అనేక రహస్యాలకు నిలయం.. ఈ బృహదీశ్వరాలయం..!
ఏ ఆలయానికి వుండే ప్రత్యేకత దానికి వుంటుంది. కాని తంజాపూరులోని బృహదీశ్వరాలయ గోపుర ప్రత్యేకత మాత్రం మరే దేవాలయానికి లేదనే చెప్పవచ్చు. ఈ దేవాలయ శిఖరం నీడ మాత్రం ఏ సమయంలోను నేలమీద పడదు. ఎంత ఎండ ఉన్నా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ సమయంలోను బృహదీశ్వరాలయ గోపురం నీడ మాత్రం భూమి మీద పడదు. ఇంతటి విశిష్టత ఉన్న ఈ దేవాలయానికి 1987లో యునెస్కో గుర్తింపు వచ్చింది. రండి ఈ వింతకు కారణమేమిటో తెలుసుకుందాం.

ఆలయ చరిత్ర..
తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాల్లో బృహదీశ్వరాలయం ఒకటి. దీన్నితంజావూరు నగరంలోని కావేరీ నది ఒడ్డున 11 వ శతాబ్దంలో చోళరాజులకాలంలో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భారత్‌లోనే అతిపెద్ద శివలింగం ఉన్న ఆలయం కూడా ఇదే. దాదాపు 3.7 మీటర్ల ఎత్తుతో ఈ విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయం చుట్టూ ఉన్న గోడలపై 6 అడుగుల ఎత్తులో అన్ని దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. చోళరాజులలో సుప్రసిద్ధుడయిన రాజరాజచోళుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మించాడు. 1004వ సంవత్సరం నుంచి 1010వ సంవత్సరం వరకు ఆరు సంవత్సరాలపాటు అహోరాత్రులు శ్రమించి నిర్మించిన ఈ ఆలయం అపూర్వ శిల్పకళాశోభకు నిలయంగా చెప్పొచ్చు. సాధారణంగా వేల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయాలు సైతం కొంచెం పాతబడినట్లు కనిపిస్తుంటాయి. కానీ ఈ దేవాలయం మాత్రం ఇప్పటికీ కొత్తగా కనిపిస్తూ చెక్కు చెదరకుండా ఉంది. ఆలయంలో ఉన్ననంది విగ్రహం 2.6 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయాన్ని 13 అంతస్థుల్లో నిర్మించారు.

గోపుర విశిష్టత
ఈ ఆలయగోపురాన్ని 216 అడుగుల ఎత్తుతో 14 అంతస్థులుగా అష్టభుజాకారంలో నిర్మించారు. ఈ గోపురం పైభాగాన 25 అడుగుల ఏకశిలా కలశం వుంది. ఈ శిలాకలశం బరువు 81 టన్నులకు పై మాటగానే వుంటుంది. ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సారాపల్లం అనే గ్రామం నుంచి ఆలయగోపురం ఎత్తువరకు ఏటవాలుగా ఇసుకతిన్నెలను ఏర్పరిచి ఆ మార్గం గుండా కలశాన్ని గోపురంమీదికి చేర్చారట. ఏకశిలాకలశం రెండువైపులా రెండు అందమైన నంది విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ దర్శనమిస్తూ వుంటాయి. శిఖరం నీడ ఏ సమయంలోను నేలమీద పడనివిధంగా నిర్మించారు. గోపురానికి దక్షిణ దిక్కున గణేషుడు, బోళాశంకరుడు వంటి శిల్పమూర్తులుండగా ఉత్తరదిక్కున వీరభధ్రుడు, అర్థనారీశ్వరుని విగ్రహాలు కన్పిస్తాయి. ఈ గోపురాన్ని దక్షిణమేరుగా కూడా అభివర్ణిస్తుంటారు.

రెండో పెద్ద నంది విగ్రహం ఇక్కడే..
ఆలయప్రాంగణంలో గర్భగుడికి ఎదురుగా వున్న మండపంలో ప్రతిష్టించిన నందివిగ్రహం భారతదేశంలో వున్న రెండో పెద్దనంది విగ్రహం. 12 అడుగుల ఎత్తుతో 19కి పైగా అడుగుల వెడల్పుతోవున్న ఈ బృహత్ నంది తన గంభీరమైన చూపులతో జీవకళ ఉట్టిపడుతూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ వుంటుంది. ఈ మహానంది బరువు 25 టన్నులకు పైగానే వుంటుంది. ఈ దేవాలయ ప్రాంగణం 152 మీటర్లకు పైగా పొడుగుతో 76 మీటర్లకుపైగా వెడల్పుతో సువిశాలంగా వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్ అయిన శివమూర్తి లింగాకారంలో 12 అడుగుల ఎత్తుతో శోభిల్లుతూ వుంటాడు. ఈ స్వామిని 'బృహదీశ్వరుడు' అని 'ఆడవల్లన్' అనీ వివిధ నామాలతో పిలుస్తూ వుంటారు. తంజావూరు వెళ్ళినవారు తప్పకుండా సందర్శించుకోదగ్గ తీర్థం బృహదీశుని దేవాలయం..



Click it and Unblock the Notifications












