Search
  • Follow NativePlanet
Share
» » నంద్యాల ప‌ర్య‌ట‌న‌లో ప‌ల‌క‌రించే చారిత్ర‌క శిల్ప‌క‌ళా నైపుణ్యం

నంద్యాల ప‌ర్య‌ట‌న‌లో ప‌ల‌క‌రించే చారిత్ర‌క శిల్ప‌క‌ళా నైపుణ్యం

నంద్యాల ప‌ర్య‌ట‌న‌లో ప‌ల‌క‌రించే చారిత్ర‌క శిల్ప‌క‌ళా నైపుణ్యం

శిల్పాలుగా మారిన శిల‌లు చ‌రిత్ర‌కు నిలువెత్తు సాక్ష్యాలు. అందుకు నిదర్శనమే నంద్యాల చుట్టుప‌క్క‌లి పురాతన శిల్పకళా నైపుణ్యం. ఇక్కడ రాళ్లల్లో దాగిన చారిత్రక అందాలను చూసి తరించాల్సిందే. స్వచ్ఛమైన నీటి కొలనుల్లో దాగిన ఎన్నో రహస్యాలు ఇక్కడ తారసపడతాయి. ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన సొరంగ మార్గాలు సందర్శకులకు మనసారా స్వాగతం పలుకుతాయి. మ‌రెందుకు ఆల‌స్యం నంద్యాల పర్యాటక విశేషాల్ని మీరూ తెలుసుకోండి!!

క‌ర్నూలు జిల్లా నంద్యాల చేరుకునేందుకు రాత్రి పదిగంటలకు విజయవాడ నుంచి రైలులో బయలుదేరాం. ఉదయం 5 5.30 మధ్యలో నంద్యాలకు చేరుకున్నాం. కర్నూలులోని మిత్రుల‌కు ముందే స‌మాచారం ఇవ్వ‌డంతో అన్ని ఏర్పాట్లూ ముందుగానే చేశారు. మాకు కేటాయించిన గదుల్లో బస చేశాం. ఉదయం ఎనిమిది గంటలకు అందరూ రెడీ అయ్యి, టిఫెన్ కోసం వెయిటింగ్. అదే సమయంలో కర్నూల్ స్పెషల్ వంటకం ఉగ్గానీ భజ్జీ అని చెప్పారు. అక్కడి స్పెషల్ అనగానే అందరం దానివైపే మొగ్గుచూపాం. అంతలోనే వేడివేడి ఉగ్గానీ భజ్జీ వచ్చింది. ప్లేట్లో రెండు భజ్జీలు పెట్టి, దానిలో ఉగ్గాని పెట్టి ఇచ్చారు. అది మా ప్రాంతంలో మరమరాలతో చేసే మసాలా స్పెషల్! కొంచెం ఉప్పు ఎక్కువగా అక్కడి ప్రాంతం వారు తింటారు అని చెప్పారు. ఎంతో ఇష్టంగా దానిని లాగించేశాం. త్వరగా విహారయాత్రకు బయలుదేరాం. అక్కడ ఉన్న యువకులంతా ఒక కారులో, పెద్దలంతా మరో కారులో ఎక్కేశాం. మేము స్టే చేసిన ప్రాంతం నుంచి మహానందికి బయలుదేరాం. అలా సరదా సరదాగా జోక్స్ వేసుకుంటూ, పాటలు పాడుతూ పదిహేను నిమిషాల్లో మహానందికి చేరుకున్నాం.

పూర్వీకుల‌ మేధోసంపత్తికి నిదర్శనం

పూర్వీకుల‌ మేధోసంపత్తికి నిదర్శనం

మహానంది ఆలయానికి వందమీటర్ల ఎదురుగా ఓ పెద్ద నంది రాతి విగ్రహం ఉంది. అచ్చం అది మాకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్న అనుభూతి కలిగింది. ఆ ప్రాంతాన్ని ఓ చిన్నసైజు పచ్చని నందనవనంలా ఎంతో సుంద‌రంగా తయారుచేశారు. అంతేకాదు, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న చిన్న ఆట వ‌స్తువులూ ఉన్నాయి. వాటిని చూసుకుంటూ ఆలయంలోకి అడుగులు వేశాం. మహానంది నిర్మాణశైలి మ‌న పూర్వీకుల‌ మేధోసంపత్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్ళగానే పెద్ద కోనేరు కనిపించింది. దాని ప్రత్యేకత ఏంటంటే, అక్కడ ఉండే నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఆ కోనేరులో నీరు ఎంత పారదర్శకంగా ఉన్నాయంటే.. గుండు పిన్ను వేసినా కనిపించేలా ఉన్నాయి. అది చూడగానే మా వాళ్ళు కోనేరులో దిగి, కేరింతలు కొట్టారు. ఎవరికి వారు ఈత సరదాను మనసారా తీర్చుకున్నారు.

పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్టించి, పూజలు చేశారని అక్కడి ప్రజల నమ్మకం. అంతేకాదు, పురాణాల్లో ఈ ఆలయానికి గొప్ప విశిష్టత ఉందని అక్కడి స్థానికులు చెప్పుకొచ్చారు. ఎవరి విశ్వాసం ఎలా ఉన్నా పురాతన కట్టడాలను కనులారా ఆస్వాదించాలనుకునేవారికి మహానంది ప్రాంతం గొప్ప అనుభూతుల్ని కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఆలయాల సమూహం యాగంటి

ఆలయాల సమూహం యాగంటి

అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటికి బయలుదేరాం. దారిపొడవునా పచ్చని పొలాలు కనిపించాయి. వాటి అందాలు మాకు దూరమే తెలియకుండా చేశాయి. అక్కడి దర్శనీయ ప్రదేశాలలో ఒకటైన యాగంటి ఆలయం చూసేందుకు మెట్లదారినపైకి వెళ్లాం. అక్కడి శివాలయంలోనూ ఓ కోనేరు ఉంది. చుట్టూ ఉన్న రాతి కొండల నడుమ కోనేరులో నీటిని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాం. అంతేకాదు, అందులోకి నిత్యం కొండలలోంచి నీరు ఊరి వచ్చేట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆలయం విషయానికి వస్తే లోపల రాతి శివలింగం, బయట నంది ఉన్నాయి. ఇక్కడ నంది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఎందుకంటే, ఈ గుడి నిర్మాణ సమయంలోనే ఆ కొండలోని రాయినే చిన్న నందిగా మలిచారట! నాటి నుంచి నేటి వరకూ అది పెరుగుతూ వస్తుందని విశ్వసిస్తారు. దానికి అక్కడి ప్రజలు నిత్యం పూజలు చేస్తారు. కొండగుహలో వెంకటేశ్వరస్వామి ఆలయమూ ఉంది. మరొక గుహలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఉంది. అక్కడే కాలజ్ఞానం రాశారు అనీ ప్రజలు నమ్ముతారు. అక్కడి కొండలు చాలా అందంగా ఎవరో ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా పలకలుగా ఉన్నాయి. ఈ యాగంటిలో సినిమాలు తీస్తారని స్థానికులు చెప్పారు. ఆ ప్రదేశం మొత్తం చూసి ఫోటోలు దిగి అక్కడి నుంచి బెలూం గుహలు చూడాలని మళ్ళీ కారులో బయలుదేరాం.

అరుంధతి కోట‌..

అరుంధతి కోట‌..

అప్పటికే మధ్యాహ్నం 1.30 అయ్యింది. వెళ్లే దారిలో కొండపైన ఓ అందమైన కోట కనిపించింది. చూద్దామని వెళ్ళాం. ఎక్కడో ఈ కోటను చూశామన్నది మా ఫీలింగ్! ఎక్కడా అని ఆలోచనలో పడ్డాం. అంతలో మా బృంద స‌భ్యుడు అది అరుంధతి కోట అని చెప్పాడు. అప్పుడు గుర్తొచ్చింది. 'అరుంధతి' సినిమాలో ఉన్న కోట అదే కదా అని. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. మా ఫోన్లో ఉన్న కెమెరాకి పని చెప్పాం. ఆ కోట ఎవరిదా అని స్థానికులను అడిగాం. బనగానిపల్లెని పాలించిన రాజుల విలాసమందిరాల్లో ఇది ఒకటని చెప్పారు. కోటను మొత్తంగా చూశాక అక్కడి నుంచి మళ్ళీ మా ప్రయాణం కొనసాగించాం.

బెలూం గుహలకు వెళ్లే దారిలో ఓ రిజర్వాయర్ కనిపించింది. రెండు కొండలను కలిపి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. అక్కడ నీరు నిల్వ చేసి, ఆ చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరుగా, పొలాలకు సాగునీరుగా ఉపయోగిస్తారు అని చెప్పారు. దారి మధ్యలో ఎటు చూసినా కొండలే.. ఆ కొండలను తొలుస్తూ కనిపించే క్వారీలు ఎక్కడికక్కడ దర్శనమిచ్చాయి. అక్కడి గ్రామాల్లో ఇళ్ళన్నీ ఈ బండలతోనే కడతారు. ఆ ఇళ్లను చూశాక మాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

బెలూం గుహల అందాలు

బెలూం గుహల అందాలు

చుట్టుపక్కల ప్రదేశాలను చూస్తూ మాటలు చెప్పుకుంటుండగానే బెలూం గుహలకు చేరిపోయాం. అక్కడ చల్లని వాతావరనం, చెట్ల స్వచ్ఛమైన గాలి మమ్మల్ని ఆనందానికి గురి చేసింది. గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఈ గుహలను సుందరంగా తీర్చిదిద్దారు. ఎలా ఉంటాయో అని లోపలికి వెళ్లిన మాకు ఈ గుహలు నిరాశనే మిగిల్చాయి. ఎందుకంటే, లోపల ఏదో రిపేర్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని చెప్పారు. అందుకే ఎక్కువ దూరం వెళ్ళడానికి అనుమతి లేదు అని బోర్డులు ఉన్నాయి.

అక్కడివారితో మాట్లాడి లోపల ఏం ఉందోనని ఆ హెచ్చరిక బోర్డులు దాటుకుని లోపలికి వెళ్ళాం. లోపల అంతా నీరు చేరి, గుహల లోపల మట్టి పేరుకుపోయింది. దారి సరిగా లేదు. అలా లోపలకు వెళ్లే కొద్దీ. చాలా సొరంగాల దారులు ఒక్కొక్కటిగా కనిపిస్తూనే ఉన్నాయి. అలా మేం అక్కడ వేసిన ప్రతి అడుగూ మాకు మర్చిపోలేని అనుభూతుల్ని చేరువచేశాయి. బయట ఓ పెద్ద ధ్యానబుద్ధ విగ్రహం ఉంది. అక్కడే కాస్త సమయం సేద తీరాం. స్థానికంగా ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నప్పటికీ సమయం లేకపోవడంతో తిరుగు ప్రయాణమయ్యాం.

More News

Read more about: nandyala mahanandi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+