కొడైకెనాల్‌లో ట్రెక్కింగ్ స్పాట్స్‌కు కొదవ లేదండోయ్!
తమిళనాడులోని కొడైకెనాల్‌లో ట్రెక్కింగ్ చేయడం నిజంగా ట్రెక్కర్‌లకు అసలుసిసలైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈ నగరం అనేక ప్రకృతిసిద్ధమైన కొండకోనల నిలయంగా పేరుగాంచింది. ఇది ట్రెక్కింగ్‌లో అనువజ్ఞులతోపాటు కొత్తవారికీ అవకాశం కల్పిస్తుంది.
అందుకు కారణం ఈ ప్రాంతంలో ఎంతోమంది ట్రెక్కింగ్ నిపుణులు అందుబాటులో ఉంటారు. అంతేకాదు, ఇక్కడి అడవి అందాలను ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కూడా పిలుస్తారు. అలాగే, తమిళంలో ఈ నగరం పేరుకు అటవీ బహుమతి అని అర్థం వస్తుంది. కొడైకెనాల్ హిల్ స్టేషన్‌ల యువరాణిగా పేరుపొందింది కూడా.

కొడైకెనాల్‌లోని ట్రెక్కింగ్ ప్రదేశాలు గడ్డి భూములు, యూకలిప్టస్ చెట్లు, టెర్రేస్ గార్డెన్‌లు, జలపాతాలు, పచ్చికభూములు, రంగురంగుల పూల గుంపులు, లోతైన లోయలు, ప్రవాహాలతో నిండి ఉంటాయి. ఇక్కడి కొండలు అడవుల గుండా ట్రెక్కర్‌లను తీసుకువెళతాయి. కొడైకెనాల్ ట్రెక్కింగ్ స్పాట్‌ల విశిష్టత ఏమిటంటే, ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ గైడ్‌లచేత మాత్రమే నిర్వహించబడుతుంది. కొడైకెనాల్‌లో ట్రెక్కింగ్ ట్రయల్స్ లెక్కలేనన్ని ఉన్నాయి. కొడైకెనాల్ ట్రెక్కింగ్ ప్రదేశాలు చాలా వరకు ట్రెక్కర్లను అరణ్యాల లోతుల్లోకి తీసుకువెళతాయి. అనేక ట్రెక్కింగ్ స్పాట్‌లు చూసేందుకు అందంగా కనిపించినా, నిటారుగా సాహసంతో కూడుకున్నవిగా ఉంటాయి, ఇవి అద్భుతమైన జలపాతాలు మరియు సుగంధ టీ ఎస్టేట్‌లను ట్రెక్కర్‌లకు పరిచయం చేస్తాయి.
తలైయార్ జలపాతాలు : ఈ జలపాతాలు ట్రెక్కర్‌లకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఇవి ఒక వైపు నుండి ట్రెక్ చేసేందుకు దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. పైకి వెళుతున్నంతసేపూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎత్తుకు వెళ్లేకొలదీ ప్రకృతి అందాలు ఒక్కొక్కటిగా దర్శనమిస్తాయి.
బేర్ షోలా జలపాతం : ఈ జలపాతం నుండి కొడైకెనాల్‌లోని ఫారెస్ట్ ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ట్రెక్కర్లకు పరిచయం చేస్తూ అడవిలోకి ఒక చిన్న ట్రెక్కింగ్ ట్రాక్ దారి చూపుతుంది. అయితే, ఇది కాస్త కఠినమైన మార్గంగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి చేరుకునేందుకు సందర్శకులకు కేవలం ఐదు నిమిషాలే పడుతుంది. ఏడాది పొడవునా కుటుంబాలతోపాటు ఔత్సాహిక ట్రెక్కర్లు ఇక్కడికి వస్తూ ఉంటారు.

పళని కొండలు : లోతైన అడవుల నుండి అందమైన పచ్చటి గడ్డి భూముల వరకు - కొడైకెనాల్‌లోని పళని కొండలకు ట్రెక్కింగ్ అద్భుతమైన అనుభూతిని పరిచయం చేస్తాయి. తెల్లని పొగమంచును చీల్చుకుంటూ సాగే పళని కొండల ట్రెక్కింగ్ ప్రకృతి అందాలను దగ్గరగా పరిచయం చేస్తుంది. ఇక్కడి ముఖ్యమైన ట్రెక్కింగ్ స్పాట్‌ల జాబితాలో దీనికి మంచి స్థానం లభిస్తుంది.
కొడైకెనాల్‌లోని ఇతర ట్రెక్కింగ్ ఆకర్షణలు కూడా ఉన్నాయి. వాటిలో కొడైకెనాల్ సరస్సు, పిల్లర్ రాక్స్‌లోని డెవిల్స్ కిచెన్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, బైసన్ వెల్స్ మరియు పెరుమాళ్ పీక్, డాల్ఫిన్ నోస్ కొడైకెనాల్ వంటి స్పాట్స్ ఇక్కడి ట్రెక్కింగ్‌ను ఉత్సాహభరితంగా మార్చేస్తాయి. అంతేకాదు, పెరియకులం అడుక్కం- కొడైకెనాల్ అత్యంత సవాళ్లతో కూడుకున్న ట్రెక్కింగ్ మార్గాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీనిని ఏడు గంటలలోపు చేరుకోవచ్చు. అలాగే, సులభమైన నడకను ఇష్టపడే వారికి, కొడైకెనాల్ నుండి బెరిజామ్ మార్గం ఎంతో అనుకూలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications














