ఆధ్యాత్మిక జాతర ఈ అమర్‌నాథ్ యాత్ర..
అమర్‌నాథ్ యాత్ర..అణువణువునా ఆధ్యాత్మికత నింపుకున్న యాత్ర.. అడుగడునా సాహాసాన్ని కలబోసుకున్న యాత్ర..
ప్రతి ఏటా లాగే ఆ మహాశివుని దర్శన భాగ్యం కోసం ఎదురుచూసే రోజు రానే వచ్చింది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ప్రపంచం నలుమూలలకి ఆ శివనామస్మరణం వినిపించేలా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ప్రారంభం కాబోయే అమర్‌నాథ్ యాత్ర విశేషాలను తెలుసుకుందాం రండి.

అమర్‌నాథ్ యాత్ర..
అమర్‌నాథ్ యాత్ర శ్రీనగర్‌లోని పహల్గామ్‌లో మొదలవుతుంది. నిజానికి, మంచుకొండల్లో దాగిఉన్న ఈ మహాశివున్ని దర్శించుకునేందుకు మూడు మాసాల ముందే రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. పదమూడేళ్లలోపు పిల్లలు 75ఏళ్లు దాటిన వృద్ధులను ఈ యాత్రకు అనుమతించరు. అనంతనాగ్ జిల్లా పహల్లామ్, గండర్ బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో అమర్ నాథ్ యాత్ర కొనసాగుతుంది.
ఇక్కడికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రతీ ఏటా ఎంతో వైభవోపేతంగా జరిగే అమర్నాథ్ యాత్రకు దేశవిదేశాల నుంచి లక్షల్లో భక్తులు హాజరవుతూ ఉంటారు. హిమాలయాల నడుమ కోలాహలంగా జరిగే ఈ యాత్రకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లి శివనామస్మరణ చేసి తరించాలనుకుంటారు చాలామంది భక్తులు. జులైలో ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఈ ఏడాది కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతారని అంచనా.
అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం..
భారతదేశంలో అత్యంత పవిత్రమైన శైవ పుణ్యక్షేత్రాలలో అమర్‌నాథ్ ఒకటి. అమర్‌నాథ్ యాత్రకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని చాలామంది కోరుకుంటారు. ఎందుకంటే, అమర్‌నాథ్ అంత పవిత్ర పుణ్యేక్షేత్రం కాబట్టి. ఈ అమర్‌నాథ్ ఆలయం దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఉంది. అమర్‌నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల తరలివెళ్తుంటారు.

ఇక్కడికి వచ్చే భక్తులందరూ కచ్చితంగా ఆరోగ్య ధ్రువపత్రాన్ని పొందుపర్చాల్సి ఉంటుంది. ఆరు వారాలకు పైబడిన గర్భిణీలు యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు. ఇక్కడికి దేశ నలుమూల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
సాహసంతో సాగే యాత్ర..
ప్రకృతి రమణీయతల మధ్య ఎంతో సాహసంతో సాగే యాత్ర ఈ ఏడాది జులై 1న ప్రారంభమై 62 రోజులపాటు కొనసాగి ఆగస్టు 31న ముగుస్తుంది. దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యాత్ర ఆద్యంతం వారికి సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడవునా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసారు.
క్యాంపుల సామర్ధ్యాన్ని పెంచి ఒక్కోచోట సుమారు 75000 మందికి పైగా భక్తులకు వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. వ్యర్ధాలను తొలగించడానికి ప్రతి క్యాంపులోనూ అంతర్గతంగా నిర్మించిన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సుమారు 8-9 లక్షల హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ ఆలయాన్ని చేరేందుకు శివనామస్మరణం ఎంతగానో ఉపయోగపడుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications













