ఔరంగాబాద్ భారతదేశంలోని మహారాష్ట్రలోని ఒక ముఖ్యమైన నగరం. ఇది పురాతన మరియు అద్భుతమైన అజంతా, ఎల్లోరా గుహలకు నిలయం. అందుకే చారిత్రాత్మకంగా ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అజంతా, ఎల్లోరా గుహల కారణంగా, దేశ విదేశీ పర్యాటకుల నిత్యం ఇక్కడికి సందర్శనకు వస్తూ ఉంటారు. ఈ నగరం విదేశాల నుండి వచ్చే పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. అనేక రాజభవనాలు, సమాధులు, ఉద్యానవనాలు ఈ నగరానికి అలంకరణగా ఉన్నాయి.
ఔరంగాబాద్ నగరం యొక్క ప్రాముఖ్యతతో 2010లో ప్రభుత్వం మహారాష్ట్ర పర్యాటక రాజధానిగా దీనిని ప్రకటించింది. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క పూర్వపు రాజధానిగా ఉన్నందున ఈ నగరానికి ఔరంగాబాద్ అని పేరు పెట్టారు. ఇక్కడికి వచ్చే ప్రతి పర్యాటకుడు ఇక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయి.

బీబీ కా మక్బరా
తాజ్ మహల్‌ను పోలి ఉండే బీబీ కా మక్బరా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భార్య రబియా-ఉల్-దౌరానీ అలియాస్ దిల్రాస్ బానో బేగం యొక్క అందమైన సమాధి. దీనిని 1661లో ఔరంగజేబు తన భార్య జ్ఞాపకార్థం నిర్మించాడు. ఈ స్మారక చిహ్నం ప్రసిద్ధ తాజ్ మహల్‌ను అచ్చుగుద్దినట్లు దర్శనమిస్తుంది. దీనిని స్థానికంగా దక్కన్ తాజ్ అని పిలుస్తారు. ఔరంగజేబు హయాంలో నిర్మించిన అతి పెద్ద కట్టడాల్లో ఇది ఒకటి.

ఔరంగాబాద్ గుహలు
ఔరంగాబాద్ గుహలు రాతి కొండలను తొలచి చెక్కిన బౌద్ధ దేవాలయాలు. ఇవి ఔరంగాబాద్‌కు వాయువ్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి . ఈ గుహలు ఆరవ మరియు 8వ శతాబ్దాల నాటివి. మృదువైన బసాల్ట్ శిల నుండి చెక్కబడిన ఈ రాతి నిర్మాణాలు భారతదేశంలోని అత్యంత అద్భుతమైన గుహలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఔరంగాబాద్ గుహలు ట్రెక్కింగ్‌కు కూడా అనువైనవిగా పరిగణించబడతాయి. ఈ గుహలలో ఆకర్షించే శిల్పాలు చెక్కిన శైలి సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

ఘృష్ణేశ్వర ఆలయాన్ని సందర్శించండి
ఎల్లోరాలోని ఘృష్ణేశ్వర్ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడి, ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది. ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలలో అతి చిన్నది ( 12వ జ్యోతిర్లింగం అంటారు ). ఇది భారతదేశంలోని చివరి లేదా 12వ జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది.
ఆలయ నిర్మాణం దక్షిణ భారత శైలిని అనుసరించబడి ఉంటుంది. ఔరంగాబాద్‌లో సందర్శించడానికి అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ దేవాలయం చాలా సార్లు పునర్నిర్మించబడింది. ఈ దేవాలయం యొక్క ప్రస్తుత రూపం 18వ శతాబ్దంలో ఇండోర్‌కు చెందిన రాణి అహల్యాబాయి హోల్కర్ చేత నిర్మించబడింది.

దౌల్తాబాద్ కోట వద్ద హైకింగ్
ఔరంగాబాద్ ప్రధాన నగరం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దౌల్తాబాద్ కోట ఒక పురాతన కోట. ఇది మహారాష్ట్రలోని ఏడు అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని 12వ శతాబ్దంలో నిర్మించారు. కోటపై నుండి మొత్తం నగరాన్ని వీక్షించవచ్చు. ఆ దృశ్యం సందర్శకులను మంత్రముగ్దులను చేస్తుంది. పైకి దాదాపు 750 వినూత్న నిర్మితమైన మెట్లు ఎక్కవలసి ఉంటుంది. కానీ క్రిందకి చూస్తే అద్భుతమైన మరియు మరపురాని అనుభవం సొంతం చేసుకోవచ్చు.

సిద్ధార్థ్ గార్డెన్‌లో కుటుంబంతో సరదాగా గడపండి
సిద్ధార్థ్ గార్డెన్ అనేది పార్క్‌తోపాటు జంతుప్రదర్శనశాల కూడా. ఇది ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగాబాద్ యొక్క ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన బీబీ కా మక్బారా నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్ధార్థ్ గార్డెన్ ఔరంగాబాద్ స్థానికులకు ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్. సిద్ధార్థ్ గార్డెన్‌లోని మరో ఆకర్షణ జంతుప్రదర్శనశాల, ఇక్కడ పులులు, సింహాలు, పాంథర్‌లు, సివెట్ పిల్లులు, పాములు, మొసళ్లు, ఈము, నక్క, జింక, హైనా మొదలైన అనేక అడవి జంతువులను చూడవచ్చు. సిద్ధార్థ్ గార్డెన్‌లో అక్వేరియం కూడా ఉంది. వివిధ రకాల రంగురంగుల చేపలను ఇక్కడ చూడవచ్చు. పిల్లలతో సందర్శించడానికి ఇది మంచి ప్రదేశం.



Click it and Unblock the Notifications












