రిషికేష్‌లో పర్యాటకులు సందర్శించేందుకు ఎన్నో అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా విరాజిల్లుతుంది. ఇక్కడ ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇది ఒక యోగా కేంద్రంగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం రిషికేష్‌లో అంతర్జాతీయ యోగా ఫెస్టివల్ నిర్వహించబడుతుంది. ఈ ఏడాది కూడా ఈ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. మార్చి 15 నుండి మార్చి 21 వరకు అంతర్జాతీయ యోగా ఉత్సవం ఉంటుంది. ఇక, ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి యోగా ప్రేమికులు తరలివస్తుంటారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు ఉంటుంది.

ప్రత్యేక సెషన్‌లు..
ఈ ప్రదేశం కేవలం ఆధ్యాత్మిక నగరంగా కాకుండా, యోగా రాజధానిగా కూడా గుర్తింపు పొందింది. ఇక్కడ యోగా నేర్చుకునేందుకు భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా యోగా ప్రియులు తరలి వస్తుంటారు. ఈ ఉత్సవంలో పాల్గొనడంతో పాటు ఇక్కడి అందమైన ప్రదేశాలను సందర్శించేందుకు కూడా ఇదొక చక్కని అవకాశమనే చెప్పుకోవాలి. ఇక, ఈ ఏడాది ఈ ఉత్సవాన్ని గంగా నది ఒడ్డున ఉన్న ముని కి రేటిలో నిర్వహించనున్నారు. ఈ వారం రోజుల ఉత్సవంలో పాల్గొని, యోగా సాధన చేయవచ్చు, వీటితో పాటు ప్రత్యేక యోగా సెషన్‌లు తీసుకోవచ్చు, వెల్‌నెస్ వర్క్‌షాప్‌లతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా హాజరుకావొచ్చు. ఈ ఉత్సవంలో పాల్గొనడం ద్వారా యోగా, ధ్యానానికి సంబంధించిన పురాతన విషయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఈ అంతర్జాతీయ యోగా ఉత్సవానికి యోగా గురువులు, ఆధ్యాత్మిక వక్తలు, ఆరోగ్య నిపుణులు నాయకత్వం వహిస్తారు. ఈ ఉత్సవాన్ని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డ్ నిర్వహిస్తుంది.
70 గంటలకు పైగా యోగా తరగతులు...
వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో అనేక ప్రత్యేకతలు ఉంటాయి. 70 గంటలకు పైగా యోగా తరగతులు జరుగుతాయి. ఈ ప్రత్యేక యోగా తరగతులను ప్రపంచ స్థాయి యోగా గురువులు తీసుకుఒటారు. ఈ యోగా తరగతుల్లో పాల్గొనే వారు అయ్యంగార్ యోగా, క్రియా యోగా కుండలిని యోగా, పవర్ విన్యాస యోగా వంటి ఇతర భిన్న యోగా శైలిలను నేర్చుకోవచ్చు. ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మిక గురువులతో ముచ్చటించొచ్చు. ఈ ఉత్సవంలో పాల్గొనేవారు తప్పకుండా ఇక్కడి అందమైన అద్భుత ప్రదేశాలను కూడా వీక్షించొచ్చు. ఇక్కడికి సమీపంలోని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

రిషికేశ్‌లో చూడదగిన ప్రదేశాలు
రిషికేశ్‌లో ఉన్న రామ్ లక్ష్మణ్ ఝులా ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి. దీంతోపాటు తేరా మంజిల్ టెంపుల్, త్రయంబకేశ్వర్ టెంపుల్ వంటి ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. గంగా నది ఒడ్డున వెలసిని ఈ దేవాలయం ప్రత్యేక శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి సమీపంలోని నీలకంఠ మహాదేవ్ ఆలయాన్ని కూడా పర్యాటకులు సందర్శించొచ్చు. ఈ ప్రదేశాన్ని ఓ ప్రత్యేకత ఉంది. సముద్ర మథనం సమయంలో విడుదలైన విషాన్ని శివుడు తాగిన ప్రాంతమని చెబుతుంటారు.
గంగా, యమునా, సరస్వతి సంగమం జరిగే త్రివేణి ఘాట్‌ను తప్పక సందర్శించాల్సిందే. గంగా నది ఒడ్డున ఉన్న వశిష్ఠ గుహ కూడా పర్యాటకులు సందర్శిచదగ్గ ప్రదేశం. వశిష్ఠ మహర్షి వేల సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశంగా దీనిని అభివర్ణిస్తారు.
ఇంకా ఇక్కడ అనేక కార్యకలపాలను ఆస్వాదించొచ్చు. వైట్ వాటర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్, జిప్ లైనింగ్, జెయింట్ స్వింగ్, ట్రెక్కింగ్, రాత్రి క్యాంపింగ్, పర్వత అధిరోహణం, మోటార్ సైకిల్ తో పర్వతారోహణం వంటి వాటిని ఎంజాయ్ చేయొచ్చు.



Click it and Unblock the Notifications













