మరో రెండో మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. కనకదుర్గమ్మ అమ్మవారిని ఈ తొమ్మిదిరోజులు ఎంతో భక్తితో కొలుస్తారు. ఇక, దసరా పండుగ అంటేనే చాలామందికి బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం గుర్తుకొస్తుంది. ఇక్కడ దసరా ఉత్సవాలు ప్రతిఏటా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఎక్కడెక్కడినుండో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఏపీలోని మరో ప్రాంతంలో కూడా దసరా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అదే తూర్పుగోదావరి జిల్లాలోని వెదురుపాక విజయదుర్గా పీఠం. ఇక్కడ ప్రతి ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుతారు.
ఇక, ఈ ఏడాది వెదురుపాక విజయదుర్గా పీఠంలో అక్టోబర్ 3వ తేది నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులు వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఈ తొమ్మిది రోజుల పాటు కనకదుర్గమ్మవారిని తొమ్మిది రకాలుగా అలంకరించి, పూజా కార్యక్రమాలు చేపడతారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈపీఠంలో వచ్చే నెల 3వ తేదీన ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి హస్త నక్షత్రంలో ఉదయం 8:19 గంటలకు అమ్మవారి మూల విరాట్ వద్ద కలశస్థాపనతో కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అదే రోజున విజయదుర్గ మాతాను బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించనున్నారు.

దుర్గమాత అలంకరణలు..
అలాగే, అక్టోబర్ 4 తేదీన గాయత్రీ దేవీగానూ, అక్టోబర్ 5 తేదీన అన్నపూర్ణాదేవిగానూ అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 6 తేదీన లతితా త్రిపుర సుందరీ దేవీగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక, అక్టోబర్ 7 తేదీన రజత కవచ విజయదుర్గాదేవి గా, 8 వ తేదీన మహాలక్ష్మీదేవిగా, అక్టోబర్ 9 తేదీన సరస్వతీ దేవిగా, అక్టోబర్ 10న దుర్గాదేవి అలంకరణలో ఉంటారు. అక్టోబర్ 11 తేదీన మహిషాసురమర్ధని దేవీ అవతారంలోనూ, అక్టోబర్ 12వ తేదిన రాజరాజేశ్వరిదేవీ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ పూజా కార్యక్రమాలకు తూర్పు
గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు దర్శనం కోసం తరలివ స్తారు. ఈ నవరాత్రతుల సందర్భంగా ఈ తొమ్మిది రోజులు విజయదుర్గా పీఠంలో భక్తుల కోలాహలం మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ శవన్నవరాత్రి ఉత్సవాలు గత 52 ఏళ్లుగా నిర్విరామంగా జరుగుతున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.
వెదురుపాక విజయదుర్గా పీఠంలో 1974 సంవత్సరంలో తొలిసారి అమ్మవారి పాద ముద్రికలు ఏర్పడ్డాయని ఇక్కడివారు చెబుతుంటారు. శరన్నవరాత్రులను పురస్కరించుకుని రోజూ పీఠంలో పలు రకాల పూజలు నిర్వహిస్తారని అధికారులు వివరించారు.



Click it and Unblock the Notifications













