టైగర్ నెస్ట్‌లో సాహసయాత్రను చేసేద్దామా..!
హిమాలయ శిఖరాగ్రాన దాగిన ప్రకృతి రమణీయ దృశ్యమే టైగర్ నెస్ట్, ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవారికి, ప్రకృతి ప్రేమికులకు ఇదో అద్భుతమైన విడిది కేంద్రం. దారిపొడవునా తారసపడే సహజసిద్ధ అందాలన్నీ సాదర స్వాగతం పలుకుతోన్న అనుభూతినిని కలిగిస్తాయి. ఇలాంటి టైగర్ నెస్ట్ సాహస యాత్రలో మా బృంద అనుభవాలను మీతో పంచుకుంటున్నాం...
మా స్నేహితులతో కలిసి టైగర్ నెస్ట్ ప్రయాణాన్ని ఉదయం త్వరగా మొదలుపెట్టాలని అనుకున్నాం. కాలినడకన కనుక ఉదయాన్నే బయలుదేరి, సాయంత్రానికల్లా ప్రయాణాన్ని ముగించుకోవచ్చు అనుకున్నాం. టైగర్ నెస్ట్ మఠం భూటాన్ లోని అత్యంత ప్రసిద్ధ బౌద్ధమఠాలలో ఒకటి. ఈ బౌద్ధమతాన్ని తత్సంగ్ మఠం (Taktsang Monastery) అని కూడా అంటారు. పారో లోయలోని ఎత్తయిన కొండ పర్వత శిఖరంలా కనిపిస్తుంది ఈ మఠం. అక్కడికి చేరుకోవాలనే కోరిక ఉన్నవారికి అదో పెద్ద సవాలనే చెప్పుకోవాలి. సుమారు 3,120 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై ఓ పర్వతంలా దీనిని నిర్మించారు. పారో నగరం నుంచి మఠం ఉండే ప్రాంతం సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దారిమధ్యలో టైగర్ నెస్ట్ కనిపిస్తుంది.

మేమంతా ఉదయం ఎనిమిది గంటలకు హోటల్ నుంచి బయలుదేరాం. మేం చేరుకోవాల్సిన ఆ ప్రాంతం దట్టమైన అడవి మధ్యలో ఉంది. కొంత దూరం వెళ్లేసరికే ఓ పటరి బజార్ (ట్రాక్ మార్కెట్) ఎదురైంది. అక్కడ టైగర్ నెస్ట్‌కు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఆ చిన్న బజారును దాటుకుంటూ మా అడుగులు ముందుకు పడ్డాయి. ముందుకు వెళ్లగానే పైన్, ఇతర పర్వత చెట్లతో అడవి మరింత దట్టంగా ఆహ్వానం పలికింది. సూర్యకాంతిని కప్పేసే వృక్షసంపద, ప్రశాంతమైన వాతావరణం మాలో మరింత ఆహ్లాదాన్ని రేకెత్తించింది.
కొద్దిగా ముందుకు వెళ్లగానే ఓ జలపాతం కనిపించింది. జాలువారే ఆ నీటి సహాయంతో తిరిగే బౌద్ధ ప్రార్థన చక్రం అక్కడ రూపొందించారు. బౌద్ధమతంలో పవిత్రంగా పరిగణించబడే రంగురంగుల విగ్రహాలూ ఇక్కడ తారసపడ్డాయి. కొద్ది క్షణాలు సేదదీరి, అక్కడి ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించే ప్రయత్నం చేశాం. మా మిత్రులు వారి కెమెరాఫోన్లలో ఆ రమణీయ దృశ్యాలను పోటీపడుతూ బంధించారు.
పారో లోయ అందాలు
అక్కడి నుంచి రోడ్డు మార్గం కుంచించుకుపోయినట్లు మారిపోయింది. సన్నని నడకమార్గంలో మా అడుగులు జాగ్రత్తగా ముందుకు పడ్డాయి. ఎత్తయిన పర్వత మార్గం నుంచి పచ్చని పారో లోయ ప్రకృతి అందాలు చాలా దగ్గర నుంచి చూసే అనుభూతిని మాటల్లో వర్ణించడం కష్టమే! అప్పటికే 5.5 కిలోమీటర్లకు చేరుకున్నాం. సుమారు సగం మార్గాన్ని పూర్తిచేసుకున్న తర్వాత ఓ పెద్ద ప్రార్ధన చక్రం కనిపించింది.

మేమంతా అక్కడ కాసేపు ఆగి, మా వెనకాలే వచ్చే వారందరని కలుసుకున్నాం. తర్వాత మళ్లీ మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. దారి మధ్యలో ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారుచేసిన ప్రార్ధన చక్రాలు కనిపించాయి. పర్యాటకుల రద్దీ పెరగడంతో ఆ ప్రభావం పర్యావరణంపై తగ్గించేందుకు ఇదో మంచి ప్రయత్నమని మాకనిపించింది.
కట్టిపడేసే.. వ్యూపాయింట్
ఈ ప్రాంతంలోనే ఓ రెస్టారెంట్ కూడా ఉంది. ముఖ్యద్వారం నుంచి కొద్దిగా ముందువైపు కనిపిస్తుంది. కావాలంటే అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ, చాలామంది పర్యాటకులు మఠం నుంచి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ భోజనం చేయడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తారు. మేమూ తిరిగి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్లాలనుకుని మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాం. మఠం నుంచి సుమారు ఓ కిలోమీటరు ముందే ఓ వ్యూపాయింట్ కనిపించింది. ఈ ప్రాంతం నుంచి చూస్తే.. మఠం సమానమైన ఎత్తులో కనిపించింది. అందుకే, ఇక్కడి నుంచి మఠం ఫోటోలను తీసుకోవచ్చు. అలా చాలా ఫోటోలనే తీశాం.

బంగారు పైకప్పుతో చేసిన ఈ మఠం చూడ్డానికి రెండుకళ్లూ సరిపోవంటే నమ్మండి! వ్యూపాయింట్ నుంచి మఠానికి చేరుకోవడానికి నేరుగా లోయలో లాండింగ్ ఉంటుంది. ఇక్కడి నుంచి దిగడానికి మెట్లు ఉన్నాయి. మెట్లు దిగగానే ఓ పెద్ద జలపాతం మాకు స్వాగతం పలికింది. దీన్ని వంతెన ద్వారా దాటాల్సి ఉంటుంది. అల్లంత ఎత్తు నుంచి జాలువారుతున్న ఆ జలాలు స్వచ్ఛతకు మారుపేరులా అనిపించింది. లోయలో దిగిన తర్వాత మఠాన్ని చేరుకోవడానికి సుమారు 150 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. దానిముందు ఉన్న దారిలోని మెట్లతో కలిపితే సుమారు 750 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
అబ్బురపరచే నిర్మాణశైలి
మఠం పైకి చేరుకోగానే ఎక్కడలేని ప్రశాంతత దొరికిన భావన కలిగింది. అక్కడ ఏ శబ్దాలూ వినిపించవు. కేవలం జలపాతపు నీటి సవ్వడుల శబ్దం మినహా, మఠం బయటే ఫోటోలు దిగాలి. మఠం లోపలికి కెమెరా, ఫోన్ ప్రవేశం లేదు. అందుకే బయట ఉన్న లాకర్లో అన్నీసామాన్లను భద్రపరిచాం. ఆ లాకర్లకు తాళాలు ఉండవు. వాటిని అలాగే వదిలేస్తారు. భూటాన్ లో దొంగతనాలు చాలా తక్కువగా జరుగుతాయి. అలాంటిది మఠంలో దొంగతనం అనే మాట గురించి ఎవరూ ఆలోచించరు. కొండ పైన నిర్మించిన ఈ మఠం చాలా భాగాలుగా విభజించబడింది.

కొండ అంచుకు మందిరాల సమూహం ఉంది. ఇక్కడ నాలుగు ముఖ్య మందిరాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది పద్మ సంభవ ఆలయం. అక్కడే ఆయన తపస్సు చేసేవారని అక్కడి స్థానికుల నమ్మకం. మఠం నిర్మాణశైలి ఎంతో ఆసక్తి గొలిపింది. భగవాన్ పద్మ సంభవ పులిపై కూర్చొని రావడం వల్లే ఈ ప్రాంతానికి 'టైగర్ నెస్ట్' అనే పేరు వచ్చిందని చెబుతారు అక్కడి స్థానికులు. భగవాన్ పద్మ సంభవని స్థానిక భాషలో 'గురు రిమ్స్' అని పిలుస్తారట! మఠం మొత్తాన్ని రెండు గంటలపాటు తిలకించిన తర్వాత మా తిరుగు ప్రయాణం మొదలైంది.
శుభ్రతపై.. ప్రత్యేక శ్రద్ధ
కాస్త కిందకి వచ్చాక, వ్యూపాయింట్ చేరుకున్నాం. అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. ఆ సమయంలో సూర్యుడు మఠానికి దగ్గర్లో ఉన్నాడు. అందుకే మఠం ఫోటోలు చాలా బాగా వచ్చాయి. తిరిగి వచ్చేటప్పుడు అందరూ ఆకలితో ఉన్నారు. దాంతో దారి మధ్యలో ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లాం. రెస్టారెంట్ నుంచి మఠం కనిపిస్తుంది. అక్కడి నుంచీ మఠం ఫోటోలు తీసుకోవచ్చు. టైగర్ నెస్ట్ మొత్తం దారిలో ఈ రెస్టారెంట్ ఒక్కటే ఉంది. ఒక ప్లేట్ భోజనం 400 రూపాయలు. అందరూ ఆకలితో ఉండడం వల్ల ఫుల్‌గా లాగించేశాం.

5.5 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో కేవలం ఒకే ఒక్క రెస్టారెంట్ ఏర్పాటుకు అనుమతినిచ్చారు ఇక్కడి పర్యాటక అధికారులు. అదే భారత్‌లో అయితే, దారి పొడవునా రెస్టారెంట్లు, హోటల్స్ కనిపిస్తూనే ఉంటాయి. చెత్తాచెదారం కూడా ఎక్కువే అనుకోండి. అయితే, ఇక్కడ మాత్రం స్థానిక గైడ్, ఇతర సభ్యులంతా కలిసి ప్రతి ఆదివారం ఈ దారంతా శుభ్రం చేస్తారట! పర్యావరణ పరిరక్షణకు భూటాన్ ప్రజలు ఇస్తోన్న ప్రాముఖ్యత చూసి భలే ముచ్చటేసింది.
తిన్న తర్వాత మా ప్రయాణం ఇంకాస్త ఉత్సాహంతో తిరుగుముఖం పట్టింది. సాయంత్రం కాబోతుందన్నట్లు ఆకాశంలో మార్పులు కనిపించాయి. వర్షం పడితే ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. చిన్నపాటి జల్లు తప్ప, భారీ వర్షాన్ని మేమిక్కడ అస్వాదించలేకపోయాం. సుమారు నాలుగు గంటలలోపు కిందికి వచ్చేశాం. కింద ఉన్న పటారి బజార్ నుంచి కొన్ని వస్తువులను కొనుక్కుని, మా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం.
ఎలా చేరుకోవాలి?
ముంబయి నుంచి బాగ్ డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని... కొంచెం ఖర్చయినా చెల్లించగలమనుకుంటే అక్కడి నుంచి నేరుగా భూటాన్ సరిహద్దు జైగాన్‌కు ట్యాక్సీలో వెళ్లవచ్చు. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తిచేసుకున్న అనంతరం రాజధాని థింపూనకు చేరుకుంటే పర్యటన ప్రారంభించవచ్చు.
రాత్రి తొమ్మిది గంటల్లోపు చేరుకుంటేనే హోటల్లో విడిదికి వీలవుతుంది. భూటాన్ వంటి దేశాలకు స్వయంగా కంటే టూరిజం సంస్థల ప్యాకేజీల్లో భాగంగా వెళ్లడమే సౌకర్యంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications












