దేశంలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని భద్రాచల ఆలయం ఎంతో పేరుగాంచింది. ఏటా ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీతారామచంద్రస్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు వేలాది సంఖ్యలో భక్తులు బారులు తీరనున్నారు. ఇక, ఈ ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 17వ తేదిన ఆలయంలో సీతారాముల కల్యాణం, 18వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది.

సుమారు రెండు లక్షల మంది భక్తులు..
ఏప్రిల్ 9వ తేదిన ఉగాది పర్వదినం. ఆ రోజునే బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నందున అప్పటిలోగా పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో ఎల్.రమాదేవి తెలిపారు. అధికారుల సమక్షంలో ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణానికి, మహోత్సవాలకు సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకోసం ప్రత్యేకంగా తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు నిర్మించడంతో పాటు, మంచినీటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. ప్రధాన ఆలయం, ఉపాలయాలు, పర్ణశాల వద్ద గల రామాలయాన్ని విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు.
రాములోరి తలంబ్రాలు ఇక ఇంటికే..!
సీతారాముల కల్యాణం తర్వాత తలంబ్రాలను నేరుగా భక్తుల ఇళ్లకు సరఫరా చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి, భక్తుల వివరాలతో తలంబ్రాలు బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను నేరుగా ఇంటికి పంపించనున్నారు. ఈ వెసులుబాటు రాష్ట్రంలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు డిపోల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ సారి ఐదు లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేసేందుకు ఆలయ అధికారులు ప్రణాళికలు వేశారు. భద్రాద్రి ఆలయంలో కూడా ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు విక్రయించనున్నారు. శ్రీరామనవమి కోసం 3 లక్షల లడ్డూలను తయారు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆర్టీసీ ద్వారా 3.50 లక్షల ప్యాకెట్లు, పోస్టల్ ద్వారా లక్ష ప్యాకెట్ల ఆర్డర్ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం..
భ్రదాద్రిలో జరిగే సీతారాముల కల్యాణం, మహాపట్టాభిషేక కార్యక్రమాలకు హాజరయ్యే భక్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులో ఉంచినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. రాములోరి కళ్యాణానికి సంబంధించి రూ. 7,500, రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150 సెక్టార్లుగా విభజించారు. వీటికి సంబంధించిన మొత్తం 11,440 టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టడం జరిగింది. అయితే, ఇప్పటివరకు కేవలం 1,100 టికెట్ మాత్రమే బుక్ అయినట్లు అధికారులు తెలిపారు.
మహాపట్టాభిషేక కార్యక్రమం కోసం రూ.1,500, రూ.500, రూ.100 సెక్టార్లుగా విభజించారు. వీటితో పాటు ఫ్రీ సెక్టార్లు సైతం అందుబాటులో ఉన్నాయి. భక్తుల కోసం ఆన్‌లైన్‌లో పరోక్ష సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్ల ధరలను రూ.5 వేలు, రూ.1,116లుగా నిర్ణయించారు. టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు భక్తులు ఈ వెబ్‌సైట్‌ను bhadradritemple.telangana.gov.in సంప్రదించవచ్చు.



Click it and Unblock the Notifications













