భారతదేశంలోని అత్యంత ఖరీదైన హోటల్ ఇదే...
భారతదేశంలో అందమైన ప్రదేశాలకు కొదవే లేదు. అలాగే అందమైన హోటళ్లు, లగ్జరీ హోటళ్లకు కూడా కొదవే లేదు. అత్యంత అందమైన హోటల్‌లో బస చేసి ఉండవచ్చు. తక్కువ బడ్జెట్ కలిగిన హోటల్‌లో కూడా స్టే చేసి ఉండవచ్చు. కానీ, భారతదేశంలోని అత్యంత ఖరీదైన హోటల్‌ను ఎప్పుడైనా చూశారా, ఆ హోటల్‌లో బస చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? మధ్యతరగతి వారికి అలాంటి కోరికలు నేరవేరడం కష్టమే కానీ. అయితే, ఆహోటల్ గురించి తెలుసుకోవడంలో తప్పేముందది చెప్పండి. భారతదేశంలోని అత్యంత ఖరీదైన హోటల్ ఎక్కడో లేదండి జైపూర్‌లోనే ఉంది. ఈ హోటల్ గురించి తెలుసుకుందాం పదండి.
ది చోము హవేలీ అనేది ఈ హోటల్ పాతపేరు..
జైపూర్‌లోని రాజ్ ప్యాలెస్ ఇప్పుడు అత్యంత ఖరీదైన హోటల్ జాబితాలో ఒకటిగా పరిగణించబడింది. ఈ హోటల్‌కున్న ప్రత్యేకతలతో ఎన్నోసార్లు ఎన్నోఅవార్డులను కూడా ఈ హోటల్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు ప్యాలెస్‌గా ఉన్న దానినే ఇప్పడు హోటల్‌గా మార్చారు. ఈ ప్యాలెస్ నేడు భారతదేశంలోని అత్యంత ఖరీదైన హోటళ్లలో ఒకటిగా నిలిచింది. ఈ ప్యాలెస్‌ను 1727లో నిర్మించారు. ఈ హోటల్ పాత పేరు 'ది చోము హవేలీ' ఈ ప్యాలెస్‌కు చోము చివరి రాజు ఠాకూర్ రాజ్ సింగ్ పేరు పెట్టారు. అయితే 1996లో ఈ ప్యాలెస్‌ను యువరాణి జయేంద్ర కుమారి హోటల్‌గా అభివృద్ధి చేయాలని అనుకున్నారు. అప్పటినుంచి ఈ ప్యాలెస్ హోటల్‌గా రూపాంతరం చెందింది.

జైపూర్‌లోని రాజ్ ప్యాలెస్..
దేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంది. జైపూర్‌లోని రాజ్ ప్యాలెస్ 300 ఏళ్ల నాటి రాజ భవనం. రాచరికపు అనుభూతిని పొందాలంటే మాత్రం తప్పకుండా ఈ ప్యాలస్ ను సందర్శించాల్సిందే...ఈ హోటల్ నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. ప్రతి అంతస్తులో ఒక టెర్రస్, ఉద్యానవనం, స్పా సెంటర్, స్విమ్మింగ్ ఫూల్, అత్యంత ఖరీదుతో కూడుకున్న డైనింగ్ హాల్, మ్యూజిఎం వంటివి ఉన్నాయి. గదిని బుక్‌చేసుకున్న వారికి మాత్రం ప్రైవేట్ బట్లర్, డైనింగ్ రూమ్, ప్రపంచంలోనే అత్యుత్తమ మద్యం కలిగిన విలాసవంతమైన బార్ లభిస్తాయి.
ఈ హోటల్‌లోని గదులన్నీ బంగారు ఫర్నిచర్‌తో ఉంటాయి. ఈ హోటల్‌లోని ప్రత్యేకమైనది మహారాజా పెవిలియన్ సూట్. ఈ మహారాజా ఫెవిలియన్ సూట్ చూసేందుకు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ హోటల్‌లోని గదులన్నీ రాయల్‌లుక్‌లో ఉంటాయి. అందుకే విదేశీ పర్యాటకులనుసైతం ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ హోటల్లోని గదిలో ఒక్క రోజు బస చేయాలంటే లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.

ఎన్నో అవార్డులు ఈ హోటల్ సొంతం..
ఈ హోటల్‌లోని ఓ గదిలో బంగారంతో పెయింట్ చేసిన గోడలు, ఠాకూర్ సాహిబ్ రాజ సింహాసనాలు ఉంటాయి. ఆ గదినే మాస్టర్ బెడ్ రూమ్ అని పిలుస్తారు. ఈ హోటల్‌ని ప్రభుత్వం "బెస్ట్ హెరిటేజ్ హోటల్ ఆఫ్ ఇండియా"గా గౌరవించింది. అంతేకాకుండా, ఏడుసార్లు "వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్" ద్వారా సత్కరించింది. వరల్డ్స్ లీడింగ్ హెరిటేజ్ హోటల్ గా కూడా ఈ హోటల్‌ను ఎంపిక చేయడం జరిగింది.
ఇక్కడ 50 విలాసవంతమైన గదులు ఉన్నాయి
ఈ హోటల్‌లో 50 విలాసవంతమైన గదులు ఉన్నాయి. ఈ గదులన్నీ మొఘల్ కాలం నాటి డిజైన్‌ను పోలి ఉండడం విశేషం. ఎన్నో ఏళ్ల నాటి చారిత్రక విశేషాలు ఇప్పటికీ ఈ హోటల్‌లో దాగి ఉన్నాయి. ఈ హోటల్‌లో ఎంతోమంది ప్రముఖులు, సెలబ్రీటీలు బస చేశారు.
ఈ హోటల్‌ని గదుల ధరలు...
ఈ హోటల్‌లోని హెరిటేజ్, ప్రీమియర్ గదులకు రాత్రి బస చేసేందుకు అద్దె దాదాపు రూ. 60 వేల నుంచి ప్రారంభమవుతుంది. 60వేల రూపాయలు చాలా తక్కువే.. హిస్టారికల్ సూట్ అద్దె గదిలో అయితే రాత్రి బసకు రూ.77 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రెస్టీజ్ సూట్‌కి ఒక్క రాత్రి అద్దె లక్ష రూపాయల కంటే ఎక్కువే ఉంటుంది. ప్యాలెస్ సూట్‌కు రాత్రి అద్దె రూ. 5 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. ఇక్కడ అత్యంత ఖరీదైనది ప్రెసిడెన్షియల్ సూట్. ఇందులో ఒక్క రాత్రి బస చేసేందుకు అద్దె రూ. 14 లక్షల కంటే ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది.
రాజ్ ప్యాలెస్ ఎలా చేరుకోవాలి
ఈ హోటల్ జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాదు, ఇది జైపూర్ రైల్వే స్టేషన్ నుండి 7.9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గాల ద్వారా జైపూర్ ను చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications













