75 వ గణతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహిస్తారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయిన 75 వ గణతంత్ర దినోత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటుకుంది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో 70 వేల మందితో భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.
అందులో 14 వేల మందిని కర్తవ్యపథ్‌లో ఉన్నారు. కర్తవ్యపథ్‌లో 90 నిమిషాలపాటు జరిగే ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో, సైనిక శక్తిని చాటడంతోపాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను కూడా నిర్వహించారు. ఈ 75వ గణతంత్ర దినోత్సవ థీమ్‌ను జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలతో కూడా రూపొందించడం జరిగింది.

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించడంతో ఈ రిపబ్లిక్ డే వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో గణతంత్ర వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ బగ్గీని ఉపయోగించడం జరిగింది. కర్తవ్యపథ్‌కు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత పరేడ్, శకటాల ప్రదర్శన జరిగింది. అనంతరం రిపబ్లిక్ డే పరేడ్‌తోపాటు మిగిలిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు శకటాలు...
ఇక, ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో 90 మంది సభ్యుల ఫ్రాన్స్ సైన్యం కూడా హాజరు కావడం విశేషం. 260 మంది సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ మహిళా సైనికులు నారీ శక్తి పేరుతో విన్యాసాలను ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు శకటాలు ఉండటం మరో విశేమనే చెప్పుకోవాలి. వీటన్నింటితోపాటు సామాజిక-ఆర్థిక కార్యకలాపాలతోపాటు శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన మహిళలకు చెందిన 10 శకటాలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక, ఈ సైనిక ప్రదర్శనలో భారత్‌లో తయారుచేసిన ఆయుధాలు, క్షిపణులు, నిఘా వ్యవస్థలు, డ్రోన్ జామర్లు, వాహనాలపై అమర్చే మోటార్లు, బీఎంపీ-2 సాయుధ శకటాలను ఉంచారు. దేశంలోనే తొలిసారిగా మొత్తం మహిళా సైనికులే ఉన్న త్రివిధ దళాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. దేశ చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా దీప్తి రాణా, ప్రియాంకా సేవ్‌దా అనే మహిళా అధికారులకు ఆయుధ లొకేషన్ గుర్తింపు రాడార్, పినాక రాకెట్ వ్యవస్థలకు పరేడ్‌లో నేతృత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఇక ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. అందులో సంప్రదాయ బ్యాండ్ స్థానంలో శంఖం, నాద స్వరం, నగారా ఉపయోగించడం మరో విశేషం. మరో 15 మంది మహిళా పైలట్లు వాయు సేన విన్యాసాలను ప్రదర్శించడం జరిగింది. వీటితో పాటు 500 మంది గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.



Click it and Unblock the Notifications












