దక్షిణాదిలో సందర్శించేందుకు పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో పురాతన ఆలయాలు చూడాలనుకునేవారికి తమిళనాడు ప్రభుత్వ టూరిజం కార్పొరేషన్ ఓ చక్కని అవకాశాన్ని అందిస్తోంది. రూ.1,000తో కాంచీపురంలోని ప్రసిద్ధ దేవాలయాలు, మహాబలిపురం, ముట్టుక్కడు బోట్ హౌస్‌ని కూడా వీక్షించే అవకాశం పర్యాటకులకు కల్పిస్తోంది. టీటీడీసి అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ కేవలం వన్‌డే టూర్ మాత్రమే. ఇందులో మీరు తమిళనాడులోని పది పురాతనమైన ఆలయాలను దర్శించుకోవచ్చు.. ఈ ప్యాకేజీలో టిఫిన్‌తో పాటు భోజనం కూడా లభిస్తుందడోయ్..!
చెన్నైలోని టూరిస్ట్ కాంప్లెక్స్ నుండి ప్రారంభమయ్యే ఈ టూర్‌లో ఏకాంబరనాథ్ ఆలయం, కంచి కామత్షి ఆలయం, కాంచీపురం, అతివరధర్ ఆలయం, మహాబలిపురంలో ఐదు రథాలు, బీచ్ టెంపుల్, ముట్టుక్కాడు బోట్ క్రూయిజ్ వంటివన్నీ ఆస్వాదించవచ్చు. చెన్నై నుండి ప్రారంభమయ్యే ఈ టూర్ రాష్ట్రంలోని చారిత్రాత్మక మరియు పురాతన దేవాలయాలను కూడా చూపిస్తోంది. అంతేకాదండోయ్.. కాంచీపురంలోని సాంప్రదాయ పట్టు చీరలను కూడా కొనుగోలు చేసుకోవచ్చు. వీటితోపాటు మామల్లపురం బీచ్ సహజ అందాలను కూడా తిలకించొచ్చు. రండి ఈ వన్‌డే ట్రిప్ షెడ్యూల్ ఏంటో చూసేద్దాం..
ఏకాంబరనాథ ఆలయం..
ఉదయం 06:30 AM నిమిషాలకు చెన్నైలోని టూరిస్ట్ కాంప్లెక్స్ నుండి మీ ప్రయాణం మొదలవుతుంది. అక్కడి నుంచి మీ మొదటి గమ్యస్థానమైన ఆలయ పట్టణం కాంచీపురం వైపుగా వెళతారు. ఇక, అక్కడినుంచి ఉదయం ఎనిమిది గంటలకు ఏకాంబరనాథ ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం కాంచీపురంలోని శివునికి అంకితం చేయబడిన అత్యంత ముఖ్యమైన ఆలయాలలో ఒకటిగా నిలిచింది. ఇది వన్‌డే ట్రిప్‌లో భాగంగా సందర్శించే మొదటి పర్యాటక ప్రదేశం. ఇది పంచభూత శివస్థలంగా పేరొందింది.

సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం విస్తరించి ఉంటుంది. ఆ తర్వాత మీ పర్యటన కమాచి ఆలయానికి ఉంటుంది. ఉదయం 09:10 AM సమయంలో కంచి కామాచి అమ్మన్ ఆలయానికి వెళతారు. ఈ ఆలయం దేవి మాతకి అంకితం చేయబడింది. అంతేకాదు, ఇది 51 శక్తి పీఠాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ ఆలయం దాని అందమైన శిల్పకళ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది.
వరదరాజ పెరుమాళ్ ఆలయం..
అమ్మవారి దర్శనం అనంతరం ఉదయం 09:40 గంటలకు కాంచీపురంలోని HTN దక్షిణ భారత వంటకాలను అందించే ప్రసిద్ధ స్థానిక ప్రదేశం. ఇక్కడ దక్షిణాది వంటకాలు ఎంతో ఫేమస్.. ఇడ్లీలు, దోసెలు లేదా వడలతో పాటు సాంబార్, చట్నీ అద్భుతమైన టిఫిన్ రెడీ అవుతుంటాయి. వెంటనే ఓ పట్టు పట్టేసి తర్వాత మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.
ఉదయం 10:20 గంటల సమయానికి వరదరాజ పెరుమాళ్ ఆలయ సందర్శన ఉంటుంది. ఇది విష్ణువుకు అంకితం చేయబడిన ఆలయం. 108 దివ్య దేశాల్లో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్ధిచెందింది. వైష్ణవులకు ఎంతో పవిత్రమైన ప్రాంతాలలో ఇది ఒకటి. ఈ ఆలయం గొప్ప వాస్తుశిల్పం, చారిత్రక ప్రాముఖ్యతతో పాటు, నలభై ఏళ్లకు ఒకసారి కనిపించే అత్తివరధరుని నిలయంగా ఈ ఆలయం పేరుగాంచింది.

మామల్లపురంలోని ఐదు రథాల సందర్శన...
ఈ ఆలయ దర్శనం అనంతరం ఉదయం 10:50 గంటలకు కాంచీపురంలో చేనేత పట్టు చీరల కోసం షాపింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ పట్టణం చేతితో నేసిన పట్టు చీరలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ సాంప్రదాయ కళను ఇక్కడ నేరుగా వీక్షించొచ్చు కూడా. షాపింగ్ అనంతరం మధ్యాహ్నం 01:30 PM మామల్లపురంలోని ఐదు రథాలను సందర్శించాలి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు ప్రసిద్ధి చెందినది. మామల్లపురం తీరప్రాంత పట్టణమైన మహాబలిపురంలో ఈ ఐదు రథాలు ఉంటాయి. ఇవి 7వ శతాబ్దానికి చెందిన ఏకశిలా రాతి దేవాలయాల సమూహం.
ఆ తర్వాత మధ్యాహ్నం 02:10 PM గంటలకు బీచ్ టెంపుల్, అర్జునుడి తపస్సు వంటి ప్రాంతాలను సందర్శించాలి. బంగాళాఖాతానికి ఎదురుగా బీచ్ టెంపుల్ ఉంటుంది. ఇది తమిళనాడు సముద్ర వారసత్వానికి నిలువెత్తు నిదర్శనమని చెబుతుంటారు. ఆ తర్వాత ప్రసిద్ధిచెందిన అర్జునుడి తపస్సుతో పాటు కృష్ణుడి వెన్న బంతి వంటి ప్రదేశాలను కూడా చూడొచ్చు. ఇక, 03:15 సమయంలో మామల్లపురంలో మధ్యాహ్న భోజనం ముగించుకుని పురాతన అద్భుత ఆలయాలను వీక్షించొచ్చు.

మోటర్ బోట్లో ప్రయాణం...
సాయంత్రం 04:15 సమయంలో ముట్టుక్కడు బోట్‌హౌస్ వంటివి ఆస్వాదించాలి. ప్రకృతి సహజ అందాలను వీక్షించాలనుకునేవారు తప్పకుండా ఈ ప్రదేశానికి రావాల్సిందే. ఇక్కడ తెడ్డు పడవ, పడవ లేదా మోటర్ బోట్ అద్దెకు తీసుకోవచ్చు. రాత్రి 07:00గంటల సమయంలో టూరిస్ట్ కాంప్లెక్స్, చెన్నైకి చేరుకోవడంత మీ పర్యటన ముగుస్తోంది. టీటీడీసి అందిస్తోన్న ఈ స్పెషల్ వన్‌డే టూర్ ప్యాకేజీని బుక్‌చేసుకోవాలంటే తమిళనాడు ప్రభుత్వ టూరిజం కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే. ఇతర పూర్తి సమాచారం కోసం పర్యాటకులు ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.



Click it and Unblock the Notifications













