షార్ట్‌ఫిలిమ్స్ అడ్డాగా మారిన.. అరుంధతి కోట చూసొద్దామా..!
సినిమా షూటింగ్ చూడాలంటే చాలామంది ఎగబడి వచ్చేస్తుంటారు. ఎందుకంటే, హీరోలను, హీరోయిన్లను చూసే అవకాశం లభిస్తుందని.. వాళ్లు ఎలా యాక్ట్ చేస్తున్నారోనని తెలుసుకోవాలనే కుతుహాలం చాలామందిలో ఉండేది. ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరూ చేతిలో మొబైల్ పట్టుకొని సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. మంచి మంచి లోకేషన్స్‌కి వెళ్లి, షార్ట్స్, షార్ట్‌ఫిల్మ్ తో సెలబ్రటిలు అవుతున్నారు.
కానీ, సినిమా షూటింగ్ లోకేషన్లంటే ఒకప్పుడు పచ్చని పొలాలు, గ్రామీణ వాతావరణం, మన సంప్రదాయం ఉట్టిపడేవి. కానీ, ఇప్పుడు అదంతా లేదు. ఏ సినిమాలో అయినా విదేశీ షూటింగ్ స్పాట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా షూటింగ్ స్పాట్ల్ ఉన్నాయనే విషయం తెలుసా? ఎపిలో కూడా ఇటీవల సినిమా షూటింగ్‌ల సంఖ్య పెరుగుతోంది. అందుకు తగ్గట్టే.. కొత్త కొత్త లోకేషన్లు పుట్టుకొస్తున్నాయి. ఎక్కువగా చూపరులను ఆకట్టుకునేలా ఉండే లొకేషన్స్‌ను ఎంచుకుంటుంది చిత్ర యూనిట్. రండి ఎపిలోని ఈ మూవీ షూటింగ్ స్పాట్ గురించి తెలుసుకుందాం పదండి.
అరుంధతి కోట..
అరుంధతి సినిమా అందరికీ గుర్తే ఉంటుంది. ఎందుకంటే, అంతటి ఘనవిజయాన్ని సాధించి, తెలుగు సినీ అభిమానులందరీ మెప్పు పొందిన ఆ చిత్రాన్ని ఎలా మరిచిపోతారు చెప్పండి. అందులో జేజమ్మ పాత్రలో ఒదిగిపోయిన అనుష్క శెట్టినయితే అస్సలు మరవరు. అంతలా ఆమె నటన ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. ఆ సినిమాను చిత్రీకరించిన స్పాట్... అదేనండి అరుంధతి కోట అది మరెక్కడో లేదండి. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. రండి ఆ కోట గురించిన విశేషాలు తెలుసుకుందాం.

కోట చరిత్ర..
భారతదేశంలోని అతి పురాతనమైన కట్టడాలలో ఒకటి కర్నూలు జిల్లా బనగానపల్లె నవాబు బంగ్లా. అరుంధతి సినిమా రిలీజ్ తర్వాత దాదాపు అందరికీ ఈ బంగ్లా గురించి తెలిసిపోయింది. రాజా నంద చక్రవర్తి నుండి 1601లో బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా ఈ బనగానపల్లి కోటను జయించాడు. కోటతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా సుల్తాన్ మెచ్చిన జనరల్ సిద్ధు సుంబాల్ నియంత్రణలో ఉండేవి. అతను వాటిని 1665 వరకు సంరక్షిస్తూనే ఉన్నాడు.
ఆ తర్వాత ముహమ్మద్ బేగ్ ఖాన్-ఇ రోస్‌బహానీకి మర్యాదపూర్వకంగా ఈ బనగానపల్లి, చుట్టుపక్కల ప్రాంతాలను ఇచ్చారు. అయితే ఆ రాజుకు వారసులు లేకపోవడంతో అతని దత్తపుత్రుడు ఫైజ్ అలీఖాన్ బహదూర్ వీటి పరిరక్షణ చూసుకునేవాడు. అప్పటి రాజులు బనగానపల్లెలోని తమ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కోసం ఊరికి దూరంగా ఎత్తైన కొండపై ఈ బంగ్లాను నిర్మించారు. 1947 వరకు బనగానపల్లి నవాబుల పాలనలో స్వతంత్ర రాష్ట్రంగా ఉంది.

షార్ట్ ఫిలిమ్స్ అడ్డా..
కోట అయితే కాస్త శిథిలమైపోయింది అయినా కూడా ఇప్పటికీ కోట వన్నె తగ్గలేదు. ఈ కోటలో సుమారుగా 9 గదులు, ఒక పెద్ద హాలు కింద ఒక పెద్ద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుంది. కేవలం కర్నూలు జిల్లాకు సంబంధించిన వారే కాకుండా తెలంగాణ కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో ఈ కోటను చూడ్డానికి సందర్శకులు వస్తుంటారు. ఎక్కువ శాతం యువత చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవడానికి ప్రత్యేకంగా వస్తుంటారు.
చేరుకోవడం ఎలా?
కర్నూలు నుంచి బనగానపల్లెకు దాదాపు 80 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కర్నూలు నుంచి బెతంచెర్ల మీదగా బనగానపల్లె చేరుకుంటే చాలు.. అక్కడ నుండి 8 కిలోమీటర్లు యాగంటికి వెళ్లే దారిలో కుడివైపున ఈ బంగ్లా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications













