పబ్లిక్ ప్రదేశాలలో ఉండే ఫోన్ ఛార్జింగ్ స్టేషన్లు లేదా పాయింట్లను ఉపయోగించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లు, రైల్, బస్ స్టాండ్‌లలో సాధారణంగా కనిపించే ఈ స్టేషన్‌లు లేదా పాయింట్‌ల కారణంగా USB ఛార్జర్ స్కామ్‌లతో ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
జ్యూస్-జాకింగ్ అంటే ఏంటి?
ప్రయాణ సమయాల్లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం ఈ ఛార్జింగ్ స్టేషన్‌లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ సధుపాయాన్ని చాలామంది వినియోగించుకుంటూ ఉంటారు. అయితే, సైబర్ నేరస్థులు USB ఛార్జర్ స్కామ్‌ను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం స్కామర్లు ఉపయోగించే వ్యూహాలలో ప్రధానమైనదాన్ని "జ్యూస్-జాకింగ్" అని పిలుస్తారు. ఇది వినియోగదారుల డేటా భద్రతకు ప్రమాదాన్ని కలిగిస్తుంది.
జ్యూస్-జాకింగ్ అనేది USB ఛార్జింగ్ పోర్ట్‌లు లేదా వాటికి మాల్వేర్‌తో కనెక్ట్ చేయబడిన కేబుల్‌లను అనుసంధానం చేస్తుంది. ఇలా అనుసంధానించబడిన పోర్ట్‌లు ఎక్కువగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లలో ఉంటాయి. ఇవే సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారాయి.

జ్యూస్-జాకింగ్ ఎలా పని చేస్తుంది?
ప్రయాణికులు ఛార్జింగ్ కోసం వారి మొబైల్‌లను బహిరంగ ప్రదేశాలలోని పోర్ట్‌లకు కనెక్ట్ చేసినప్పుడు అప్పటికే ఆ పోర్టులు జ్యూస్-జాకింగ్‌కు అనుసంధానించి ఉండడంతో డేటా దొంగతనం, మాల్వేర్ ఇన్‌స్టాలేషన్ లేదా మొబైల్ హైజాకింగ్‌కు గురవుతారు. సాధారణంగా, USB పోర్ట్‌లు విద్యుత్ మరియు డేటా రెండింటినీ బదిలీ చేస్తాయి. అయితే ఈ జ్యూస్-జాకింగ్ ఛార్జింగ్ సమయంలో కూడా డేటా బదిలీ కోసం యాక్టివ్‌గా ఉండేలా పోర్ట్‌ను మానిప్యులేట్ చేస్తుంది. ఇది వినియోగదారుల సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, కీస్ట్రోక్‌లను పర్యవేక్షించడానికి లేదా కనెక్ట్ చేయబడిన మొబైల్‌లకు వైరస్‌లను అప్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది.
నైపుణ్యం కలిగిన హ్యాకర్ల ద్వారా..
ఏప్రిల్ 2023 నాటికి, జ్యూస్-జాకింగ్ కేసులు పెద్దగా నిర్ధారించబడలేదు. అయినప్పటికీ, చాలా మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు వినియోగదారులకు జ్యూస్-జాకింగ్ ఒక ప్రధానమైన ముప్పుగా పరిగణించనిస్తున్నారు. నైపుణ్యం కలిగిన హ్యాకర్ల ద్వారా ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులనే టార్గెట్‌గా దీనిని వినియోగిస్తున్నారు.
నివారణ చర్యలు..
USB ఛార్జర్ స్కామ్‌కు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి CERT-ఇన్ అడ్వైజరీ కొన్ని సూచనలు అందిస్తుంది.
- పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు లేదా ఛార్జర్లను ఉపయోగించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
- తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ USB పోర్ట్‌ని ఉపయోగిస్తే, డేటా-బ్లాకింగ్ అడాప్టర్ లేదా కేబుల్‌ని ఉపయోగించండి.
- ప్రయాణ సమయాల్లో పబ్లిక్ USB స్టేషన్‌లను ఉపయోగించకుండా ఉండటానికి ఎల్లప్పుడూ మీ సొంత పవర్ బ్యాంక్ లేదా ఛార్జింగ్ కేబుల్‌ని తీసుకు వెళ్లడం శ్రేయస్కరం.
- మీ మొబైల్ PIN లేదా పాస్‌వర్డ్ లాక్ వంటి భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. హ్యాకింగ్ నిరోధించడానికి తెలియని పరికరాలతో మొబైల్‌ను కనెక్ట్ చేయకుండా ఉండాలి. సైబర్-దాడులకు గురికావడాన్ని తగ్గించడానికి మీ ఫోన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు ఛార్జ్ చేయడం ఉత్తమం.
- సాధ్యమైనప్పుడల్లా, మీ మొబైల్ పరికరాన్ని ఛార్జ్ చేయడానికి ఎలక్ట్రికల్ వాల్ అవుట్‌లెట్‌లను ఉపయోగించండి.
- USB ఛార్జర్ స్కామ్‌కు గురైనట్లు మీరు అనుమానించినట్లయితే, వెంటనే అలెర్డ్ అవ్వాలి. సైబర్ మోసానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే 1930కి కాల్ చేసి, సమాచారాన్ని చేరవేయాలి.



Click it and Unblock the Notifications













