దేశంలోనే ప్రసిద్ధిచెందిన రామాలయాలు చాలానే ఉన్నాయి. అందులో దక్షిణాదిలో కూడా శ్రీరాముని పుణ్యక్షేత్రాలకు కొదవేల లేదు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయం. ఇది అత్యంత ప్రాచీనమైన విశిష్టమైన హిందూ దేవాలయంగా విరాజిల్లుతుంది. దీనిని ఆంధ్రా అయోధ్యగా కూడా పిలుస్తున్నారు. ఈ ఆలయంలోని శ్రీరాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని చెబుతుంటారు. ఇక్కడ సీతారాములను ఏకశిలలో చూడొచ్చు.
అందుకే ఇది ఏకశిలానగరి కోదండ రామాలయంగా కూడా ప్రసిద్ధిచెందింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి భద్రాచలం విభజన అనంతరం ఒంటిమిట్టని 'ఆంధ్రా భద్రాచలం' గా పిలుస్తున్నారు. కోదండరాముల వారి ఆలయ గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా, పర్యాటకులను భక్తులను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు ప్రభుత్వం పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించి, ప్రత్యేక కార్యక్రమాలనూ నిర్వహిస్తోంది.

ఈ కోదండ రాముని ఆలయంలో శ్రీరామ తీర్ధము కూడా కలదు. సీత కోరికపై శ్రీ రాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని ఇక్కడి స్థల పురాణం వివరించబడింది. గోపుర నిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఇక్కడి ప్రత్యేకతలలో మరోకటి ఆంజనేయుని విగ్రహం. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే కావడం విశేషం. ఇక ఈ ఆలయాన్ని 16వ శాతాబ్దంలో ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని ప్రశంసించాడు.
ఒంటిమిట్ట ఆలయ శాసనాలను పరిశీలిస్తే ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. కోదండ రాముని ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారు. ముందు గర్భాలయం నిర్మాణం, తర్వాత తూర్పు ముఖ మండపం, మూడవ దశలో గాలిగోపురం నిర్మించడం జరిగింది. రెండవ శిలాశాసనం ప్రకారం 1558 లో ఒంటిమిట్ట తదితర గ్రామాలను నాటి ఏలిక ఆలయానికి దానం చేసినట్లు సమాచారం.
ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించడం జరిగింది. ఈ మండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. అంతేకాదు, ఇక్కడి ఆలయ స్థంభాలపైన రామాయణ భాగవత కథలను వీక్షించొచ్చు. రామాయణ, మహాభారతంలోని కథలు, దశావతారములు వటపత్రశాయి, వారధికి గుండ్రాళ్లు ఆంజనేయస్వామి వేస్తున్న దృశ్యం, లక్ష్మణమూర్ఛ, సీతాదేవికి ఆంజనేయస్వామి అంగుళీకమును చూపించే దృశ్యం, గోవర్ధనగిరి ఎత్తే దృశ్యం, శ్రీ కృష్ణ కాళీయమర్దనం, పూతన అనే రాక్షసిని సంహరించుట వంటి శిల్పాలను ఇక్కడ తిలకించొచ్చు.
ఎలా చేరుకోవాలి...
ఈ ఆలయాన్ని చేరుకునేందుకు అన్నిరకాల రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గంలో ప్రయాణం చేయాలనుకునేవారు సమీపంలో కడప విమానాశ్రయం ఉంది. అక్కడినుంచి ప్రయివేట్ క్యాబ్‌లు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం 112 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుండైనా ఈ కోదండ రామాలయాన్ని సందర్శించుకోవచ్చు. ఇక, రైలు మార్గం ద్వారా వెళ్లాలనుకునేవారికి సమీపం రైల్వేస్టేషన్ ఒంటిమిట్టలో ఉంది.
ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి సులభంగా కాలినడకన చేరుకోవచ్చు. వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నవారు ఆటోలు ప్రయాణించొచ్చ. ఈ రైల్వేస్టేషన్‌తో పాటు అనేక రైల్వేస్టేషన్‌లు కూడా ఉన్నాయి. వాటినుంచి కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఏడుకిలోమీటర్ల దూరంలో భాకరపేట్ రైల్వే స్టేషన్ ఉంది. 25 కిలోమీటర్ల దూరంలో కడప రైల్వే స్టేషన్ ఉంది. 106 కిలోమీటర్ల దూరంలో తిరుపతి రైల్వే స్టేషన్ ఉంది. రోడ్డు మార్గంలో ప్రయాణించాలనుకునేవారికి కడప నుంచి అనేక రకాల బస్సులు అందుబాటులో కలవు. ఇక, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు తదితర ప్రధాన పట్టణాల నుండి ఎపీఎస్ఆర్‌టిసి బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications













