప్రత్యేక ట్రైన్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగిస్తాయని దక్షిణాది రైల్వే అధికారులు వెల్లడించారు. విజయవాడ నుంచి అయోధ్యకు వెళ్లే ట్రైన్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ల మీదుగా అయోధ్యకు రాకపోకలు సాగనున్నాయి.

ఎపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేకట్రైన్లు..
సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే స్పెషల్ ట్రైన్లు జనవరి 29, 31 మధ్యలో, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరనున్నాయి. తిరిగి అయోధ్య నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక ట్రైన్లు తిరుగు ప్రయాణమవుతాయి. జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు కాజీపేట నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. తిరిగి ఈ ట్రైన్లు అయోధ్య నుంచి కాజీపేటకు రానున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి జనవరి 31న విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న ప్రత్యేక ట్రైన్లు, రాజమండ్రి నుంచి ఫిబ్రవరి 7న స్పెషల్ ట్రైన్స్, అలాగే సామర్లకోట నుంచి ఫిబ్రవరి 11న స్పెషల్ ట్రైన్లు అయోధ్యకు బయలుదేరనున్నాయి. కుటుంబసమేతంగా అధ్యాత్మిక అయోధ్యను తిలకించేందుకు రైల్వేశాఖ అందిస్తోన్న ఈ సధవాకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల భక్తులూ సధ్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మరెందుకు ఆలస్యం అయోధ్య అందాలను చూసేందుకు మీరూ బయలుదేరండి.



Click it and Unblock the Notifications













