Search
  • Follow NativePlanet
Share
» »రాజ‌స్థాన్ సంస్కృతిని చూడాలంటే పుష్క‌ర్ ఫెయిర్‌కు వెళ్లాల్సిందే...

రాజ‌స్థాన్ సంస్కృతిని చూడాలంటే పుష్క‌ర్ ఫెయిర్‌కు వెళ్లాల్సిందే...

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ప్ర‌తిఏటా నిర్వ‌హించే పుష్క‌ర్ ఫెయిర్ ఈ ఏడాది కూడా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఫెయిర్ నవంబర్ 18 నుంచి ప్రారంభమై నవంబర్ 27 వరకు కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే ఈ జాతరకు రాజస్థాన్ చుట్టుపక్కల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా పర్యాటకులు త‌ర‌లి వస్తుంటారు. రాజస్థాన్ సంస్కృతి సంప్రదాయాలను ఈ ఫెయిర్ ప‌ర్యాట‌కుల‌కు పరిచయం చేస్తుంది. రాజస్థాన్ సందర్శించడానికి ఉత్తమ సీజన్ శీతాకాలమ‌ని చెప్పుకోవ‌చ్చు. ఇక్కడి వాతావరణం ప్రయాణానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది.

ఈ సమయంలో అనేక రకాల పండుగలను ఇక్క‌డ నిర్వ‌హిస్తారు. జైసల్మేర్, ఉదయపూర్, జోధ్‌పూర్, జైపూర్, బికనీర్ వంటి అనేక ప్రదేశాలు ఇక్క‌డ సంద‌ర్శించేందుకు ఉన్నాయి. ఈ ప్రదేశాలు అందానికి ప్ర‌సిద్ధిచెంద‌డ‌మే కాకుండా వాటి సొంత‌ ప్రత్యేకతను కూడా కలిగి ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో పుష్కర మేళా ప్రారంభ‌మైంది. ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్న‌ట్ల‌యితే త‌ప్ప‌కుండా ఈ ఫెయిర్ ప‌ర్య‌ట‌న‌కు ఉత్త‌మ గ‌మ్య‌స్థాన‌మ‌ని చెప్పుకోవ‌చ్చు.

pushkarfair

పుష్క‌ర్ ఫెయిర్ ప్ర‌త్యేక‌త‌...

రాజస్థాన్ హస్తకళా వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ ఫెయిర్‌లో హస్తకళల మార్కెట్ కూడా ఉంటుంది. ఈ జాతరలో ప్ర‌త్యేకంగా ఇక్కడి జానపద నృత్యాలు మరియు సంగీతాన్ని ఆస్వాదించడమే కాకుండా సీతౌలియా, లాంగ్డి టాంగ్, గిల్లి-దండా, కబడ్డీ వంటి చిన్ననాటి ఆటలను ఆడే అవ‌కాశం కూడా ఉంటుంది. అలాగే ఈ పుష్కర్ ఫెయిర్‌లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆసక్తిగొలిపే పోటీలు కూడా నిర్వ‌హిస్తారు. పురుషులు, మహిళల మధ్య టగ్ ఆఫ్ వార్, డ్యాన్స్, మట్కా ఫోడ్ వంటివి ఉంటాయి. వాటితో పాటు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, కైట్ ఫెస్టివల్, సాండ్ ఆర్ట్ ఫెస్టివల్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలా అన్నింటిని ఈ పుష్క‌ర్‌లో చూడొచ్చు. ఈ పోటీల్లో ప‌ర్యాట‌కులు సైతం పాల్గొనేందుకు అవ‌కాశం ఉంటుంది.

నవంబర్ 22న ఈ ఫెయిర్‌లో లగాన్ తరహా క్రికెట్ మ్యాచ్ నిర్వహించబ‌డుతుంది. అంతేకాకుండా, అదే రోజు మీసాల పోటీ కూడా ఉంటుంది. ఈ పోటీలు ప‌ర్యాట‌కుల‌కు ఓ కొత్త అనుభూతిని క‌లిగిస్తాయి. పొడవాటి, విభిన్న తరహా మీసాలతో ఇక్కడికి వచ్చి పోటీలో పాల్గొనే వారి సంఖ్య ఇక్క‌డ అధికంగా ఉంటుంది. తలపాగా కట్టుకునే పోటీ కూడా ఈ ఫెయిర్‌లో నిర్వహిస్తారు. ఇంకా ఇక్క‌డ హార్స్ డ్యాన్స్ అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక‌, నవంబర్ 23న ఒంటెల అలంకరణ, నృత్య పోటీలు వంటివి నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ఇక్క‌డ రాజస్థాన్ సాంస్కృతిక ప్రదర్శనను కూడా ఆస్వాదించ‌గ‌ల‌రు.

pushkarfair , festival

చేరుకోవాలి ఎలా?

రైలు మార్గంలో ఇక్కడికి చేరుకోవాలంటే మాత్రం ముందుగా అజ్మీర్ వరకు రైలులో ప్రయాణించవలసి ఉంటుంది. ఇక్కడి నుండి పుష్కర్ 30 నిమిషాల దూరంలో ఉంటుంది. అజ్మీర్ రైల్వే స్టేషన్ ఢిల్లీ, ముంబై, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, కోల్‌కతా, భోపాల్ మరియు బెంగళూరు వంటి పెద్ద నగరాలకు అనుసంధానించబడి ఉంది. రైల్వే స్టేషన్ నుండి పుష్కర్‌కి సులభంగా టాక్సీలో కానీ, క్యాబ్‌లో కానీ వెళ్లొచ్చు.

విమాన మార్గం ద్వారా అయితే జైపూర్ ఇక్కడికి సమీప విమానాశ్రయం. ఇక్కడ నుండి పుష్కర్ దూరం దాదాపు 140 కిలోమీటర్లు ఉంటుంది. విమానాశ్రయం నుండి పుష్కర్ కు టాక్సీలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.

బస్సు మార్గం ద్వారా అయితే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, జైపూర్ వంటి ప్రాంతాల నుండి బస్సులో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. అజ్మీర్‌ను చేరుకునేందుకు రాష్ట్ర రవాణా, డీలక్స్, సెమీ డీలక్స్ వంటి అన్ని రకాల బస్సులు ప‌ర్యాట‌కుల కోసం నిత్యం అందుబాటులో ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+