ఐఆర్‌సీటీసీ రైలు టికెట్ల కోసం మనం ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తూ ఉంటాం. అలాంటప్పుడు కొన్ని సందర్భాలలో సాంకేతిక కారణాల వల్ల టికెట్ బుక్ అవ్వకపోయినా మన అకౌంట్ నుంచి డబ్బులు మాత్రం డెబిట్ అయిపోతాయి. ఇలాంటి అనుభవాలు మనలో చాలామందికే ఎదురై ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఆ డబ్బులు మళ్లీ మన అకౌంట్‌లోకి రీఫండ్ అవ్వడానికి వారం రోజుల సమయం పట్టేది. ఇలాంటి సందర్భాలలో వినియోగదారులు చాలా అసౌకర్యానికి గురయ్యేవారు. అయితే, తాజాగా ఈ తరహా సమస్యలను అధిగమించేందుకు ఐఆర్‌సీటీసీ సిద్ధమైంది.
సాధారణంగా రైలు ప్రయాణం కోసం చాలామంది ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేస్తూ ఉంటారు. అయితే, కొన్ని సందర్భాలలో టికెట్ బుక్ కాకపోయినా ఖాతాలో డబ్బులు మాత్రం డెబిట్ అవుతుంటాయి. సాంకేతిక కారణాల వల్ల కూడా ఇలా డబ్బులు కట్ అవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో టికెట్ మాత్రం జారీ అవ్వదు. అయితే, ఆ సదరు మొత్తాలను ఐఆర్‌సీటీసీ రిఫండ్ చేసే ప్రక్రియ పూర్తవ్వడానికి రోజుల సమయం పడుతోంది. ఇలా రైల్వే టికెట్లు బుక్ చేసేవారికి తరచూ ఎదురయ్యే సమస్యగానే చెప్పొచ్చు. ఇప్పుడు త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. రిఫండ్ ప్రక్రియను ఐఆర్‌సీటీసీ వేగవంతం చేసేందుకు ప్రణాళికలు వేస్తొంది. ఇది అమల్లోకి వస్తే.. గంట లేదా కొన్ని గంటల వ్యవధిలోనే నగదును రీఫండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

రిఫండ్ల జారీపై దృష్టి
అంతేకాదు, సాధారణంగా టికెట్లు బుక్ కాని సందర్భంలో మరుసటి రోజున ఐఆర్‌సీటీసీ ఈ ప్రక్రియను మొదలుపెడుతుంది. ఆ తర్వాత బ్యాంకులు/ పేమెంట్ గేట్‌వేలు ఆ ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియ కొనసాగింపుగా 3-4 పనిదినాలు పడుతుంది. డెబిట్/ క్రెడిట్ కార్డు వినియోగించిన సందర్భాల్లో ఈ ప్రోసస్ పూర్తవడానికి వారం రోజులు కూడా అవుతోంది. ఒక్క బుకింగ్ సమయంలోనేకాదు.. టికెట్టు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నపుడు టికెట్ క్యాన్సిల్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. టీడీఆర్ విషయంలో మరింత ఎక్కువ సమయం పడుతోంది. అయితే ప్రస్తుతం మానవ సంబంధం లేకుండా అన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతున్నందున.. ఈ రిఫండ్ల జారీకి మాత్రం ఎందుకింత ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ రిఫండ్ల జారీపై దృష్టి సారించింది.
రిఫండ్లను ఒకే గొడుకు కిందకు..
ప్రధానంగా ఎప్పటికప్పుడు ఈ తరహా ఫిర్యాదులు రిఫండ్‌ల గురించి యూజర్ల నుంచి వస్తోన్న నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అన్నిరకాల రిఫండ్లను ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. నిజానికి, రిఫండ్ల జారీ చేసేందుకు పడుతోన్న సమయాన్ని గణనీయంగా తగ్గించాలని రైల్వే బోర్డు సంబంధిత విభాగాలకు ఈ ఏడాది జనవరిలోనే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐఆర్‌సీటీసీ, ఆ సంస్థకు ఐటీ సేవలందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ప్రస్తుతం దీనిపై ప్రత్యేక శ్రద్దతో పనిచేస్తున్నాయి.



Click it and Unblock the Notifications













