మనదేశంలో సంప్రదాయానికి గౌరవానికి కొదవేలేదు. అది కేవలం మనుషులకే కాదు. మనకు సాయపడే దేనికైనా ఆ గౌరవం దక్కుతుంది. అలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. మన గోదావరి ఎక్స్‌ప్రెస్. శుక్రవారం ఫిబ్రవరి 2 తో ఈ రైలు యాభై సంవత్సరాలు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవాలతో అరుదైన గుర్తింపు పొందింది. ఈ తరహా రైలు ప్రయాణికుల మనసును హత్తుకునే సంఘటనలు చాలా అరుదుగా తారసపడతాయి. మరి ఈ గోదావరి ఎక్స్‌ప్రెస్ యాభైఏళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి నెమరు వేసుకుందామా...
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను ప్రతిరోజూ కలిపే ప్రసిద్ధ రాత్రిపూట రైలు గోదావరి ఎక్స్‌ప్రెస్ శుక్రవారంతో (ఫిబ్రవరి 2 ) 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లోని విజయవాడ డివిజన్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మరియు తెలంగాణలోని హైదరాబాద్‌లను కలిపే గోదావరి ఎక్స్‌ప్రెస్ స్వర్ణోత్సవ పరుగును పురస్కరించుకుని, తెలుగు ప్రజలు ఈరైలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) నరేంద్ర ఎ పాటిల్ గురువారం రాత్రి 11 గంటలకు 6వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై విశాఖపట్నం నుండి చేరుకున్న రైలు నంబర్ 12727/28 (గోదావరి ఎక్స్‌ప్రెస్) 50వ సంవత్సరాన్ని ప్రారంభించారు. ఆయన వెంట రైల్వై అధికారులు, రైల్వే అభిమానులు, ఔత్సాహికులు తమ కరచాల ధ్వనులతో ఈ పరుగుల యంత్రానికి సాదర ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా "రైళ్లు భారతీయ రైల్వే యొక్క గొప్ప వారసత్వంలో ఒక భాగమని, ఇలాంటి అరుదైన సందర్భాలను ఆనందంగా జరుపుకోవడం మనందరి భాద్యత అని డివిజనల్ రైల్వే మేనేజర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 1,1974న తొలిసారిగా పట్టాలెక్కిన గోదావరి...
నిజానికి, గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రారంభ దశలో దీని గరిష్ట వేగం 50 kmph. ఈ రైలు వేగాన్ని విజయవాడ మరియు సికింద్రాబాద్ డివిజన్‌లలో క్రమక్రమంగా 130 kmphకి పెంచబడింది. " ఫిబ్రవరి 1, 1974న మొదటిసారి పట్టాలెక్కిన గోదావరి ఎక్స్‌ప్రెస్ అందరికీ అనుకూలమైన సమయాలలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలను పొందింది.
అప్పట్లో ఈ రైలు 7007, 7008 నంబర్లతో నడిచేది. ఇప్పుడు 12727, 12728 నంబర్లతో రాకపోకలు సాగిస్తోంది. అప్పటి నుండి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చింది ఈ గోదావరి ఎక్స్‌ప్రెస్.
ఈ రైలు 18 రైల్వేస్టేషన్లలో ఆగుతుంది...
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరాంధ్రకు కేంద్రబిందువుగా ఉన్న పోర్ట్ సిటి విశాఖపట్నం, తెలంగాణ భాగ్యనగరమయిన హైదరాబాద్ మధ్య ఏడువందల ఆరు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ ఉంది. ఈ ప్రయాణంలో 18 రైల్వేస్టేషన్లను ఆప్యాయంగా పలకరిస్తోంది. రైలు ఆక్యుపెన్సీ రేటు సగటున 125 శాతం. ఇక, ఈ రైలు ప్రయాణ దూరం 710 కిలో మీటర్లు.
సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిముషాలు ఉంటుంది. ఈ రైలు 17 భోగీలతో ప్రయాణిస్తుంది. గోదావరి రైలు గంటకు 57 కిలోమీటర్లతో ప్రయాణిస్తుంది. గోదావరి రైలు కోచ్‌ల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యత ఇలా అన్ని విషయాల్లో ప్రత్యేకంగా నిలిచింది. మరీ ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే వందలాది వలస జీవుల ఆత్మీయ నేస్తంగా గోదావరి ఎక్స్‌ప్రెస్ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.



Click it and Unblock the Notifications













