పొగమంచు తెరల మాటున దాగిన హెబ్బే జలపాతం అందాలు
సహజసిద్ధ ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే చిక్కమగళూరు జిల్లాలో అద్భుత హెబ్బే జలపాతం ఉంది. ప్రసిద్ధ హిల్ స్టేషన్ కెమ్మనగుండి సమీపంలో ఉన్న ఈ జలపాతం కర్ణాటకలోని అత్యంత అందమైన జలపాతాలలో ఒకటిగా పేరుగాంచింది. భద్ర వన్యప్రాణుల అభయారణ్యం లోపల దాగి ఉన్న హెబ్బే జలపాతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా చెప్పుకోవచ్చు. ఆ పర్యాటక విశేషాలను చూద్దాం.
హెబ్బే జలపాతం చుట్టూ ఉన్న కాఫీ ఎస్టేట్‌లు జలపాతానికి వెళ్లే సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. పచ్చని కాఫీతోటలు, దట్టమైన అడవులు, అందమైన జలపాతం చుట్టూ తిరిగే చిన్న చిన్న సీతాకోకచిలక మాదిరిగా సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతి ప్రేమికులతోపాటు పర్యాటక ఆసక్తి గలవారు హెబ్బే జలపాతానికి పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతారు. ప్రసిద్ధ హిల్ స్టేషన్, కెమ్మనగుండి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. కెమ్మనగుండి నుండి పర్యాటకులు తరచుగా జీప్ రైడ్ ద్వారా హెబ్బే జలపాతాన్ని సందర్శిస్తారు. దట్టమైన అడవులతో చుట్టుముట్టబడిన ఎగుడుదిగుడు మార్గం గుండా సాహసంతో కూడుకున్న ఈ ప్రయాణానికి కెమ్మనగుండిలో క్యాబ్ సేవలు అందుబాటులో ఉంటాయి. కొంతమంది సాహస యాత్రికులు ప్రకృతి సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి హెబ్బే జలపాతానికి ట్రెక్కింగ్ చేస్తారు. పర్వతారోహణ ద్వారా అడవులు మరియు కాఫీ ఎస్టేట్‌ల యొక్క అద్భుతమైన దృశ్యాలను కనులారా వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.

ఔషధ గుణాలు కలిగిన జలపాతం
జవపాతానికి చేరుకునేందుకు చేసే ప్రయాణంలో దూరం నుంచే జలపాతం పారుతున్న శబ్దం వినబడుతుంది. వర్షాకాలంలో, ట్రెక్కింగ్ మార్గం జారుడుగా మారుతుంది. అంతేకాదు, దాదాపు ప్రతిచోటా పెద్ద సంఖ్యలో జలగలు కనిపిస్తాయి. ఇది ఔషధ గుణాలు కలిగిన జలపాతంగా కూడా పేరుపొందింది. అడవిలోని అనేక ఈ ఔషధ మొక్కల గుండా ప్రవహించే నీటి ప్రవాహం వాటి వేల్లనుంచి ఔషధ గుణాలను సేకరిస్తుంది. జలపాతం యొక్క ఈ ప్రత్యేక లక్షణం ఆసక్తిగల జీవశాస్త్రవేత్తలకు ఆకర్షణీయ ప్రదేశంగా గుర్తింపు పొందింది. అందుకే, హెబ్బే జలపాతం చిక్కమగళూరు జిల్లాలోని అత్యంత అద్భుతమైన సహజ ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది.

హెబ్బే జలపాతానికి ఎలా చేరుకోవాలి
మీరు హెబ్బే జలపాతాన్ని బస్సులో సందర్శించాలనుకుంటే, చిక్కమగళూరు బస్టాండ్ నుండి బస్సులో చేరుకోవచ్చు. కెమ్మనగుండి నుండి హెబ్బే జలపాతం వరకు గంభీరమైన మార్గాన్ని ఆస్వాదించడానికి, మీరు కెమ్మనగుండి నుండి జీపులో ప్రయాణించవచ్చు. ప్రధానంగా ఈ మార్గంలో సుమారు 13 కిలోమీటర్ల ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని సొంతం చేస్తుంది. కొన్ని అందమైన ప్రకృతి దృశ్యాలను దాటుకుంటూ ముందుకు సాగుతున్న అనుభూతి కలుగుతుంది. కెమ్మనగుండి నుండి హెబ్బే జలపాతం వరకు ట్రెక్కింగ్ చేయవచ్చు. సమీప రైల్వే స్టేషన్ తరికెరె జంక్షన్. మీరు తరికెరె జంక్షన్‌లో దిగిన తర్వాత, అక్కడి నుండి హెబ్బే జలపాతానికి లోకల్ టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.

సందర్శించడానికి ఉత్తమ సమయం
వర్షాకాలంలో తడిగా, బురదగా మారడం వలన ట్రెక్ మార్గం కొద్దిగా ప్రమాదకరంగా మారుతుంది. అలాగే వర్షాకాలం అంటే జలగలు విరివిగా బయటకు వస్తాయి. వర్షాకాలంలో హెబ్బే జలపాతాన్ని సందర్శించకపోవడమే మంచిది. పచ్చని అడవులను చూసేందుకు, హెబ్బే జలపాతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలం. మనదేశంలో శీతాకాలం అక్టోబర్‌లో ప్రారంభమై జనవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో, మీరు పచ్చని ఆకులతో కప్పబడిన దట్టమైన అడవులను చూడవచ్చు. అలాగే జలపాతం చుట్టూ, కొండలు చుట్టూ పొగమంచు కనువిందుచేస్తుంది. మీరు అక్టోబర్ ప్రారంభంలో సందర్శిస్తే, వర్షాకాలం ముగుస్తుంది కాబట్టి పొగమంచుతో పాటు పచ్చని ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications













