కార్తీక మాసం సందర్భంగా చాలామంది భక్తులు శివాలయాలను సందర్శించేందుకు అనేక ప్రాంతాలకు వెళ్తుంటారు. తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయాన్ని కార్తీక మాసంలో సందర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగా ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయంలో శివుడు అగ్నిలింగంగా అవతరించాడు. ఈ అరుణాచలేశ్వర ఆలయంలోని మహాశివుణ్ని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం లభిస్తుందని చాలామంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ కారణంగానే ఇక్కడ ఏటా పర్యాటకుల తాకిడి పెరుగుతూ ఉంటుంది.
ఈ ఆలయం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో పచ్చని కొండల మధ్య వెలసింది. తిరువణ్ణామలై పర్వత పాదాల చెంత 25 ఎకరాల్లో నలుదిశల్లో గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం సంప్రదాయ ద్రావిడ శైలిలీ ఉంటుంది. దీనిని పల్లవులు, చోళులు, విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయకులు నిర్మించారు. ఇలా ఎందరో రాజులు వెయ్యి సంవత్సరాల పాటు ఎన్నో మార్పుల చేర్పులు చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఈ ఆలయ ప్రధాన రాజగోపురం 217 అడుగుల ఎత్తులో 11 అంతస్థులతో దేశంలోని రెండో అతిపెద్ద గోపురంగా ప్రఖ్యాతి గాంచింది. ఈ ఆలయం ప్రాంగణంలో చిన్నా పెద్ద మొత్తం కలిపి తొమ్మిది గోపురాలతో పాటు ఐదు ప్రాకారాలు ఉన్నాయి. ఐదో ప్రాంగణంలోని వేయి స్తంభాల మండపాన్ని కృష్ణదేవరాయాలు నిర్మించారు. మూడో ఆవరణలో పదహారు స్తంభాల దీపదర్శన మండపం లేదా కాంతి మందిరం ఉంటుంది.
ఎంతో మహిమగల వృక్షం...
ఈ ఆలయంలో ఒక వృక్షం ఉంది. ఆ వృక్షాన్ని ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పిల్లలు లేని వారు ఈ చెట్టు కొమ్మలకు ఊయలలు కట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడి గర్భాలయంలోని శివలింగం ఎంతో పెద్దదిగా ఉంటుంది. ఈ శివలింగాన్ని తేజోలింగం అని కూడా పిలుస్తారు. ఇంకా ఈ ఆలయంలో ముప్పయి అడుగుల భారీ కుడ్యాలు రెండు పుష్కరిణులూ అనేక మందిరాలు, విగ్రహాలు ఉన్నాయి. చూడచక్కని శిల్పాలతో ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. శివునికి ఓ వైపు పార్వతిదేవి ఉంటుంది. ఈ పార్వతిదేవీ ఇక్కడికొచ్చే భక్తులంతా అపీతకుచాంబ అనే పేరుతో పిలుస్తుంటారు.
వారం రోజుల పాటు వెలిగే దీపం...
ఈ ఆలయంలో స్వామివారికి ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదిగంటల వరకూ రోజుకు ఆరుసార్లు దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. అన్ని పండుగలను, ఆచారాలను ఎంతో నిబద్ధతతో చేస్తారు. తమిళ నెల ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్ లో వచ్చే కార్తిగై బ్రహ్మోత్సవ సమయంలో పదిరోజుల పాటు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామివారిని రాత్రివేళల్లో వెండి వాహనంపై ఊరేగించడం జరుగుతుంది. కార్తీకపౌర్ణమి రోజు ఈ ఆలయం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది. కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతారు.
పౌర్ణమి నాడు సాయంత్రం ఆరుగంటలకు ఏడు అడుగుల ఎత్తయిన రాగిపాత్రలో మూడువేల కిలోల నెయ్యి పోసి, వెయ్యి మీటర్ల దూదితో పొడవాటి దీపాన్ని చేసి వెలిగించడం జరుగుతుంది. ఈ దీపాన్ని మహాదీపం అని పిలుస్తారు. ఈ దీపాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఈ దీపం వారంరోజుల పాటు వెలుగుతూనే ఉంటుందట. అంతేకాదు, ఈ దీపం సమీపంలోని 30 కిలోమీటర్ల వరకూ కనిపిస్తూనే ఉంటుందట. మరెందుకాలస్యం ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే.



Click it and Unblock the Notifications












