భాగ్యనగరంలో చూసేందుకు ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. చరిత్రకు ఆనవాళ్లుగా కొన్ని నిలిస్తే.. ఆథ్యాత్మిక చింతనకు నిలయాలుగా మరికొన్ని ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే, వాటిని చూడాలంటే ప్రణాళికతోపాటు ఆయా ప్రాంతాలపై అవగాహన తప్పనిసరి. మరి ఎలాంటి ప్రణాళిక, అవగాహన లేకుండా ఒక్క రోజులోనే సిటీలో ఉన్న పర్యాటక ప్రదేశాలను చూసే అవకాశం వస్తే ఎవరైనా వద్దంటారా చెప్పిండి. అలాంటి వారి కోసం తెలంగాణ టూరిజం శాఖ ఓ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. మరెందుకు ఆలస్యం ఆ వన్ డే ట్రిప్ ప్యాకేజీ విశేషాలేంటో ఓ లుక్కేద్దామా?!
వీకెండ్స్‌తో సంబంధం లేకుండా సిటీ అందాలను చూడాలనుకునే ఔత్సాహికుల కోసం తెలంగాణ టూరిజం శాఖ ప్రవేశపెట్టిన వన్ డే ట్రిప్ ప్యాకేజీకి మంచి పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తోంది. నాన్ ఏసీ బస్సుల్లో అయితే కేవలం రూ.380, ఏసీ బస్సు అయితే రూ. 500 చెల్లించి సిటీలోని ఫేమస్ స్పాట్‌లను ఎంచక్కా చూసేయొచ్చు. అంతేకాదు, ఈ టూర్ ప్యాకేజీ వారంలో అన్ని రోజులూ.. అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నగరానికి వచ్చే కొత్తవారితోపాటు స్థానికంగా ఉండే వారు సైతం కుంటుంబసమేంతంగా టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అవి శుక్రవారం చూడలేమండోయ్..
నగరంలో విహరించేందుకు నాన్ ఏసీ బస్సులతోపాటు ఏసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. నాన్ ఏసీ బస్సులో చిన్న పిల్లలకు రూ.300, ఏసీ బస్సులో అయితే రూ.400 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్రిప్‌కు టికెట్ తీసుకునే పర్యాటకులు బిర్లా మందిర్, చౌమహాల్లా ప్యాలెస్(శుక్రవారం ఉండదు), చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్లో షాపింగ్(నడక దారిలో), సాలార్ జంగ్ మ్యూజియం(శుక్రవారం ఉండదు), నిజాం జూబ్లీ పెవిలియన్(నిజాం మ్యూజియం-పురానీ హవేలి)(శుక్రవారం ఉండదు), నెహ్రూ జూ పార్క్(శుక్రవారం మాత్రమే), గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టోంబ్స్(ఈ ట్రిప్‌లో వెళ్లేవారికి లోపలకు ప్రవేశం ఉంటదు), లుంబినీ పార్క్, ఐమ్యాక్స్ రోడ్, ఖైరతాబాద్(టర్మినేటింగ్పాయింట్)తోపాటు ప్రయాణికులు అభిష్టం మేరకు హిమాయత్ నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకునే అవకాశం కల్పిస్తారు.
రూట్ మ్యాప్ ఇలా ఉంటుంది..
పైన చెప్పుకున్న సందర్శనీయ ప్రదేశాలను ఒక్క రోజులోనే చూడాలంటే మన ప్రయాణం తొందరగానే మొదలుపెట్టాల్సి ఉంటుంది. అందుకే ఈ వన్ డే ట్రిప్ ఉదయం 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ముందుగా సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట యాత్రి నివాస్ నుంచి బయలుదేరి 7:45 గంటలకు పర్యాటక భవన్ దగ్గర చేరుకుంటుంది. పర్యాటకులు అక్కడ కూడా బస్సు ఎక్కొచ్చు. తర్వాత 8:15 గంటలకు బషీర్‌బాగ్ సీఆర్ఓ కార్యాలయం దగ్గర కూడా మరో బోర్డింగ్ పాయింట్‌ను అందించారు. సందర్శకులు బిర్లా మందిర్‌తో మొదలుపెట్టి ఆ తర్వాత చార్మినార్, మక్కా మసీదులను చూడొచ్చు. అక్కడి నుంచి బయలుదేరి.. లాల్ బజార్‌లో కొంత సమయం షాపింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు.
తర్వాత సాలార్‌జంగ్ మ్యూజియం సందర్శన ఉంటుంది. దాని తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. అక్కడినుంచి నిజాం మ్యూజియంకు వెళ్తారు. తర్వాత గోల్కొండ కోట, కోటకు దగ్గరలో ఉన్న కుతుబ్ షాహీ టోంబ్స్ సమయాన్నిబట్టీ చూసేందుకు అవకాశం ఉండొచ్చు. చివరిగా లుంబినీ పార్క్ దగ్గర రాత్రి 7:30 గంటలకు చేరురోవడంతో ఈ వన్ డే ట్రిప్ ముగుస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ఈ ట్రిప్‌ను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ https://tourism.telangana.gov.in/package/hyderabadcitytour ను క్లిక్ చేయండి.



Click it and Unblock the Notifications













