చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం... భువనగిరి కోట..!
తెలంగాణ రాష్ర్టంలో పర్యాటకులు సందర్శించేందుకు ఎన్నో ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో పోరాటాలకు, చరిత్రకు చిహ్నమైన తెలంగాణ రాష్ర్టంలో ఎన్నో యేళ్ల క్రితం నాటి కోటలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటే భువనగిరి కోట. ఈ కోట యాదాద్రి జిల్లాలోని భువన గిరి పట్టణంలో ఉంది. ఏకశిలపై నిర్మించబడిన ఈ ధృడమైన కోట 300 అడుగుల ఎత్తులో ఉంది. 40 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ కోట పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువనమళ్ల విక్రమాదిత్యచే నిర్మించబడింది.
ఉక్కు తలుపులు, ఆయిధ భాండాగారం, గుర్రపుశాలలు, సరస్సులు, మంచినీటి బావులు సందర్శకులను ఆకర్షిస్తాయి. ఈ కోట కోడి గుడ్డు ఆకారంలో ఉండడం దీని ప్రత్యేకత. ఈ కోటపై కన్నడ, తెలుగు భాషలలో పలు శాసనాలు లభించాయి. త్రిభువనమళ్ల పేరిట ఈ కోటను మొదటగా త్రిభువనగిరిగా పిలవబడేది. నవాబుల కాలంలో భువనగిరిగా మార్చినట్లు తెలుస్తుంది. కొండపై ఉన్న ఏడు కోనేరులు సప్త సరస్సులుగా ప్రసిద్ధి చెందాయి.

కోట ప్రత్యేకతలు..
హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఏకశిల రాతి గుట్టపై నిర్మించిన ప్రాచీన కట్టడం భువనగిరి కోట. 610 మీటర్ల ఎత్తైన ఈ కొండ తెలంగాణలోని ఉర్లుకొండ, ఉండ్రుకొండ, అనంతగిరుల కంటే ఎత్తైనది. అండాకారపు ఏకశిలా పర్వతమైన ఈ కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేలులా, పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగులా కనిపిస్తుంది. ఇది బాలాఘాట్ పంక్తులలోని అనంతగిరి వరుసలలోనిది.
రెండు దారులు..
ఈ కొండకు నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి పైకి వెళ్లే మార్గాలు ఉన్నాయి. ప్రస్తుత మార్గం నైరుతి నుంచే ప్రారంభం అవుతుంది. భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అంటారు. ఈ ద్వారాన్ని నిజాం తన సొంత ఖర్చుతో నిర్మించినట్లు చెబుతారు. కోట లోపలి ప్రాకారాల్లో గుర్రపు కొట్టాలు, ధాన్యాగారాలు, సైనికాగారాలు ఉన్నాయి. రాజాప్రాసాదాల క్రింద శిలాగర్భంలో ఎన్నో అంతుచిక్కని రహస్య మార్గాలు ఉన్నాయి. ఈ సొరంగాలు ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారని చెబుతారు. భువనగిరి కొండపై ఒక శివాలయం, నల్లని నంది విగ్రహం, కొండ కింద పచ్చలకట్ల సోమేశ్వరుడు, బమ్మదేవర ఆలయం, ఒక మఠం ఉంటాయి. కాలక్రమంలో కొండపై కొన్ని దేవాలయాలు శిధిలమై గుట్ట లోయల్లో పడి ఉండడం మనం గమనించవచ్చు. కోట బురుజుపైనుండి చుట్టుపక్కల ప్రదేశాలను చూడవచ్చు

ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలం..
భువనగిరి ఇప్పుడు ట్రెక్కింగ్ కు కేరాఫ్‌గా మారింది. 500 అడుగుల ఎత్తులో 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం పర్వతారోహణకు ఎంతో అనువైనది. ఈ కొండపైకి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పడుతుంది. కాబట్టి మీ వెంట తగినంత మంచి నీటిని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ ప్రియులకు ఈ ప్రాంతం స్వర్గధామమనే చెప్పాలి.

ఎలా వెళ్లాలి..
భువనగిరి హైదరాబాద్ కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ భువనగిరి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లే కొన్ని రైళ్లు భువనగిరిలో ఆగుతాయి. ఇక హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే బస్సులు భువనగిరి గుండానే వెళ్తాయి.



Click it and Unblock the Notifications













