భారతదేశానికి ఎంతో చరిత్ర ఉంది. స్వాత్రంత్యోద్యమ కాలం నుంచి ఇప్పటివరకూ జరిగినవన్నీ తెలుసుకోవాలన్న, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, చరిత్రను తెలుసుకునేందుకు మ్యూజియమ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి మ్యూజియమ్‌లు మనదేశంలో చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం ఇప్పడు చెప్పుకోబోయే మ్యూజియమ్‌లు అతి పురాతనమైనవి.
ఈ మ్యూజియమ్‌లు దేశ ఉజ్వల చరిత్రకు అద్దం పడుతున్నాయి. పురాతన కాలం నుండి ఆధునిక కాలం వరకు భారతదేశ చరిత్రను చెప్పే ఇలాంటి మ్యూజియంలు దేశంలో ఎన్నో ఉన్నాయి. వీటి ద్వారానే కొత్త తరానికి మన సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర గురించిన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వెళ్లడం ద్వారా ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు జరిగిన చరిత్రను తెలుసుకోవచ్చు. భారతదేశంలోని పెద్ద, పురాతన మ్యూజియంల గురించి ఇప్పడు తెలుసుకుందాం.

ఇండియన్ మ్యూజియం, కోల్‌కతా
కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం భారతదేశంలో అతిపెద్ద, పురాతన మ్యూజియంగా ప్రసిద్ధిచెందింది. ఈ మ్యూజియంలో పెయింటింగ్స్, శిల్పాలు, అరుదైన కళాఖండాల ప్రత్యేక సేకరణ ఉంటుంది. ఇక్కడ ఉంచబడిన ఈజిప్షియన్ మమ్మీ, అశోక స్తంభం దాని విలువైన ఆస్తులకు ప్రతీకగా చెబుతుంటారు. దాని విస్తారమైన వాస్తుశిల్పం సేకరణ మాత్రమే కాకుండా, ఈ మ్యూజియం చరిత్ర ప్రేమికుల సందర్శించేందుకు ఓ గొప్ప ప్రదేశంగా ప్రసిద్ధిచెందింది.
నేషనల్ మ్యూజియం, న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో ఉన్న నేషనల్ మ్యూజియం భారతదేశంలోని అత్యంత అందమైన, అతిపెద్ద మ్యూజియంలలో ఒకటిగా నిలిచింది. ఈ మ్యూజియం 5000 సంవత్సరాల నాటి కళ, చరిత్రను భద్రపరుస్తుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు మధ్యయుగ కాలం నాటి పురాతన శిల్పాలు, నాణేలు, పెయింటింగ్స్, బట్టలు గురించి తెలుసుకుంటారు. ఈ మ్యూజియంలో సింధు లోయ నాగరికతను చూపించే గ్యాలరీ కూడా ఉంది. ఇది ప్రపంచంలోని పురాతన పట్టణ నాగరికతలలో ఒకటిగా పేరుగాంచింది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, ముంబై
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం ఎంతో పురాతనమైనది. ఇది వాస్తు సంగ్రహాలయ కూడా ప్రసిద్ధిచెందిన మ్యూజియం. దీనిని ముందుగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని పిలిచేవారు. కళాభిమానులకు ఇది ఉత్తమమైన ప్రదేశంగా చెప్పొచ్చు. ఇందులో వివిధ సంస్కృతులకు చెందిన ప్రాచీన భారతీయ శిల్పాలు, సూక్ష్మ పెయింటింగ్‌లు, అలంకార వస్తువులు ఉన్నాయి. ఈ భవనం ఇండో-సార్సెనిక్, పాశ్చాత్య నిర్మాణ శైలుల అందమైన సమ్మేళనం అని చెబుతుంటారు. ఇది మ్యూజియం అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
ప్రభుత్వ మ్యూజియం, చెన్నై
చెన్నైలోని ప్రభుత్వ మ్యూజియం కూడా ఎంతో పురాతనమైనది. ఈ మ్యూజియంలో తమిళనాడు చరిత్ర, సంస్కృతి, అమరావతి శిల్పాలను చూడొచ్చు. ఇంకా ఇక్కడ కాంస్య శిల్పాలు, పురాతన నాణేలు, సాంప్రదాయ దుస్తులతో సహా ముఖ్యమైన కళాఖండాల సేకరణను కూడా వీక్షించొచ్చు. మ్యూజియంలోని ప్రధాన ఆకర్షణ అమరావతి గ్యాలరీ. ఇక్కడ మీరు పురాతన అమరావతి స్థూపం యొక్క అద్భుతమైన శిల్పాలను ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.

సాలార్ జంగ్ మ్యూజియం, హైదరాబాద్
హైదరాబాద్‌లో ఉన్న సాలార్‌జంగ్ మ్యూజియం కూడా ఎంతో పురాతనమైనది. ఈ మ్యూజియం చాలా పెద్దది, దీన్ని చూసేందుకు పర్యాటకులకు సుమారు మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది. ఇది అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లు, శిల్పాలు, వస్త్రాలు, అందమైన ఫర్నిచర్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన కళాఖండాల అద్భుతమైన సేకరణను కలిగి ఉంది. ఈ మ్యూజియంలోని ప్రధాన ఆకర్షణ వెయిల్ రెబెక్కా. ఇది ఒక పాలరాతి విగ్రహం. ప్రత్యేకంగా దీనిని చూసేందుకు పర్యాటకులు ఇక్కడి తరలి వస్తుంటారు.
ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, జైపూర్
ఆల్బర్ట్ హాల్ మ్యూజియం జైపూర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఇది దాని నిర్మాణం, అందమైన సేకరణలకు ప్రసిద్ధి చెందింది. ఇండో-సార్సెనిక్ శైలిలో నిర్మించిన ఈ మ్యూజియంలో పెయింటింగ్‌లు, శిల్పాలు, తివాచీలు, కళాఖండాలు చూడొచ్చు. ఈజిప్షియన్ మమ్మీలు, పర్షియన్ తివాచీలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.



Click it and Unblock the Notifications















