మరికొద్దిరోజుల్లో వేసవి సెలవులు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో చాలామంది తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధపడుతుంటారు. లేదంటే విహరయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అటువంటి వారు చాలామంది రైలు మార్గాలనే ఎంచుకుంటారు. ఎందుకంటే అతితక్కువ బడ్జెట్‌తో సూదూర ప్రాంతాలను వీక్షించొచ్చు. ఇక, మాములూ రోజుల్లోనే ట్రైన్ల రద్దీ ఉంటుంది. ఈ సెలవుల్లో ట్రైన్ల రద్దీ చెప్పక్కర్లేదు. పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోతుంది. ఇలాంటి తరుణంలో రైల్వేశాఖ పలు సమ్మర్ స్పెషల్ ట్రైన్లను కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది.
అయితే, రైలు ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకనుంచి రైల్వేల్లో రూ. 20కే భోజనం అందించనుంది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు తక్కువ ధరలోనే ఆహారం అందించే ఓ సరికొత్త నూతన విధానాన్ని దక్షిణ మధ్య రైల్వే తీసుకువచ్చింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు స్టేషన్లలో ఈ విధానం కింద సరసమైన ధరకే ఆహారం అందించనున్నారు. జనరల్ బోగీల్లోని ప్రయాణికుల కోసం 20 రూపాయలకే భోజనం అందించేలా రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

150 కేంద్రాలలో నూతన విధానం అమలు..
ఇకనుంచి రైల్వేలో ప్రయాణికులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని తక్కువ ధరలోనే అందించాలనే ఉద్దేశంతో ఎకానమీ మీల్స్‌కు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. ఇండియన్ రైల్వే, ఐఆర్‌సీటీసీ సంయుక్తంగా రైలు ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్‌ను ఇటీవల తీసుకువచ్చాయి. వేసవి సెలవుల కారణంగా రైళ్లలో అధిక రద్దీ నెలకొంటోంది. ఈ క్రమంలో జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం సరసమైన ధరలో భోజనం అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక, ఈ నూతన విధానాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట , గుంతకల్ , తిరుపతి , రాజమండ్రి, వికారాబాద్, పాకాల, డోన్, నంద్యాల రైల్వే స్టేషన్‌లలో 18 కౌంటర్ల ద్వారా ఈ ఎకానమీ మీల్స్ అందిస్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న వందకుపైగా రైల్వే స్టేషన్లలో కూడా 150 కేంద్రాల ద్వారా ఈ విధానం ద్వారా ప్రయాణికులకు అతి తక్కువ ధరతో భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

ఎకానమీ మీల్స్‌లో భాగంగా రెండు రకాల భోజనం..
అయితే తాజాగా ఎకానమీ మీల్స్‌లో భాగంగా రెండు రకాలైన భోజనాన్ని దక్షిన మధ్య రైల్వే ప్రయాణికులకు అందించనుంది. మొదటి రకం ఎకానమీ భోజనంలో 20 రూపాయలకే ప్రయాణికులకు భోజనం అందించగా, రెండోరకంలో 50 రూపాయలకు స్నాక్ మీల్స్ ప్రయాణికులకు అందిస్తారు. ప్రయాణికులు ఈ భోజనాలను నేరుగా కౌంటర్ల నుంచి పొందొచ్చని తెలిపారు. ఈ భోజనం, నీటి ప్యాకెట్లను సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఆగేచోట ఫ్లాట్ ఫారమ్‌లపై అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.
అయితే, ప్రయాణికులు ఈ కౌంటర్ల నుంచి నేరుగా ఈ ఎకానమీ మీల్స్‌ను కొనుగోలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, ఈ నూతన విధానాలను గత సంవత్సరం 51 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దక్షిణ మద్య రైల్వేలోని 7 స్టేషన్‌లలో ఐ.ఆర్.సీ.టి.సీ కిచెన్ యూనిట్ల ద్వారా ప్రయాణికులకు ఈ భోజనం అందిస్తున్నారు. మరెందుకాలస్యం ట్రైన్లలో ప్రయాణించేటప్పడు మీరు కూడా ఈ సేవలను వినియోగించుకోండి మరి...



Click it and Unblock the Notifications













