మహారాష్ట్ర పర్యటన - ఒక సంక్షిప్త కధనం

హోమ్ » ప్రదేశములు » » అవలోకనం

మహారాష్ట్ర భారత దేశంలో రెండవ అత్యధిక జనాభాకల రాష్ట్రం. మహారాష్ట్ర దానియొక్క పర్వతాలు, మనోహర బీచ్ లు, అద్భుత సీనరీలు, ఎన్నో రకాల మ్యూజియంలు, చారిత్రక చిహ్నాలు, కొటలు మొదలైన వాటిని కలిగి ఉండి భారత దేశ చరిత్ర విశిష్టతను విస్తృత పరుస్తోంది. మన చరిత్రకు ఒక సాక్ష్యంగా నిలుస్తోంది. మహారాష్ట్ర అనే  పేరుకు అర్ధం కొన్ని అభిప్రాయాల మేరకు ...మహా అంటే సంస్కృతంలో గొప్ప అని రాష్ట్ర అనే పదం రాష్ట్ర కూట వంశం నుండి వెలువడిందని రెండూ కలిపి మహారాష్ట్రగా ఏర్పడిందని చెపుతారు. మరి కొందరు రాష్ట్ర అంటే దేశం అనే అర్ధం సంస్కృతంలో కలదని కూడా చెపుతారు.  చరిత్రకు ఒక సాక్ష్యం మహా రాష్ట్ర సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దంలోనే, బౌద్ధ గుహలు నిర్మించిన నాటినుండే  చరిత్ర పుటలలోకి చేర్చబడింది. ఖ్యాతిగాంచిన చైనా పర్యాటకుడు హ్యూయన్ సాంగ్ మొట్ట మొదటిసారిగా 7వ శతాబ్దంలో తన రచనలలో మహారాష్ట్ర గురించి పేర్కొన్నాడు. చరిత్ర మేరకు ఈ రాష్ట్రం మొట్ట మొదటి హిందు రాజును 6వ శతాబ్దంలో కలిగి ఉంది.                                   

అనేక మంది రాజులు మహారాష్ట్రలో పేర్కొనబడినప్పటికి ఛత్రపతి శివాజి మహారాజు ప్రముఖ వ్యక్తిగా పేర్కొనబడ్డాడు. గొప్పదైన మరాఠా సామ్రాజ్యాన్ని కనుగొన్న శివాజి మొగలాయిలతో అనేక యుద్ధాలు చేసి ఎన్నో కోటలను ఈ రాష్ట్రం చుట్టు పక్కల నిర్మించాడు. ఆయన మరణించిన తర్వాత, మహారాష్ట్ర పాలన అతని కుమారుడు శంభాజీ చేతులలోకి వచ్చింది. అతని తర్వాత రాష్ట్రాన్ని పేష్వా వంశస్ధులు పాలించారు.                                                భారత దేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన వెంటనే 1804 వ సంవత్సరంలో  జనరల్ వెలస్లీమహారాష్ట్ర మరియు దక్కన్ ప్రాంతాలలో మిలిటరీ పాలన ప్రవేశ పెట్టాడు. దానితో పీష్వాలు నామమాత్రపు పాలకులుగా ఈ ప్రాంతాలకు మిగిలిపోయారు. ఇపుడు మనం చూస్తున్న కోటలు, పర్వత ప్రాంతాలు కల  మహారాష్ట్ర 1960లో బాంబే (ఇప్పటి ముంబై) రాజధానిగా ఏర్పడింది.

మహారాష్ట్ర  అనేక పర్వత ప్రాంతాలు, అడవులు, కోటలు, మతపర కట్టడాలు మొదలైన విభిన్న ప్రకృతి అంశాల వైవిధ్యతతో దిగ్భ్రమ కలిగించే రాష్ట్రంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో సుమారుగా 350 కోటల వరకు ఉన్నాయి. ఇవన్నీ మరాఠా పాలకుల పాలనా నైపుణ్యతలను చాటుతాయి. ఈ కోటలు చాలావరకు ఛత్రపతి శివాజీచే నిర్మించబడ్డాయి. జంట కోటలైన విజయదుర్గ మరియు సింధు దుర్గ లు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సముద్ర తీర కోటలుగా చెప్పబడతాయి. పూనే నుండి షుమారు 120 కి.మీ.ల దూరంలో కల శివనేరి కోట మరో పెద్ద కోట. ఇక్కడే శివాజీ జననం జరిగింది. ప్రతాప్ గఢ్ కోట శివాజి కి అఫ్జల్ ఖాన్ కు మధ్య జరిగిన యుద్ధాన్ని ప్రతిబింబిస్తుంది. ఇతర కోటలైన అజింక్యతారా కోట, మురుద్ జంజీరా కోట, హరిశ్చంద్రగడ్ కోట మరియు లోహగఢ్ మరియు విసాపూర్ కోటలు ప్రసిద్ధి చెందిన ట్రెక్కింగ్ పాయింట్లుగా పేర్కొనపడతాయి. ఇన్ని అద్భుత ప్రాంతాలు కల సహ్యాద్రి కొండలలోని మహారాష్ట్ర పర్యటన పర్యాటకులకు ఎంతో ఆనందాన్నిస్తుందనటంలో సందేహం లేదు. సుందరమైన వాతావరణంలో ఎన్నో హిల్ స్టేషన్లు మీకు దర్శనమిస్తాయి. ఈ హిల్ స్టేషన్లు చాలావరకు బ్రిటీష్ పాలకులు వారి పాలనలో వేసవి విడుదులుగా వాడుకొనేవారు.   లోనావాలా, ఖండాలా, మాధేరన్, పంచగని, మహాబలేశ్వర్, సావంత్ వాడి, జవహర్ మరియు తోరణ్మల్ ప్రదేశాలు ప్రసిద్ధి గాంచిన హిల్ స్టేషన్లు. ఈ హిల్ స్టేషన్లు చాలావరకు ముంబై, పూనే వంటి ప్రధాన నగరాలకు సమీపంలో ఉండి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగాకూడా నిలుస్తున్నాయి. చారిత్రక ప్రియులకు మహారాష్ట్రలో సుమారు 13 మ్యూజియంలు కలవు. వాటిలో పూనే లోని గిరిజన మ్యూజియం, ముంబై లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం మరియు జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ, భారత దేశంలో పురాతన కాలంనుండి వస్సతున్న కరెన్సీ చరిత్రను తెలిపే నాసిక్ లోని కాయిన్ లేదా నాణేల మ్యూజియం, ప్రసిద్ధి గాంచినవి. నేషనల్ మేరిటైమ్ మ్యూజియం, షాహాజీ ఛత్రపతి మ్యూజియం మరియు మణి భవన్ మహాత్మ గాంధీ మ్యూజియం లు కూడా పేరొందినవే.

మహారాష్ట్ర అరేబియా సముద్ర తీరం కలిగి ఉండి అనేక బీచ్ లకు కూడా ప్రసిద్ధి గాంచింది. ఎంతో అందమైన మెరైన్ డ్రైవ్ చౌపట్టీ లేదా బస్సీన్ బీచ్ వంటివి పర్యాటకులు బాగా ఇష్టపడతారు. వేల్నేశ్వర్, శ్రీ వర్ధన్ హరిహరేశ్వర్ వంటివి సాహస ప్రియులకు తమ నీటి క్రీడలు అందిస్తాయి. ఇక విశ్రాంతి ప్రియులకు దహను బోర్డి బీచ్ లేదా విజయ సింధు దుర్గ బీచ్ లు పూర్తి వివ్రాంతి అందిస్తాయి. మహారాష్ట్ర ప్రధాన మతపర కేంద్రం కూడాను. అనేక యాత్రా స్ధలాలు కలిగి ఉంది. ప్రసిద్ధి గాంచిన కుంభ మేళా ప్రతి మూడు సంవత్సరాలకు నాసిక్ లో జరుపబడుతుంది. పేరొందిన ముంబా దేవి దేవాలయం ముంబై నగరంలో కలదు. ఔరంగాబాద్ లో కల కైలాస దేవాలయం, మరి కొన్ని పుణ్య క్షేత్రాలైన షిర్డి, పంధార్ పూర్ మరియు బాహుబలి వంటివి కూడా పర్యాటకులు ఎంతో ఇష్టపడే ప్రాంతాలు.  

 ఈ రాష్ట్రంలో కల హాజీ ఆలీ సమాధి సుమారుగా ఎనిమిది శతాబ్దాల కాలం నాటిది. తక్త్ సచ్ ఖండ్ శ్రీ హజూర్ అబ్ చల్ నగర్ సాహిబ్ రాష్ట్రంలోని ముఖ్యమైన గురుద్వారాలలో ఒకటి. పూనే లోని ఓషో ఆశ్రమం మరొక ఆధ్యాత్మిక కేంద్రం. ఇది మీకు ధ్యానం, యోగా వంటి అంశాలు అందిస్తుంది. ముంబై లోని  మౌంట్ మేరీ చర్చి ప్రతి ఏటా బంద్రా జాతర నిర్వహిస్తూ వేలాది భక్తులను ఆకర్షిస్తుంది.

అజంతా, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు, మహాలక్ష్మీ దేవాలయం, గేట్ వే ఆఫ్ ఇండియా వంటి ప్రదేశాలు మహారాష్ట్రలో తప్పక చూడదగినవి. భారతదేశంలో మహారాష్ట్ర ఎంతో అందమైన రాష్ట్రం. దాని సాంస్కృతిక వైవిధ్యం, శిల్పకళా విశిష్టత, మరియు సహజ ప్రదేశాల సౌందర్యం పర్యాటకులను ఆశ్చర్య చకితులను చేస్తుంది. వివిధ రకాల భాషలు, సంస్కృతులు, వంటకాలు అన్నీ కలిపి భారతీయుల విభిన్న సంస్కృతులను ప్రదర్శిస్తాయి. అందమైన ఈ ప్రాంత పర్యటన మీ ప్రణాళికలో తప్పక చేర్చండి. మీకు జీవితంలో మరచిపోలేని మధుర స్మృతులను అది తప్పక అందిస్తుంది.    

Please Wait while comments are loading...