అయోధ్యను సందర్శించాలనుకునేవారికి ఓ గుడ్‌న్యూస్. ఎంతో ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిరాన్ని సందర్శించాలని ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటాడు. అటువంటి వారికోసమే ఐఆర్‌సిటిసీ ఓ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి పూరీ, గయ, కాశీ, అయోధ్య యాత్రకు వెళ్లి రావచ్చు. ఇది కూడా అతి తక్కువ ఖర్చుతోనే ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భాగ్యం దొరుకుతుంది. కేవలం రు.15 వేలకే టూర్ ప్యాకేజీనీ అందిస్తుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఆ ప్యాకేజీ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ పరిసర ప్రాంత వాసులకు ఐఆర్‌సీటిసి ఓ శుభవార్త అందిస్తుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం బడ్జెట్ ధరలో మంచి ప్యాకేజీ నీ ప్రకటించింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో తక్కువ ధరకే ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను తిలకించొచ్చు. ఐఆర్‌సీటీసి ఈ ప్యాకేజీని పుణ్య క్షేత్ర యాత్ర పేరిట అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల యాత్రికులకు ఇది ఒక పండగలాంటి వార్తే. ఎందుకంటే ఈ టూర్‌లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిరాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది.

వివిధ పుణ్య క్షేత్రాలను సందర్శించే అవకాశం తెలుగువారికి అందించనుంది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ డిసెంబర్ 9న ప్రారంభమవుతుంది. డిసెంబర్ 17తో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. మొత్తంగా ఈ టూర్ తొమ్మిదిరోజుల పాటు ఉంటుంది. ఈ ప్యాకేజీ ధర రూ.15 వేలు మాత్రమే. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పూరీ, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవచ్చు.
ఈ పుణ్యక్షేత్ర యాత్ర వివరాలు..
ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా యాత్రికులు కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలోని భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఎక్కొచ్చు. ఒక్కరోజంతా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరుసటిరోజు అంటే రెండో రోజు మాల్తీపాత్‌పూర్ చేరుకుంటారు. అక్కడ పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అక్కడినుండి గయ ప్రయాణం మొదలవుతుంది. మూడో రోజు గయ చేరుకుంటారు. ఆ రోజు రాత్రి గయలో బస చేసి, ఆ మరుసటి రోజు ఉదయం గయాలోని బోధ్ గయ మహాబోధి, విష్ణుపాద ఆలయాలను సందర్శించుకోవచ్చు. అక్కడినుంచి వారణాసి ప్రయాణం మొదలవుతుంది. అదే రోజు రాత్రికి వారణాసి చేరుకుంటారు.

ఐదో రోజు సార్‌నాథ్, కాశీలో విశ్వనాథ ఆలయం, వారణాసి కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి అమ్మవార్లను దర్శించుకోవాలి. అదే రోజు సాయంత్రం గంగా హారతిని ప్రత్యక్షంగా తిలకించొచ్చు. అక్కడినుండి అయోధ్య ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇక, ఆరో రోజు అయోధ్య చేరుకుంటాం. అయోధ్యలో ప్రతిష్టాత్మకమైన రామమందిరం, రామజన్మభూమి, హనుమాన్‌గఢిలను దర్శించుకోవాలి. సరయూ నదీతీరంలోని హారతిని ప్రత్యక్షంగా చూడొచ్చు. అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్ ప్రయాణానికి సిద్ధం కావాలి. ఏడో రోజుకు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటాం. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమాన్ మండపాలను దర్శించుకుంటాం. అక్కడినుండి తిరుగు ప్రయాణానికి సిద్ధం అవుతాం. ఎనిమిదో రోజు, తొమ్మిదో రోజు తిరుగు ప్రయాణం ఉంటుంది.
ప్యాకేజీ ధరల వివరాలు..
ఐఆర్‌సీటీసీ పుణ్య క్షేత్ర టూర్ ప్యాకేజీ మూడు కేటగిరీల్లో ఉంది. ఎకానమీ డబుల్, ట్రిపుల్ షేర్ ధర 15,200 రూపాయలుగా ఉంటే, స్టాండర్డ్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర 24,000 రూపాయలుగా నిర్ణయించారు. కంఫర్ట్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర 31,500 రూపాయలు. ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బసచేయడం, స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస చేయడం, వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ ఈ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి.



Click it and Unblock the Notifications













