షిర్డీ – సాయి పుట్టిన స్థలం 

షిర్డీ మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లాలో నాశిక్ నుంచి 88 కిలోమీటర్ల దూరం లోని ఒక పాత, చిన్న గ్రామం, ఈ రోజు అది ఒక క్రిక్కిరిసిన యాత్రా స్థలంగా మారిపోయింది.

20వ శతాబ్దపు గొప్ప యోగి సాయి బాబాకు షిర్డీ పుట్టినిల్లు. బాబా షిర్డిలో అర్థ శతాబ్దం కన్నా ఎక్కువ నివసించారు, అంటే తనని చూడ్డానికి, ప్రార్ధించడానికి వచ్చే భక్తులతో ఓ అనామక చిన్న గ్రామంలో 50 ఏళ్ళకు పైగా వుంటూ దాన్ని ఓ పెద్ద యాత్రా స్థలంగా మార్చివేసారు.

షిర్డీ – అద్భుత యోగి సాయిబాబా ఆవాసం 

సాయి బాబా మూలాలు ఎవరికీ తెలియదు – ఆయన జన్మ వివరాలు ఇప్పటికీ రహస్యమే; ఐతే, 16  ఏళ్ళ చిరుత ప్రాయంలో మొదటిసారి వేప చెట్టు క్రింద కనబడింది మొదలు ఆయన అందరిని ఆకట్టుకుంటూనే వున్నారు. బాధాసర్ప ద్రష్టులైన పేద వారి అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. సాయి బాబా ను ‘దేవుడి బిడ్డ’ గా అభివర్ణించేవారు, ఎందుకంటే ఆయనను శివుడి అవతారంగా నమ్మేవారు. ఎప్పుడూ ‘సబ్ కా మాలిక్ ఏక్’ అంటూ తన జీవితం మొత్తం సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వ మత శాంతి సందేశాలను బోధిస్తూ వుండేవారు.

షిర్డీ – అప్పట్నించీ – కేవలం ఆయన అద్భుత రూపాన్ని తమ కళ్ళతో చూసేందుకు దేశం నలు మూలాల నుంచీ వచ్చే సందర్శకులు, భక్తులతో నిండిపోయింది. ఆ మహా యోగి 1918 లో సమాధి చెందినా, ఇప్పటికీ ఆయన సమాధిని నిత్యం లక్షలాది మంది దర్శిస్తున్నారు.

బాల యోగిగా బాబా షిర్డీ చేరుకున్న ప్రదేశాన్ని గురుస్తాన్ అని పిలుస్తారు. ఈరోజు, అక్కడ ఒక చిన్న గుడి, స్మారకం కట్టారు. షిర్డిలో సాయిబాబా తో ఏదో విధమైన అనుబంధం కల ఇతర ప్రదేశాల్లో ఆయన రోజు విడిచి రోజు పడుకునే ద్వారకామాయి కూడా వుంది. ఖండోబా దేవాలయం, సాకోరి ఆశ్రమం, శని దేవాలయం, చంగ్ దేవ్ మహారాజ్ సమాధి, నరసింహ దేవాలయం షిర్డీ వెళ్ళే భక్తుల్ని ఆకర్షించే ప్రదేశాల్లో కొన్ని.

బాబా తన స్వహస్తాలతో పెంచి పోషించిన తోట లెండి వనం. బాబా నిత్యం ఈ వనాన్ని దర్శించి వేప చెట్టు క్రింద విశ్రమించేవారు. ఈ ప్రదేశంలో స్మారకంగా అష్టదళాల తో వుండే ‘నందాదీపం’ అనే దీపగ్రుహాన్ని కట్టారు.

నిలువెత్తు సాయిబాబా విగ్రహాన్ని దర్శింఛి ఆశీస్సులు పొందేందుకు భక్తులు సాధారణంగా తెల్లవారు ఝామునుంచే బారులు తీరుతారు. గురువారాల్లో రద్దీ బాగా వుంటుంది, ఆ రోజు ప్రత్యెక పూజ, బాబా విగ్రహ ప్రత్యెక దర్శనం వుంటాయి. మందిరం ఉదయాన్నే 5  గంటల కల్లా కాకడ ఆరతి తో తెరుస్తారు  - రాత్రి ప్రార్ధనల తర్వాత రాత్రి 10  గంటలకు మూసివేస్తారు. మందిరంలో 600 మంది భక్తులు సరిపోయే పెద్ద హాల్ వుంది. మొదటి అంతస్తులో ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపే చిత్రపటాలు వున్నాయి – అవి చూడవచ్చు. ఈ పవిత్ర స్థలంలోని దుకాణాలు అన్నిటిలో బాబా జీవితానికి సంబంధించిన జ్ఞాపికలు అమ్ముతారు.

షిర్డీ – తీర్థ క్షేత్రం :

షిర్డీ అనే చిన్న పట్టణం ప్రపంచ వ్యాప్తంగా వున్నా సాయి భక్తుల భక్తి తత్పరతతో గుబాళిస్తుంది. ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఈ పల్లెకు అగ్ర తాంబూలం వుంది. తప్పకుండా చూడాల్సిన ఇతర దేవాలయాల్లో శని, గణపతి, శివాలయాలు వున్నాయి.

ఈ పవిత్ర క్షేత్రాన్ని ఏడాదిలో ఎప్పుడైనా చూడవచ్చు, కాని వర్షాకాలంలో ఇక్కడ వాతావరణం హాయి గోల్పేదిగా వుంటుంది కనక, వర్షాకాలంలో దర్శించడం మంచిది.

షిర్డిలో జరిగే ప్రధాన పండుగలు – గురు పూర్ణిమ, దసరా, శ్రీరామనవమి –  అప్పుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు. ఈ పండుగలప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది – వాతావరణం అంతా సాయి భజనలతో మార్మోగి పోతుంది, అప్పుడు జరిగే రథ యాత్రలో కూడా పాల్గొన వచ్చు. ఈ రోజుల్లో మాత్రమె షిర్డీ లోని సమాధి మందిరం రాత్రంతా తెరిచి వుంటుంది.

సాయి బాబా యొక్క ఈ పవిత్ర నివాసానికి రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా  తేలిగ్గానే చేరుకోవచ్చు. ఊరు బాగా అభివృద్ది చెందింది – నాశిక్, పూణే, ముంబై ల నుంచి బస్సుల ద్వారా అనుసంధానం చేయబడింది. దగ్గరలోనే విమానాశ్రయం నిర్మిస్తున్నారు, దీని వల్ల ప్రపంచం నలు మూలల నుంచీ వచ్చే యాత్రికుల సౌకర్యం పెరుగుతుంది. రోడ్డు ద్వారా ఐతే, అహ్మద్ నగర – మన్మాడ్ రాష్ట్ర రహదారి నెంబర్ 10  మీదుగా రావచ్చు – అహ్మద్ నగర జిల్లాలోని కోపర్గావ్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో వుంది.

Please Wait while comments are loading...