ఈ నెల 22 తరువాత అరకులోని పర్యాటక కేంద్రాలు మూసివేత..
చలికాలం మొదలవుతుంది. ఈ సీజన్‌లో ఏజన్సీ ప్రాంతాలకు వెళ్లాలని చాలామంది అనుకుంటుంటారు. ఎందుకంటే అక్కడంతా మంచు ప్రవహిస్తుంది. ఏజన్సీ ప్రాంతాలంటే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నాయి. ఎపీలోని ఏజన్సీ ఏరియా అనగానే వైజాగ్‌లోని అరకే గుర్తుకొస్తుంది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సీజన్‌లో చాలామంది పర్యాటకులు అరకు, లంబసింగి లాంటి ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. ఇక్కడి చల్లని వాతావరణంలో ఎంజాయ్ చేయాలనుకుంటారు చాలామంది.
అయితే, ఈ సారి అరకు, లంబసింగి వెళ్లాలనకునేవారికి నిరాశే మిగలనుందా? ఎందుకనుకుంటున్నారా? అక్టోబర్ 22 తర్వాత అరకులోని కొన్ని పర్యాటక కేంద్రాలను తాత్కలికంగా మూసివేస్తున్నారు. కాబట్టి ఇప్పట్లో ఇక్కడి ప్రాంతాలను సందర్శించే ఆలోచన పెట్టుకోకండి..ఒకవేళ ముందుగా ప్రణాళికలు వేసుకుని ఉంటే మీ ప్రయాణాన్ని విరమించుకోండి... అరకులోని పర్యాటక ప్రదేశాల మూసివేతకు గల కారణాలేంటో తెలుసుకుందామా...

టూరిజం ఉద్యోగుల సమ్మె...
విశాఖ నగరంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం చలికాలం సీజన్ మొదలైనట్టే.. పొగ మంచు దట్టంగా కమ్ముకుని ఇక్కడి ప్రకృతి సుందర దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో కనువిందు చేస్తాయి. ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు నిత్యం ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇంకా ఇక్కడ అరకుతో పాటు సందర్శించేందుకు చాలా ఏజన్సీ ప్రాంతాలున్నాయి. అందులో బొర్ర గుహలు, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, తైడ జంగిల్ బెల్స్, హరిత మయూరి, లంబసింగి.
వీకెండ్స్‌లలో, ఈ సీజన్‌లో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే ఇక్కడి పర్యాటక ప్రాంతాలు మరికొన్ని రోజుల్లో మూతపబడేలా ఉన్నాయి. ఎందుకంటే ఆయా పర్యాటక ప్రాంతాల్లో పనిచేస్తున్న టూరిజం కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సమస్యల పరిష్కరణకై ఉద్యోగ సంఘం వారు ఈ మధ్యనే కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.

కాంట్రాక్టు ఉద్యోగులే..
ఈ టూరిజం విభాగంలో పనిచేసేవారంతా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే. వీరంతా తమ డిమాండ్లు పరిష్కరించమని ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆదోనిలో నడుస్తున్న యూనిట్లపై వెయ్యిమందికి పైగా కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారు. అరకు పరిధిలోని ఆరు టూరిజం విభాగాల్లో 300 మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. 2010 నుండి పరిష్కారం కాని దీర్ఘకాలిక సమస్యలున్నాయని వాటిని త్వరతగిన పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వారు కోరుకుంటున్నారు. పదమూడేళ్లు గడుస్తున్నా ఇచ్చినా హామీలు మాత్రం నెరవేర్చడం లేదంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు.
వాగ్ధానాలు చేశారు... అమలు చేయలేదు..
అయితే వీరి డిమాండ్లపై 2010లో అప్పటి టూరిజం శాఖ ఎం.డి చందనాకాంత్, 2012 లో ఉన్న టూరిజం శాఖ ఎండి శుక్లా , గత ఏడాది కూడా ప్రస్తుతము ఉన్న టూరిజం ఎండి అమరావతి సెక్రటేరియట్‌కు ఉద్యోగ సంఘం వారిని పిలిచి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారని, అన్ని సమస్యలు పరిష్కారిస్తామని వాగ్ధానాలు చేశారని అయితే ఇప్పటి వరకు అవి ఎలాంటి అమలుకు నోచుకోలేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత ఏడాది టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సమక్షంలో ఆమోదించిన డిమాండ్లను పరిష్కరించకపోతే ఈనెల 22 తరువాత అనివార్య పరిస్థితుల్లో నిరవధిక సమ్మె తప్పదంటున్నారు ఇక్కడి ఉద్యోగస్థులు, కార్మికులు.



Click it and Unblock the Notifications













