ఈ సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లాలని చాలామంది ప్లాన్‌లు వేస్తుంటారు. కానీ బడ్జెట్ సరిపోక వెనక్కితగ్గుతుంటారు. కానీ, అతితక్కువ బడ్జెట్‌తో కూడా దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించేయొచ్చు. ఇక, ఈ సీజన్‌లో చాలామంది చల్లని ప్రాంతాలకు వెళ్లాలనుకుంటారు. అలాంటి వారు తప్పకుండా డల్హౌసీలోని ఈ ప్రదేశాలను చూడాల్సిందే. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు, అతితక్కువ బడ్జెట్‌తోనే ఈ ప్రాంతాన్ని వీక్షించేయొచ్చు. డల్హౌసీలోని తప్పక సందర్శించాల్సిన కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉంటుంది. ఈ ప్రాంతం ఓక్ చెట్లు, పచ్చని పైన్‌ల మధ్య ఉంటుంది. ఇది రాష్ట్రంలోని అందమైన, సహజమైన కొండ పట్టణంగా చెప్పొచ్చు. దీనిని 1854లో వైస్రాయ్ లార్డ్ డల్హౌసీ స్థాపించారు. వేసవిలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఎంతో ఉత్తమం. ఇక, ఈ చిన్న పట్టణంలో పర్యాటకల ప్రదేశాలకు కొరత లేదు. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునేవారు, ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త విశ్రాంతి పొందాలనుకునేవారు తప్పకుండా ఇక్కడ గడపాల్సిందే. రండి ఇక్కడి ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
ఖజ్జియార్
డల్హౌసీ పర్యటనకు వచ్చి ఖజ్జియార్ వంటి ప్రదేశాన్ని చూడకపోతే మీ విహరయాత్ర వృథా కాకమానదు. ఖజ్జియార్ హిమాచల్‌ప్రదేశ్‌లోని డల్హౌసీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పట్టణం. ఖజ్జియార్ పచ్చికభూములకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడి గడ్డి మైదానం మధ్యలో కనిపించే ఓ చిన్న సరస్సు ఇక్కడికి వచ్చే సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలను పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతాయి. ఈ ప్రదేశాన్ని 'మినీ స్విట్జర్లాండ్' లేదా 'స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా' అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి సుమారు 6,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది లొకేషన్లకు కూడా పేరుగాంచింది. ఇక్కడ ఎన్నో బాలీవుడ్, టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగాయి. ఈ ప్రదేశం జోర్బింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి సాహసాలకు కూడా ప్రసిద్ధిచెందింది.

దంకుండ్ శిఖరం
ఖజ్జియార్‌ను సందర్శన తర్వాత, డల్హౌసీలోని మరో ఎత్తైన ప్రదేశం దంకుండ్ శిఖరం. ఈ శిఖరాన్ని సింగింగ్ హిల్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చరుకోవాలంటే ట్రెక్కింగ్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ శిఖరం నుండి లోయలు మరియు కొండల అద్భుతమైన దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.

కలాతోప్ ఖజ్జియార్ అభయారణ్యం
ఇక్కడ సందర్శించదగిన ప్రదేశాలలో మరొకటి కలాతోప్ ఖజ్జియార్ అభయారణ్యం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని చంబల్ జిల్లాలో ఉంది. ఈ అభయారణ్యం డల్హౌసీ నుండి ఖజ్జియార్‌కు వెళ్లే మార్గంలో ఉంటుంది. ఈ అభయారణ్యంలో అరుదైన జంతుజాలం జీవం పోసుకుంటుంది. కలాటోప్ అంటే 'నల్ల టోపీ'. కాలాతోప్‌లోని పచ్చదనం, వైవిధ్యమైన చెట్లు, మొక్కలు ఈ అభయారణ్యంలో ఉంటాయి. ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు.

పంచపూల
డల్హౌసీలోని మరో అందమైన ప్రదేశం పంచపూల. ఇక్కడ చుట్టూ పచ్చని పైన్ చెట్లు, ఐదు ప్రవాహాలు కలిసే జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ మరియు దాని అందమైన దృశ్యాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో ఈ జలపాతం అందం మరింత పెరుగుతుంది. కానీ, ఈ సీజన్‌లో మాత్రం ఇక్కడి ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు సేదతీరొచ్చు. మరెందుకాలస్యం మీరు కూడా ఈ ప్రాంతాలను చూసేయండి..



Click it and Unblock the Notifications













