భారతీయ రైల్వే అంటే.. వేగానికి చిరునామాగా మారుతున్న రోజులివి. వందేభారత్ తరహాలో పట్టాలపై వేగంగా పరుగులు తీసే.. హైస్పీడ్ రైళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా భారత్ ప్రపంచఖ్యాతి పొందేందుకు తహతహలాడుతోంది. అత్యాధునిక సాంకేతికతను మారుపేరుగా చెప్పుకునే మనదేశంలో అతి తక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లు కూడా ఉన్నాయంటే కాస్త ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ, ఇది ముమ్మాటికీ నిజం. కేవలం 46 కిలోమీటర్ల దూరం చేరుకునేందుకు ఐదు గంటల సమయం పట్టే రైలు మన దేశంలోనే ఉంది. అది కూడా నేటికీ పరుగులు పెడుతూనే ఉంది. అంతేకాదు, నిత్యం సందర్శకులతో రద్దిగా దర్శనమిస్తోన్న ఆ రైలు ప్రత్యేకతలతోపాటు దాని ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి!
దేశంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేసే రైలు ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకున్న తమిళనాడులోని నీలగిరి మార్గంలో ఉంది. ఈ రైలు మార్గం అక్కడి మెట్టుపాళ్యం నుంచి ఊటీ వరకు పరుగులు తీస్తోంది. నిత్యం ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి ఈ మార్గంలో ప్రయాణం అంటే.. జీవితంలో మర్చిపోలేని అనుభవమనే చెప్పాలి. అంతేకాదు, ఆసియా ఖండంలోనే ర్యాక్, పినియన్ ట్రాక్స్‌పై నడుస్తోన్న ఒకే ఒక్క రైలు ఇదే అంటే ఆశ్చర్యం కలగక మానదు.

125 సంవత్సరాలుగా ప్రయాణం..
ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ రైలు మార్గంలో 16 సొరంగాలతోపాటు ఏకంగా 250 వంతెనలను దాటుకుంటూ ముందుకు ప్రయాణించాల్సి ఉంటుంది. నిజానికి, ఈ మార్గానికి చారిత్రక నేపథ్యం ఉంది. పూర్వం బ్రిటీష్ వారు మనదేశాన్ని పరిపాలించిన సమయంలో ఎద్దుల బండిపై ఊటీకి ప్రయాణం చేసేవాళ్లు.
అక్కడి ప్రశాంతమైన వాతావరణానికి ముగ్ధులైన వారు ప్రయాణపు ఇబ్బందుల నుంచి బయటపడేందుకు 1890లో కూనూరు వరకు ర్యాక్, పినియన్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అలా ఆవిరితో నడిచే రైలులో మొదలైన ప్రయాణం 125 సంవత్సరాలుగా కొనసాగుతూనే వస్తోంది. పొగలు కక్కుతూ దూసుకుపోయే ఈ రైలు ప్రయాణం ఓ సరికొత్త అనుభూతిని చేరువ చేస్తుందనే చెప్పాలి.

గంటకు తొమ్మిది కిలోమీటర్లు..
అందుకే, నేటి ఉరుకులపరుగుల సమాజంలోనూ దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలుగా నీలగిరి మౌంటెన్ రైలు గుర్తింపు సంపాదించుకుంది. ఈ రైలు గంటకు కేవలం తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళుతుంది. అయితే, తిరుగు ప్రయాణంలో మాత్రం మూడున్నర గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఇక్కడికి దేశ విదేశీ పర్యాటకులు సీజన్‌తో సంబంధం లేకుండా విహారానికి వస్తూ ఉంటారు. అంతేకాదు, అనేక సూపర్ హిట్ సినిమాలు ఈ రైలులో చిత్రీకరించారు.
మణిరత్నం దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన దిల్ సే చిత్రంలోని చయ్య చయ్యా.. సూపర్ హిట్ సాంగ్ ఈ రైలులోనే షూట్ చేశారని చాలామందికి తెలియదు. ఇంతటి నేపథ్యం ఉన్న ఈ రైలులో ఒక్కసారైనా ప్రయాణం చేయాలని.. పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదించాలని ఎవ్వరైనా కోరుకోకుండా ఉండలేరు. మీకూ అలాంటి కోరికే ఉంటే మాత్రం వెంటనే మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.



Click it and Unblock the Notifications













