ఎపిలోని గంగమ్మజాతరకు ఎప్పుడైనా వెళ్లారా?
భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. ఇక్కడ విభిన్న రకాల మతాలు, విభిన్న రకాల పండుగలు ప్రజలు నిర్వహించుకుంటారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సంప్రదాయం ఒక్కో ప్రాంతానికి ఒక్కో పండుగలు, జాతరలు, బోనాలకు ప్రసిద్ధి చెందింది భారతదేశం. ఎన్నో ఆధ్యాత్మిక ప్రాంతాలకు నిలయం కూడా. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల దేవస్థానం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది శ్రీ వెంకటేశ్వరస్వామి. శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఎక్కడినుంచో ప్రజలు తరలివస్తుంటారు.
అదే తిరుపతిలో చాలామంది దేవతలు, అమ్మవార్లు కొలువై ఉన్నారు. వారిని కూడా ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో కొలుస్తారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర ఈ మధ్యకాలంలో ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఏటా మే నెలల్లో జరిగే ఈ జాతరకు సుమారు 900 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ ప్రాంత ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను అద్దంపట్టేలా వారం రోజులపాటు అత్యంత కోలాహలంగా జరుగుతుంది ఈ జాతర.

జాతర ప్రత్యేకతలు..
జాతర అనగానే సహజంగా అందరికీ ఏం గుర్తుకు వస్తుంది. సంతోషంగా ఉత్సవం జరుపుకోవడం, జంతువులను బలి ఇవ్వడం, కొత్త బట్టలు ధరించడం ఇవన్నీ ఉంటాయి. కానీ తిరుపతి గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతంలో జాతర జరిగే వారం రోజులు భక్తులు వివిధ వేషాల్లో అమ్మవారిని దర్శించుకుంటారు. మామూలుగా బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లు రోజుకొక వాహనం పై ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ గంగమ్మ ఉత్సవాల్లో మాత్రం భక్తులే రోజుకొక వేషం ధరించి గంగమ్మను దర్శించుకుంటారు. దీనికి పెద్ద చరిత్రే ఉంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

గంగమ్మ జాతర చరిత్ర..
గతంలో తిరుపతిని పాలిగాళ్లు పరిపాలించే వారు. అయితే వారి పరిపాలనలో ఆరాచకాలు శృతిమించాయి. ఆడవారిపై దాడి చేసేవారు. పాలిగాళ్లు పెట్టే భాదలు భరించలేక తిరుపతి ప్రజలు గంగమ్మను వేడుకున్నారు. పాలెగాళ్లను అంతమొందించడం కోసం గంగమ్మ తల్లి అనేక వేషధారణల్లో ప్రయత్నం చేసింది. ఈవిధంగా అనేక వేషాలు వేసి చివరికి పాలిగాడి వేషంలోనే పాలిగాడిని అంతమొందించిందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఆ విధంగానే ఇక్కడి ప్రతిఏటా ఈ నెలలో వారం రోజులపాటు ఈ జాతరను నిర్వహిస్తారు. పాలెగాడి కోసం గంగమ్మ కట్టిన వేషాలే భక్తులు జాతర సమయంలో ధరిస్తారు. ఈ ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో ఆరువేషాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. బైరాగి వేషంతో ఈ జాతర ప్రారంభవుతుంది.
అందుకే ఇది వేషాల జాతరగా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ జాతరలో ఐదవరోజు మాతంగి వేషం. దీనికున్న ప్రత్యేకతే వేరు. పురుషులు స్రీలలా వేషధారణ చేస్తారు. ఇలా చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు నమ్ముతారు. అందుకే సిగ్గు పడకుండా చీరలు కట్టుకుని సింగారించుకుని జాతరలో సందడి చేస్తుంటారు. ఇక గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ జాతరలో అమ్మవారినే తిట్టడం మరో స్పెషాలిటీ. భక్తులంతా బూతుపురాణం అందుకుంటారు. నోటికి వచ్చిన తిట్లను తిడుతుంటారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట. అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు ఇక్కడి ప్రజలు.
ఈ గంగమ్మ జాతరకు కేవలం స్థానిక పర్యాటకులు మాత్రమే కాదు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వాసులు సైతం తరలి వస్తుంటారు. తిరుపతిని మొత్తం ఏడుగురు గ్రామదేవతలు కాపాడుతున్నారని ఇక్కడి భక్తుల నమ్మకం. అందులో ఒకరే గంగమ్మ తల్లి. శ్రీ వేంకటేశ్వస్వామికి స్వయానా చెల్లెలు. అందుకే ఈ గంగమ్మ జాతర రాయలసీమలో అంతగా ప్రసిద్ధి చెందింది.



Click it and Unblock the Notifications













